Vinesh Phogat enters semis: అవమానాలను దాటుకుంటూ... అనుమానాలను పటాపంచలు చేస్తూ భారత స్టార్ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌(Vinesh Phogat) చరిత్రకు అడుగు దూరంలో నిలిచింది. మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో ప్రపంచ ఛాంపియన్‌ను మట్టి కరిపిస్తూ క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించిన వినేశ్‌ ఫొగాట్‌... అదే ఊపుతో క్వార్టర్‌ ఫైనల్లోనూ విజయం సాధించి సెమీస్‌లోకి అడుగుపెట్టింది. ఇవాళ రాత్రి 9.45 నిమిషాలకు క్యూబాకు చెందిన యుస్నీలీస్‌తో వినేశ్‌ తలపడనుంది. ఈ బౌట్‌లో విజయం సాధిస్తే వినేశ్‌.. చరిత్ర సృష్టించినట్లే. అంటే చరిత్ర సృష్టించడానికి వినేశ్‌ కేవలం ఒకే అడుగు దూరంలో నిలిచింది. ఇంతవరకూ రెజ్లింగ్‌ భారత్‌కు స్వర్ణ పతకం రాలేదు. ఆ కొరతను ఈ స్టార్ రెజ్లర్‌ భర్తీ చేస్తే ఇన్నాళ్లు పడ్డ శ్రమకు ప్రతిఫలం దక్కినట్లే. పడ్డ ప్రతీ అవమానానికి సమాధానం ఇచ్చినట్లే. 





 

క్వార్టర్‌ ఫైనల్‌కు ఇలా...

50 కేజీల రెజ్లింగ్ విభాగంలో రౌండ్ ఆఫ్ 16 బౌట్‌లో జపాన్‌కు చెందిన డిఫెండింగ్ ఒలింపిక్ ఛాంపియన్ యుయి సుసాకిపై వినేష్ ఫోగాట్ 3-2 తేడాతో అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ చివరి వరకూ ఉత్కంఠభరితంగా సాగింది. ఈ విభాగంలో సుసాకిని అజేయంగా పరిగణిస్తారు. అలాంటి ప్రత్యర్థిపై వినేష్‌ మంచి విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన బౌట్‌లో 'టోక్యో ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ గెలిచిన సుసాకిని వినేశ్‌ ఓడించింది. చివరి నిమిషంలో వినేశ్‌ ఆట ఆకట్టుకుంది. వినేష్ రియో ​2016లో పదో స్థానంలోన...టోక్యో 2020లో తొమ్మిదో స్థానంలో నిలవగా ఈ ఒలింపిక్స్‌లో ఇప్పటికే  తొలి నాలుగు స్థానాల్లో బెర్తు ఖాయం చేసుకుంది. గత విశ్వ క్రీడల్లో 53 కిలోల విభాగంలో పోటీపడిన వినేష్... ఈ ఏడాది పారిస్‌ ఒలింపిక్స్‌ కోసం 50 కిలోల విభాగానికి మారింది.

 

25 ఏళ్ల సుసాకి టోక్యో ఒలింపిక్స్‌లో నాలుగు బౌట్‌లలో ఒక్క పాయింట్ కోల్పోకుండా స్వర్ణం గెలుచుకుంది. అలాంటి ప్లేయర్‌ను ఓడించి వినేశ్‌ పూర్తి ఆత్మవిశ్వాసంతో క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. సుసాకిని పడగొట్టిన మొదటి అంతర్జాతీయ రెజ్లర్‌గా వినేష్‌ చరిత్ర సృష్టించింది. క్వార్టర్ ఫైనల్‌లో వినేష్ ఉక్రెయిన్‌కు చెందిన ఒక్సానా లివాచ్‌పైన విజయం సాధించి సెమీస్‌లో అడుగుపెట్టింది.క్వార్టర్‌ ఫైనల్లోనూ అదే ఊపు కొనసాగించి సెమీఫైనల్‌కు చేరింది. వినేష్ ఫోగట్ ఇక పతకానికి కేవలం ఒకే అడుగు  దూరంలో ఉంది. మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ ఈవెంట్‌లో భారత రెజ్లింగ్ స్టార్‌ వినేష్... ఉక్రెయిన్‌కు చెందిన ఒక్సానా లివాచ్‌ను 7-5తో తేడాతో ఓడించి సెమీస్‌ చేరింది.