Olympian sorry to wife for losing wedding ring in Seine: అతనో దిగ్గజ్జ అథ్లెట్. ప్రపంచ ఛాంపియన్ కూడా. ఒలింపిక్స్‌లో స్వర్ణ పతక విజేత కూడా. అయితే తాను చేసిన ఓ తప్పునకు తన భార్యకు క్షమాపణలు చెప్పాడు. ఒలింపిక్స్(Olympics)లో హైజంప్‌లో ప్రపంచ ఛాంపియన్, ఇటలీకి చెందిన దిగ్గజ అథ్లెట్ జియాన్మారో తంబెరీ(Gianmarco Tamberi) తన సతీమణికి క్షమాపణలు చెప్పాడు. "సారీ, మై లవ్" అంటూ కన్నీళ్లు పెట్టుకున్నంత పని చేశాడు. మరోసారి ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించనంటూ క్షమాపణలు చెప్పాడు.
ఇంతకీ ఏమైందంటే....
ఒలింపిక్స్‌లో ఈసారి పతకం తప్పక వస్తుందని ఇటలీ భారీగా ఆశలు పెట్టుకున్న ఈవెంట్‌లలో హైజంప్ ఒకటి. ఎందుకంటే ఇటలీ తరపున బరిలోకి దిగింది దిగ్గజ అథ్లెట్, గత ఒలింపిక్స్‌లో స్వర్ణ పతక విజేత జియాన్మార్కో తంబెరీ. ప్రపంచ ఛాంపియన్ అయిన అతను బరిలోకి దిగితే పతకం ఖాయమనే ఇటలీ భావిస్తోంది. ఈ దిగ్గజ అథ్లెట్ తన నిర్లక్ష్యం కారణంగా తన భార్యకు క్షమాపణలు చెప్పాడు. పారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలో తంబేరీ... ఇటలీ ఆటగాళ్లకు నేతృత్వం వహించాడు. పతాకధారుడిగా ఇటలీ జెండా ఊపుతూ తంబేరీ ముందు నిలబడగా... పడవలో వెనక మిగిలిన అథ్లెట్లు నిలబడ్డారు. సెయిన్ నదిలో ఇటలీ అథ్లెట్లు ఉన్న పడవ ముందుకు సాగిపోతుండగానే... ఇటలీ జెండా ఊపుతున్న సమయంలో అతని చేతికి ఉన్న ఉంగరం జారి నీళ్లలో పడిపోయింది. దీంతో తంబేరీ హతాశుడయ్యాడు. ఎందుకంటే అది తంబేరి వివాహ ఉంగరం. దీంతో తన భార్యకు ఇన్ స్టా వేదికగా తంబేరీ క్షమాపణలు చెప్పాడు. " సారీ మై లవ్" అంటూ భావోద్వేగ పోస్ట్ పెట్టాడు. "నన్ను క్షమించు" అంటూ తన భార్య చియారా బొంటెంపికి తంబేరీ ఇన్ స్టా వేదికగా క్షమాపణలు చెప్పాడు. ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. తన బాధను అర్థం చేసుకుని క్షమించాలంటూ నెటిజన్లు తంబేరీ భార్యను కోరుతున్నారు. ప్రపంచ ఛాంపియన్ అయినా భార్యకు సారీ చెప్పాల్సిందే అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. తంబేరీ 2021 టోక్యో ఒలింపిక్స్‌లో ఖతార్‌కు చెందిన ముతాజ్ బర్షిమ్‌తో కలిసి ఒలింపిక్ స్వర్ణాన్ని పంచుకున్నాడు.
అందరి కళ్లు బైల్స్‌పైనే
విశ్వ క్రీడల్లో అమెరికా స్టార్ జిమ్నాస్ట్ బైల్స్‌పై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఇవాళ ఆల్‌రౌండ్ అర్హత పోటీల్లో బైల్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనుంది. అర్హత రౌండ్లో ఫ్లోర్ ఎక్సర్‌సైజ్, వాల్ట్, బ్యాలెన్స్ బీమ్, అన్‌ఈవెన్ బార్స్‌లో బైల్స్ తలపడనుంది. జిమ్నాస్టిక్ చరిత్రలో ఓ సంచలనంగా అద్భుతంగా పేరుగాంచిన బైల్స్ ఈ ఒలింపిక్స్‌లో ఏం చేస్తారన్న దానిపై అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 19 ఏళ్ల వయసులో తొలి విశ్వ క్రీడల్లో నాలుగు ఒలింపిక్స్ గోల్డ్ మెడల్స్, ఒక కాంస్యంతో మొత్తం అయిదు పతకాలు సాధించి చరిత్ర సృష్టించిన బైల్స్ ఇప్పుడు వివాహం తర్వాత బరిలోకి దిగుతోంది. కొద్దికాలం పాటు ఆటకు దూరంగా ఉన్న ఈ సంచలనం ఈ విశ్వ క్రీడల్లో ఏం చేస్తుందో చూడాలి.