Neeraj Chopra Enters Paris Olympics 2024 Mens Javelin Throw Final: అంచనాలను నిజం చేస్తూ... అభిమానుల ఆశలను నిలబెడుతూ... భారత్‌కు మరో స్వర్ణాన్ని అందించేందుకు... భారత గోల్డెన్‌ బాయ్‌ నీరజ్‌ చోప్రా(Neeraj Chopra) ఫైనల్లో అడుగుపెట్టాడు. పారిస్‌ ఒలింపిక్స్‌ 2024(Paris Olympics 2024)లో తుది పోరుకు అర్హత సాధించాడు. విశ్వ క్రీడల్లో క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో 84 మీటర్ల దూరం ఈటె విసిరిన వారు ఆటోమెటిగ్గా ఫైనల్‌కు చేరుతారు. ఈ క్రమంలో నీరజ్‌ చోప్రా 84 మీటర్ల దూరాన్నిసునాయసంగా దాటేశాడు. అంతేనా ఆ త్రోతూ ప్రత్యర్థులను వణుకు పుట్టించాడు. ఇక ఫైనల్లో మరో స్వర్ణాన్ని భారత్‌కు అందించాలని నీరజ్‌ గట్టి పట్టుదలతో ఉన్నాడు. తొలి త్రోలోనే 89.34 మీటర్లు ఈటెను విసిరిన నీరజ్‌ చోప్రా సునాయసంగా ఫైనల్లో అడుగుపెట్టాడు. ఇక ఫైనల్లోనూ ఇదే త్రో మరోసారి రిపీట్‌ అయితే నీరజ్‌ చోప్రా రెండో స్వర్ణంతో మెరవడం ఖాయం.





 

నీరజ్‌ త్రో దాదాపు 90 మీటర్లు

డిఫెండింగ్ ఛాంపియన్ నీరజ్ చోప్రా 89.34 మీటర్ల త్రోతో పురుషుల జావెలిన్ త్రో ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. క్వాలిఫికేషన్ రౌండ్‌లో నీరజ్‌ ప్రదర్శన... ప్రత్యర్థులకు చెమటలు పట్టించింది. తొలి ప్రయత్నంలోనే 89.34 మీటర్ల దూరం ఈటెను విసిరిన నీరజ్‌... ఈ సారి కూడా గోల్డ్‌ మెడల్‌ తనదేనని ప్రత్యర్థులకు బలమైన సంకేతాలు పంపాడు. క్వాలిఫికేషన్ రౌండ్‌లో 84 మీటర్ల అర్హతను నీరజ్‌ చోప్రా... చాలా సులభంగా అధిగమించాడు. టోక్యో 2020 ఒలింపిక్స్‌లోనూ నీరజ్‌ చోప్రా తొలి ప్రయత్నంలోనే ఫైనల్‌కు అర్హత సాధించాడు. టోక్యో ఒలింపిక్స్‌లో 87.58 మీటర్ల దూరం ఈటెను విసిరి స్వర్ణాన్ని సాధించిన నీరజ్‌... ఈసారి అంతకంటే ఎక్కువ దూరమే ఈటెను విసిరాడు. ఊ త్రో తో రాబోయే ఫైనల్‌పై నీరజ్‌ భారీ అంచనాలను పెంచేశాడు. . ఆగస్టు 8న రాత్రి 11:55 గంటలకు జరిగే ఫైనల్‌ కోసం క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నీరజ్‌ ఈసారి కూడా స్వర్ణంపై కన్నేశాడు. 





 

అర్షద్‌ నదీమ్‌ కూడా...

పాకిస్థాన్‌కు చెందిన జావెలిన్‌ త్రోయర్‌ అర్షద్ నదీమ్(Arshad Nadeem) కూడా ఒలింపిక్స్ 2024లో అథ్లెటిక్స్‌లో పురుషుల జావెలిన్ ఈవెంట్‌లో ఫైనల్‌కు చేరుకున్నాడు. అతను 86.59 మీటర్ల త్రో చేసి తొలి ప్రయత్నంలోనే తుది పోరుకు అర్హత సాధించాడు. నదీమ్‌కు ఈ సీజన్‌లో ఇదే అత్యుత్తమం కావడం విశేషం. నీరజ్‌కు నదీమ్‌కు మూడు మీటర్లు వ్యత్యాసం ఉండడం విశేషం. ఆసియన్ స్టార్స్ ఇద్దరూ 84 మీటర్ల ఆటోమేటిక్ క్వాలిఫికేషన్ మార్కును దాటారు. కిషోర్ జెనా 80.73 మీటర్ల త్రోతో ఫైనల్స్‌కు వెళ్లడంలో విఫలమయ్యాడు. జావెలిన్‌లో ఆసియా అథ్లెట్ అత్యుత్తమ త్రోల జాబితాలో అర్షద్ రెండో స్థానంలో ఉన్నాడు. 2022లో బర్మింగ్‌హామ్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో నీరజ్ ఆడలేదు. ఆ టోర్నమెంట్‌లో అర్షద్ అద్భుతమైన 90.18 మీటర్లు విసిరి బంగారు పతకాన్ని సాధించాడు. తైవాన్‌కు చెందిన చావో సున్ చెంగ్ పేరుపై 2017లో 91.36 మీటర్లతో రికార్డు ఉంది. నీరజ్‌ ఈ ఒలింపిక్స్‌లో 90 మీటర్ల మార్క్‌ దాటాలని పట్టుదలగా ఉన్నాడు. మాజీ ప్రపంచ ఛాంపియన్‌ అండర్సన్‌ పీటర్‌ కూడా 88.63 మీటర్లు విసిరి ఫైనల్‌కు అర్హత సాధించాడు.