Neeraj gets silve: యావత్ భారతావని ఆశలు మోస్తూ.... స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా( Neeraj Chopra) విశ్వ క్రీడల్లో భారత్‌కు రెండో పతకం అందించాడు. ఈసారి స్వర్ణం చేజారినా... రజత పతకంతో నీరజ్ చరిత్ర సృష్టించాడు. ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో గత ఒలింపిక్స్‌లో తొలి బంగారు పతాకాన్ని సాధించిన నీరజ్‌చోప్రా...ఈసారి మాత్రం రజతం(silver)తో సరిపెట్టుకున్నాడు. పాకిస్థాన్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్( Arshad Nadeem) స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఒలింపిక్స్‌లో కొత్త రికార్డు సృష్టిస్తూ... తన కెరీర్‌లోనే బెస్ట్ నమోదు చేస్తూ నదీమ్ గోల్డ్ మెడల్ సాధించాడు. 92.97 మీటర్ల దూరం ఈటెను విసిరిన నదీమ్ స్వర్ణం గెలుచుకోగా... 89.45 మీటర్లతో నీరజ్ రజత పతకం సాధించాడు. అండర్సన్ పీటర్స్ కాంస్యం గెలుచుకున్నాడు. ఈ పతకంతో ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో వరుసగా రెండో పతకం గెలిచిన అథ్లెట్‌గా నీరజ్ రికార్డు సృష్టించాడు. కాంస్య పతకం ఫిన్లాండ్‌కు చెందిన జావెలిన్ త్రోయర్ గెలుచుకున్నాడు. ఫైనల్లో ప్రతీ త్రోయర్‌కు ఆరు అవకాశాలు ఇస్తారు. అయితే నీరజ్ చోప్రా అయిదు సార్లు ఫౌల్ కావడం విశేషం. అంటే నీరజ్ చోప్రా ఫైనల్లో ఒకే త్రో విసిరినట్లు లెక్క. ఆ ఒక్క త్రోతోనే నీరజ్ రజతం గెలిచాడు. మిగిలిన అయిదు త్రోలు ఫౌల్ అయ్యాయి.
తొలి ప్రయత్నంలో నీరజ్ చోప్రా, అర్షద్ నదీమ్ ఇద్దరూ పౌల్ అయ్యారు. అనంతరం రెండో త్రోలో తొలుత ఈటె విసిరిన అర్షద్ 92.97 మీటర్ల దూరం విసిరాడు. వెంటనే నీరజ్ చోప్రా కూడా దాదాపు 90 మీటర్ల దూరం విసిరాడు. నీరజ్ తన కెరీర్‌లో ఇంతవరకూ 90 మీటర్ల మార్క్‌ను దాటలేదు. క్వాలిఫికేషన్ రౌండ్‌లో అంతగా రాణించని నదీమ్...ఫైనల్లో మాత్రం పాకిస్థాన్‌కు బంగారు పతకం అందించాడు. వరుసగా రెండోసారి పతకమే లక్ష్యంగా పారిస్‌లో అడుగు పెట్టిన నీరజ్ ఆ కలను సాకారం చేసుకున్నాడు. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణంతో చరిత్ర సృష్టించిన నీరజ్.. పారిస్‌లో రజత పతకంతో దేశాన్ని ఆనందంలో ముంచెత్తాడు. భారతీయుల ఆశలను నిలబెడుతూ నీరజ్ ఈ ఘనత సాధించాడు. నీరజ్ స్వర్ణం గెలుస్తాడని ఆశలు పెట్టుకున్నా... అది రజతానికే పరిమితమైంది. భారత్‌కు పారిస్ ఒలింపిక్స్‌లో ఇదే తొలి రజత పతకం కావడం విశేషం.
నీ రజతమే బంగారం
పారిస్ ఒలింపిక్స్‌లో గత పదమూడు రోజులుగా 140 కోట్లకు పైగా జనాభా ఉన్న భారత్ ఒక స్వర్ణ పతకమో.. ఒక రజిత పతకమో దక్కకపోతుందా అని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసింది. ఈ ఎదురు చూపులకు తెర దించుతూ నీరజ్ భారత్‌కు రజత పతకాన్ని అందించాడు. ఈసారి స్వర్ణం నీరజ్ ఖాతాలో చేరకపోయి ఉండవచ్చు కాక... కానీ నీరజ్ రజతాన్ని సాధించడం కోసం చేయాల్సిన కృషి అంతా చేశాడు. ఇప్పటివరకూ నాలుగు కాంస్య పతకాలే తప్ప కనీసం రజతం కూడా లేని భారత్‌కు నీరజ్ ఆ కొరత తీర్చాడు. రజత పతకంతో భారత్ ఖాతాలో మరో పతకాన్ని చేర్చాడు. ఒకే రోజు భారత్‌కు అటు హాకీలో కాంస్యం... ఇటు జావెలిన్ త్రోలో రజతం వచ్చాయి. దీంతో క్రీడా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు .