Aman Sehrawat Clinches Wrestling Bronze: రెజ్లింగ్‌లో వినేశ్‌ ఫొగాట్‌కు పతకం దక్కినట్లే దక్కి చేజారింది. ఆ నిర్వేదంలో ఈసారి భారత్‌కు కుస్తీ పోటీల్లో ఒక్క పతకమైనా రాకపోతుందా అని క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే ఈ ఆశలు నెరవేరలేదు. భారత కుస్తీ వీరులు అంచనాలను అందుకోలేకపోయారు. మరో రెండు రోజుల్లో విశ్వ క్రీడలకు తెరపడుతుందనగా.. రెజ్లర్‌ అమన్‌ సెహ్రావత్‌(Aman Sehrawat) సత్తా చాటాడు. విశ్వక్రీడల్లో సంచలన ప్రదర్శనతో మెరిశాడు. ఫైనల్ కు చేరడంలో విఫలమైన అమన్.. కాంస్య పతకపోరులో అద్భుత విజయాన్ని అందుకుని భారత్‌కు ఆరో పతకం అందించాడు. పురుషుల 57 కేజీల ఫ్రీస్టయిల్ బౌట్ లో అమన్ సెరావత్ 13-5 పాయింట్లతో ప్యూర్టోరికాకు చెందిన డేరియన్ క్రూజ్‌పై ఏకపక్ష విజయం సాధించాడు. 

 





పతక సంబరం

అమన్‌ పతక ఆశలు నెరవేర్చడంతో భారత్ ఖాతాలో మరో కాంస్య పతకం చేరింది. ఇప్పటి వరకు పారిస్‌ విశ్వక్రీడల్లో భారత్‌ ఆరు పతకాలను సాధించింది. ఇందులో ఒక రజతం.. ఐదు కాంస్యాలు ఉన్నాయి. బౌట్ ఆరంభంలో క్రూజ్ పాయింట్ సాధించి లీడ్ లోకి వెళ్లగా... అమన్‌ చాలా జాగ్రత్తగా ఆడాడు. అదును చూసుకుని క్రూజ్‌పై ఆధిపత్యం చెలాయించాడు. ఆరంభంలో వ్యూహాత్మకంగా క్రూజ్‌ను మ్యాచ్‌పై నుంచి బయటకు నెట్టి పాయింట్లు స్కోర్‌ చేసిన అమన్‌.. ఆ తర్వాత మ్యాట్‌పైనే క్రూజ్‌పై పట్టు సాధించాడు. చివరి నిమిషాల్లో దూకుడు ప్రదర్శించిన అమన్ వరుసగా పాయింట్లు సాధిస్తూ భారీ ఆధిక్యంలో వెళ్లి ఏకపక్ష విజయం అందుకున్నాడు. అమన్‌ ధాటికి ఓ దశలో క్రూజ్‌ నిశ్చేష్టుడయ్యాడు. ఆ తర్వాత ఆధిక్యాన్ని కాపాడుకుంటూ వచ్చిన అమన్‌ కాంస్యాన్ని సాధించాడు. 

 





సెమీస్‌లో ఓడినా...

 పారిస్‌ ఒలింపిక్స్‌లో ఒక్క సెమీస్‌ మినహా అమన్‌ పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. తొలి రౌండ్‌లో అమన్‌ నార్త్ మెసడోనియా రెజ్లర్ వ్లాదిమిర్ ఇగొరొవ్ పై ఏకంగా 10-0 పాయింట్లతో ఏకపక్ష విజయం సాధించాడు. ఆ తర్వాత క్వార్టర్ ఫైనల్ బౌట్ లో అల్బేనియా రెజ్లర్ అబకరోవ్ పై కూడా అమన్ 12-0 పాయింట్ల తేడాతో సాధికారంగా ఘన విజయాన్ని అందుకుని సెమీస్ లోకి ప్రవేశించాడు. సెమీస్ పోరులో జపాన్ రెజ్లర్ హిగూచి చేతిలో అమన్ 0-10 పాయింట్ల తేడాతో ఓడాడు. పతకం సాధించిన తర్వాత భారత అభిమానులకు అమన్‌ అభివాదం చేశాడు. అనంతరం జాతీయ పతాకాన్ని చూపిస్తూ సంబరాలు చేసుకున్నాడు. ఈ ఒలింపిక్స్‌లో కుస్తీ పోటీల్లో భారత్‌కు ఇదే తొలి పతకం కావడం విశేషం.  

 

హర్యాణ నుంచే...

అమ‌న్ సెహ్రావ‌త్ హర్యానాలోని ఝజ్జర్ జిల్లాలోని బీరోహార్ ప్రాంతానికి చెందిన రెజ్లర్. 10 ఏళ్ల వయస్సులోనే తల్లిని కోల్పోయిన అమన్‌... 11 ఏళ్లకే తండ్రిని కోల్పోయాడు. మేనమామ సంర‌క్షణ‌లో పెరిగిన అమన్‌ కష్టాలు దాటుతూ ఇప్పుడు కాంస్య పతకంతో సత్తా చాటాడు.