Telagnana: అంబటి రాయుడు(Ambati Rayudu) రాజకీయాలను వదిలిపెట్టినా రాజకీయాలు మాత్రం అంబటి రాయుడిని వదిలిపెట్టేలా లేవు. ఇటీవల కాలంలో క్రికెట్‌ కన్నా రాజకీయం ద్వారానే వార్తల్లో నిలిచిన అంబటి...ఏపీ ఎన్నికలు ముగియడంతో ఇక ఆ పేరు ఎక్కడా వినిపించలేదు. కానీ ఉన్నట్టుండి తెలంగాణ రాజకీయ నేతల నోటివెంట ఆయన పేరు పలకడంతో అంబటి మళ్లీ స్పందించక తప్పలేదు.


ఏ ప్రభుత్వ సాయం వద్దు
అంబటిరాయుడు..తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. క్రికెట్‌ లో ఆటతో కంటే వివాదాలతోనే ఎక్కువ పాపులర్‌ అయ్యారు. బీసీసీఐ(BCCI) తీరుపైనా, సెలక్షన్‌ కమిటీ ఎంపికపైనా ఎప్పుడూ ఏదో ఒక దుమారం రేపే అంబటి రాయుడు...క్రికెట్‌ నుంచి విరామం తీసుకున్నా ఏదో విధంగా వార్తల్లో నిలుస్తున్నారు. గత ఎన్నికల ముందు వైసీపీలో చేరడంలో రాజకీయాల్లో ఆయన పేరు  ఒక్కసారిగా మారుమోగింది. చేరినంత తొందరలోనే మళ్లీ ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి పవన్‌కు జై కొట్టాడు. ఇది ఒకంత మంచిదేనని ఆయన సన్నిహితులు అన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాతే అదే నిజమైంది. లేకుంటే ఎన్నో ఏళ్లుగా క్రికెట్‌లో సంపాదించిందంతా  ఒక్కసారిగా ఊడ్చిపెట్టుకుపోయేది. ఆ తర్వాత కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపినా...అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడా మళ్లీ కంటికి కనిపించలేదు. కానీ ఒక్కసారిగా ఆయన పేరు తెలంగాణ(Telangana) రాజకీయాల్లో వినిపించింది. బీఆర్‌ఎస్‌(BRS) ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి(Kaushik Reddy) అంబటి రాయుడికి హైదరాబాద్‌(Hyderabad)లో ప్రభుత్వం ఇంటిస్థలం ఇవ్వాలని డిమాండ్ చేయగా...అంబటి రాయుడు సున్నితంగా తిరస్కరించారు. తనకు ఏ ప్రభుత్వం నుంచి సాయం అవసరం లేదని తేల్చి చెప్పారు.




 కౌశిక్‌రెడ్డి డిమాండ్
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం క్రీడాకారులకు ఇంటిస్థలం కేటాయించింది. క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌(Siraj)తోపాటు షూటర్ ఇషాసింగ్‌, బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌కు హైదారాబాద్‌లో 600 గజాల ఇంటిస్థలం కేటాయించింది. దీనికి తెలంగాణ మంత్రివర్గం సైతం ఆమోదం తెలిపింది. ఈ అంశాన్ని అసెంబ్లీ లేవనెత్తిన పాడి కౌశిక్‌రెడ్డి...వారితో పాటు క్రికెటర్ల ప్రజ్ఞాన్‌ ఓజా, అంబటి రాయుడు, బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాలకు కూడా ఇంటి స్థలాన్ని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఎక్స్‌లో స్పందించిన అంబటి రాయుడు...పాడి కౌశిక్‌రెడ్డి అభ్యర్థనను తిరస్కరించారు. క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహించడం అవసరమేనని అంబటి రాయుడు అభిప్రాయపడ్డారు. క్రికెటర్‌గా మహ్మద్‌ సిరాజ్‌ చేసిన కృషికి తెలంగాణ ప్రభుత్వం ఇంటి స్థలం ఇవ్వడాన్ని అంబటి హర్షించారు. అయితే ఇలాంటి వర్థమాన క్రీడాకారులకు, అవసరం ఉన్న మిగిలిన ఉన్న క్రీడాకారులకు సాయం చేయాలని...తాను మాత్రం ఎప్పుడూ ఏ ప్రభుత్వం నుంచి ఏదీ ఆశించలేదని అన్నారు. తనకు తెలంగాణ ప్రభుత్వం భూమి కేటాయించాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి చేసిన అభ్యర్థనను గౌరవపూర్వకంగా తిరస్కరిస్తున్నానని చెప్పారు. క్రీడాకారులకు ప్రభుత్వాల మద్దతు ఉండటం చాలా అవసరమన్న ఆయన.. ఆ విషయంలో మిగిలిన క్రీడాకారులతో పోల్చితే...క్రికెటర్లు చాలా అదృష్టవంతులన్నారు. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. కాబట్టి ప్రభుత్వసాయం కోసం ఎదురుచూస్తున్న క్రీడాకారులకు ఆ ప్రోత్సాహం అందించాలని అంబటిరాయుడు సూచించారు. 


భిన్న స్వరాలు
ప్రస్తుతం అంబటి రాయుడు ట్వీట్ వైరల్‌ అవుతోంది. అంబటి రాయుడు చేసిన సూచనపై కొందరు హర్షం వ్యక్తం చేస్తుండగా...మరికొందరు రాయుడు ఎప్పుడూ రాంగ్‌ స్టెప్పులే వేస్తుంటారని అన్నారు. గతంలోనూ మంచి జోరుమీద ఉన్న సమయంలో ఐపీఎల్‌ వైపు రాకుండా ఐసీఎల్‌లో చేరి బీసీసీఐ ఆగ్రహానికి గురయ్యాడని...ఎంతో ప్రతిభ ఉన్నా తన తప్పుడు నిర్ణయాల వల్లే ఎన్నో ఏళ్లు భారతజట్టులో చోటు దక్కించుకోలేకపోయాడని గుర్తు చేస్తున్నారు.అలాగే తనకు వరల్డ్‌కప్ జట్టులో చోటు కల్పించకపోవడంపై మరోసారి బీసీసీఐ, సెసక్షన్‌బోర్డుపై విమర్శలు చేసి బోర్డు ఆగ్రహానికి గురయ్యాడు. అలాగే ఐపీఎల్‌లోనూ చెన్నై జట్టు యజమాన్యంతో కొన్నిసార్లు గొడవలుపడ్డాడు. అలాగే రాజకీయాల్లోనూ అంతే వైసీపీలో చేరి వెంటనే బయటకు వచ్చేశాడు. ఇవన్నీ చూస్తుంటే అంబటి నిలకడలేని వ్యక్తిత్వానికి నిదర్శనాలని అంటున్నారు. ఇప్పుడు ఇంటిస్థలం వద్దన్న అంబటిరాయుడు...మళ్లీ తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని సెటైర్లు వేస్తున్నారు.