Preethi Pal wins historic bronze in 100m T35 class:  పారాలింపిక్స్‌(Paris 2024 Paralympics)లో మహిళల వంద మీటర్ల T 35 విభాగంలో పోటీ జరుగుతోంది. అథ్లెటిక్స్‌లో భారత ఆశలు మోస్తూ ప్రీతి పాల్‌(Preethi Pal) రేసుకు సిద్ధమైంది. గన్ సౌండ్‌ వినపడగానే చిరుతలా దూసుకుపోయింది. 14.21 సెకన్లలో లక్ష్యాన్ని పారిస్‌ పారా ఒలింపిక్స్‌లో భారత్‌కు అథ్లెటిక్స్‌లో తొలి పతకం అందించింది. పారాలింపిక్స్ ట్రాక్ అండ్‌ ఫీల్డ్‌ ఈవెంట్‌ చరిత్రలో భారత్‌కు ఇదే తొలి పతకం కావడం విశేషం. ప్రీతి 14.21 సెకన్లలో వంద మీటర్ల పరుగు పూర్తి చేసి మూడో స్థానంలో నిలవగా.. చైనాకు చెందిన ప్రపంచ రికార్డు హోల్డర్ జౌ జియా 13.58 సెకన్లలో స్వర్ణం సాధించింది. చైనాకే చెందిన మరో స్ప్రింటర్ గువో కియాన్‌కియాన్ 13.74 సెకన్లలో రజతం సాధించింది. 


 

కష్టాలను దాటిన పరుగు

ఉత్తరప్రదేశ్‌(up)లోని ముజఫర్‌నగర్‌కు చెందిన 23 ఏళ్ల ప్రీతి పాల్‌ ఉత్తమ అథ్లెట్‌గా ఎదిగేందుకు చాలా కష్టపడింది. రైతు కుటుంబంలో జన్మించిన ప్రీతికి... పుట్టిన ఆరు రోజుల తర్వాత ఆమె కాళ్లకు సమస్య ఉన్నట్లు గుర్తించారు. బలహీనమైన, వంకర కాళ్లతో ప్రీతీ పాల్‌ జన్మించడంతో ఆమె అనేక శారీరక సవాళ్లను ఎదుర్కొంది. బలహీనమైన, వంకర కాళ్ల వల్ల ఆమె అనే వ్యాధులకు గురవుతూ వచ్చింది. ప్రీతిపాల్‌ను సాధారణ స్థితికి తెచ్చేందుకు వైద్యులు చేసిన ఏ ప్రయత్నాలు ఫలించలేదు. కాలిపర్స్‌ ధరించి కూడా ప్రీతి చాలా ఏళ్ల పాటు నడిచింది.

 

ఐదేళ్ల వయస్సులో కాలిపర్స్ ధరించడం ప్రారంభించింది. ఎనిమిదేళ్ల పాటు కాలిపర్స్‌ ధరించే ప్రీతి పాల్‌ జీవించింది. కానీ ఈ కష్టాలేవి ప్రీతిని వెనకడుగు వేసేలా చేయలేదు సరికదా పోరాట యోధురాలిగా మార్చాయి. సోషల్ మీడియాలో పారాలింపిక్స్‌ వీడియోలను చూసిన ప్రీతి.. తాను కూడా  అథ్లెట్‌ కావాలని నిర్ణయించుకుంది. 17 ఏళ్ల వయసులో పారా స్పోర్ట్స్ పట్ల ఆసక్తి పెంచుకుంది. అథ్లెటిక్స్ ప్రాక్టీస్ చేయడం ప్రారంభించిన కొన్నేళ్ల తర్వాత తన గురువు, పారాలింపియన్ ఫాతిమా ఖాతూన్‌ను కలవడంతో ప్రీతీ పాల్‌ జీవితం పూర్తిగా మారిపోయింది.

 


 

ఫాతిమా ఖాతూన్‌ ప్రోత్సాహంతో ప్రీతి జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని ఎన్నో పతకాలు సాధించింది. పారిస్ పారాలింపిక్ గేమ్స్‌కు అర్హత సాధించేందుకు ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో కోచ్ గజేందర్ సింగ్ వద్ద శిక్షణ తీసుకుంది. ఈ శిక్షణలో కోచ్ సహాయంతో తన రన్నింగ్ టెక్నిక్‌లను మెరుగుపరుచుకుంది. వంద మీటర్ల టైమింగ్‌ను గణనీయంగా తగ్గించుకుంది. 


 



ప్రపంచ అథ్లెటిక్స్‌లోనూ...

ప్రపంచ పారా-అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 2024లో ప్రీతీ పాల్‌ కాంస్య పతకం సాధించి ఆత్మ విశ్వాసాన్ని పెంచుకుంది. ఇండియన్ ఓపెన్ పారా అథ్లెటిక్స్ ఇంటర్నేషనల్ ఛాంపియన్‌షిప్ 2024, నేషనల్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 2024 రెండింటిలోనూ స్వర్ణ పతకాలు సాధించింది. గత ఏడాది హాంగ్‌జౌలో జరిగిన 2022 ఆసియా పారా గేమ్స్‌లో నాలుగో స్థానంలో నిలిచింది.