How close is Joe Root to beating Sachin Tendulkars Test world record : అంతర్జాతీయ క్రికెట్‌లో జో రూట్‌(Joe Root) దూకుడు కొనసాగుతోంది. టాప్‌ ఫామ్‌లో ఉన్న ఈ ఇంగ్లండ్‌ స్టార్‌ ప్లేయర్‌ వరుస శతకాలతో రికార్డుల మీద రికార్డులు సృషిస్తున్నాడు. శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో సెంచరీ చేసి పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. సచిన్‌(Sachin Tendulkar) అత్యధిక టెస్టు సెంచరీల(51)ను అధిగమింటే దిశగా రూట్‌ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం 33 శతకాలతో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో టాప్‌ టెన్‌లోకి దూసుకొచ్చిన రూట్‌... సచిన్‌ అత్యధిక సెంచరీలపై కన్నేశాడు. 

 

రోహిత్‌ శర్మను అధిగమించిన జో రూట్ 

బజ్‌బాల్‌ ఆటతో దూసుకుపోతున్న రూట్‌కు.. సచిన్‌ రికార్డును అధిగమించే సత్తా ఉందని మాజీ క్రికెటర్లు కూడా అంటున్నారు. వన్డేలు, టీ 20లు, టెస్టులు మూడు ఫార్మట్లలో రూట్‌కు ఇది 49వ సెంచరీ. మూడు ఫార్మట్లలో 48 సెంచరీలు చేసిన టీమిండియా సారధి రోహిత్‌ శర్మను.. ఈ శతకంతో రూట్‌ అధిగమించేశాడు. ఇంగ్లండ్‌ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా అలిస్టర్‌ కుక్‌తో కలిసి రూట్‌ కూడా 33 శతకాలతో అగ్రస్థానంలో ఉన్నాడు. మరో శతకం చేస్తే అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన ఇంగ్లండ్‌ ఆటగాడిగా రూట్ రికార్టు సృష్టిస్తాడు. రూట్‌ (33), కుక్‌ (33) తర్వాత దిగ్గజ బ్యాటర్‌ కెవిన్‌ పీటర్సన్‌ 23 సెంచరీలతో టాప్‌ త్రీలో ఉన్నాడు.

 

విరాట్‌-రూట్ మధ్యే యుద్ధం

ప్రస్తుతం యాక్టీవ్‌గా ఉన్న క్రికెటర్లలో ఎవరూ సచిన్‌ అత్యధిక టెస్టుల రికార్డును బద్దలు కొడతారనే చర్చ విపరీతంగా జరుగుతోంది. విరాట్‌ కోహ్లీ(Virat Kohli), జో రూట్‌ల మధ్యే ప్రధాన పోరు జరుగుతోంది. ఈ ఇద్దరు అత్యుత్తమ టెక్నిక్‌తో క్రికెట్‌ ప్రపంచాన్ని ఏలుతున్నారు. కానీ గత కొన్నేళ్లుగా రూట్‌ భీకర ఫామ్‌లో ఉన్నాడు. కేవలం నాలుగేళ్ల వ్యవధిలో జో రూట్‌ ఏకంగా 16 శతకాలు బాదేశాడు. బజ్‌బాల్‌ రాకముందు రూట్‌ ఆట చాలా నిదానంగా ఉండేది. అయితే బజ్‌బాల్‌తో రూట్ ఆటతీరే మారిపోయింది. బజ్‌బాల్‌ రాకముందు 117 టెస్టుల్లో కేవలం 25 శతకాలు చేసిన రూట్‌... బజ్‌బాల్‌ వచ్చాక 28 టెస్టుల్లోనే ఎనిమిది సెంచరీలు చేసి సచిన్‌ రికార్డు దిశగా దూసుకుపోతున్నాడు. రూట్‌ ఇదే ఫామ్‌లో కొనసాగితే సచిన్‌ రికార్డును తక్కువ ఇన్నింగ్స్‌లలోనే అందుకుంటాడని పలువురు మాజీలు అంచనా వేస్తున్నారు. 

 

యాక్టీవ్‌ ప్లేయర్లలో రూటే..

అయితే ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న క్రికెటర్లలో అత్యధిక సెంచరీల రికార్డు విరాట్‌ కోహ్లీ పేరిట ఉంది. విరాట్‌ కోహ్లీ మూడు ఫార్మట్లలో ఇప్పటికే 80 శతకాలు చేశాడు. సచిన్‌ తర్వాత అత్యధిక శతకాలు చేసిన బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. కానీ టెస్ట్‌ ఫార్మట్‌లో విరాట్‌ మరిన్ని శతకాలు సాధించాల్సి ఉంది. ప్రస్తుతం యాక్టీవ్‌ ప్లేయర్లలో రూట్‌ అత్యధికంగా 33 సెంచరీలు చేయగా.. కేన్‌ విలియమ్సన్‌,  స్టీవ్‌ స్మిత్‌ 32 సెంచరీలు చేశారు. విరాట్‌ కోహ్లీ 29 సెంచరీలతో నాలుగో స్థానంలో ఉన్నాడు.