Avani Lekhara clinches gold as India win three medals: అవనీ లేఖరా(Avani Lekhara) చరిత్ర సృష్టించింది. వరుసగా రెండు పారాలింపిక్స్‌ గేమ్స్‌లోనూ గోల్డ్‌ మెడల్‌ సాధించి రికార్డు సృష్టించింది. 2021లో టోక్యో పారా ఒలింపిక్స్‌లో గురి తప్పకుండా స్వర్ణాన్ని కైవసం చేసుకున్న ఈ స్టార్‌ షూటర్‌... ఇప్పుడు పారిస్‌ పారాలింపిక్స్‌లోనూ పసిడి పతకంతో మెరిసింది. అవనీ(Mona Agarwal) షూటింగ్‌లో మెరవడంతో పారిస్‌ పారా ఒలింపిక్స్‌లో భారత్‌ బోణీ కొట్టింది. అది కూడా బంగారు పతకంతో భారత్‌ పతక ప్రస్థానాన్ని ప్రారంభించింది. పారా షూటర్‌ అవనీ లేఖరా 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఎస్‌హెచ్‌ 1లో గోల్డ్‌ మెడల్‌ సాధించింది. ఇదే విభాగంలో మోనా అగర్వాల్‌ కాంస్య పతకంతో మెరిసింది. దీంతో ఒకే ఈవెంట్‌లో భారత్‌ రెండు పతకాలు సాధించి రికార్టు సృష్టించింది. 2020లో టోక్యోలో జరిగిన పారాలింపిక్స్‌లోనూ అవని లేఖరా గోల్డ్‌ మెడల్ సాధించింది. ఇప్పుడు పారిస్‌ పారాలింపిక్స్‌లోనూ బంగారు పతకం కైవసం చేసుకుంది.





చరిత్ర సృష్టించిన అవనీ, మోనా

షూటర్లు అవనీ లేఖరా, మోనా అగర్వాల్ 2024 పారిస్ పారాలింపిక్స్‌లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ SH1 ఈవెంట్‌లో బరిలోకి దిగారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ (SH1) విభాగంలో అవనీ గురి ఏమాత్రం తప్పలేదు. 249.7 పాయింట్లతో దక్షిణ కొరియాకు చెందిన షూటర్‌ లీపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. లీ 246.8 పాయింట్లతో రజత పతకాన్ని సాధించగా... 249.7 పాయింట్లతో అవనీ లేఖరా బంగారు పతకాన్ని సాధించింది. మూడో స్థానంలో మోనా అగర్వాల్ నిలిచి కాంస్య పతకాన్ని అందుకుంది.  పారాలింపిక్స్ లో రెండు స్వర్ణ పతకాలు సాధించిన తొలి భారతీయురాలిగా అవనీ కొత్త చరిత్రను లిఖించింది. పారిస్‌ పారాలింపింక్స్‌లో  249.7 స్కోర్ చేయడం ద్వారా టోక్యోలో 249.6 పాయింట్లతో పారాలింపిక్స్ గేమ్‌ల రికార్డును బద్దలు కొడుతూ అవనీ బంగారు పతకాన్ని పట్టేసింది. 

 

ఎందరికో స్ఫూర్తి అవనీ

అవని కేవలం 11 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు ప్రమాదానికి గురైంది. అప్పటినుంచి అవనీ వీల్‌చైర్‌కే పరిమితమైంది. రాజస్థాన్‌లోని జైపూర్‌లో జన్మించిన అవని.. ప్రమాదం తర్వాత తీవ్ర నిర్వేదంలో కూరుకుపోయింది. దీంతో అవని తండ్రి ఆమెను క్రీడల వైపు ప్రోత్సహించారు. అభినవ్ బింద్రా స్ఫూర్తితో అవనీ పారా షూటింగ్ వైపు మొగ్గు చూపింది. టోక్యో పారాలింపిక్స్‌లో ఆమె రెండు పతకాలు సాధించి చరిత్ర సృష్టించింది. టోక్యోలో అవనీ లేఖరా... ఒక స్వర్ణం.. కాంస్యం సాధించింది. అవనీకి పద్మశ్రీ, ఖేల్ రత్న అవార్డులను కేంద్రం అందించి గౌరవించింది. 

 





 

 

ఎవరీ మోనా అగర్వాల్ 

పోలియోతో మోనా అగర్వాల్‌ కూడా వీల్‌చైర్‌కే పరిమితమైంది. రాజస్థాన్‌లోని సికార్‌లో జన్మించిన 34 ఏళ్ల అగర్వాల్ తన అమ్మమ్మ మద్దతుతో పారా అథ్లెట్‌గా మారింది. క్రొయేషియాలో జరిగిన 2023 ప్రపంచ కప్‌లో కాంస్యం గెలిచిన మోనా... 2024 WSPS ప్రపంచ కప్‌లో బంగారు పతకాన్ని గెలుచుకుంది. ఈ పారిస్‌ పారా ఒలింపిక్స్‌లో కాంస్యంతో సత్తా చాటింది.