PR Sreejesh-The great wall of india: ఆ గోడ... భారత్‌కు ఎన్నో విజయాలు అందించింది. ఇక టీమిండియా ఓటమి ఖాయమనుకున్న ప్రతీసారి గెలుపును అందించింది. భారత హాకీ(Indian Hockey) స్వర్ణ యుగం ఇక గతమే అని వచ్చిన ఆరోపణలను అడ్డుకుంది. భారత హాకీ స్వర్ణ యుగానికి కొండంత భరోసా కల్పించింది. వేల పెనాల్టీ కార్నర్‌లను... వందల గోల్‌ పోస్ట్‌ దాడులను సమర్థంగా అడ్డుకుంది. 40 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత్‌కు విశ్వ క్రీడల్లో తొలి పతకం సాధించినా... మళ్లీ ఇప్పుడు వరుసగా రెండో పతకం సాధించినా.. అందులో ఆ దిగ్గజ ప్లేయర్‌ పాత్ర ఎంతో ఉంది. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ఆ ప్లేయర్‌ ఎవరో. అతడే ది గ్రేట్ వాల్‌ ఆఫ్‌ ఇండియా(The great wall of india) పీఆర్‌ శ్రీజేష్‌( PR Sreejesh). భారత్ గోల్‌ పోస్ట్‌ ముందు కంచు కోటను నిర్మించి భారత్‌కు ఎన్నో విజయాలు అందించిన శ్రీజేష్‌... తన సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. విశ్వ క్రీడల్లో భారత్‌కు మరో కాంస్య పతకాన్ని అందించి  తన కెరీర్‌ను ముగించాడు. ఎన్నో చిరస్మరణీయ విజయాల్లో... ఒడుదొడుకుల్లో... సంబరాల్లో.. బాధల్లో జట్టుకు అండగా నిలిచిన ఓ యోధుడి శకం ముగిసింది.
 

శ్రీజేష్‌ ఒక కంచుకోట

       పారిస్‌ ఒలింపిక్స్‌(Paris Olympics 2024) లో భారత్‌ కాంస్య పతకం సాధించిన క్షణమది. భారత ఆటగాళ్లంత ఒకవైపు నిలబడి ఉన్నారు. మరోవైపు.. శ్రీజేష్‌ నిలబడి ఉన్నాడు. శ్రీజేష్‌కి భారత హాకీ జట్టు ఆటగాళ్లందరూ, సిబ్బంది... మైదానంలోని అభిమానులు అందరూ శ్రీజేష్‌ సేవలకు గుర్తుగా నడుం వచ్చి చేతులు ఊపుతూ ధన్యవాదాలు తెలిపారు. ఈ అపురూప దృశ్యం  భారత అభిమానుల మదిలో చాలాకాలం గుర్తుండిపోతుంది. ఎందుకంటే శ్రీజేష్‌.. భారత హాకీ భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ తన కెరీర్‌ను ముగించాడు. స్పెయిన్‌తో జిరిగిన కాంస్య పతక పోరులో విజయం సాదించగానే మైదానంలో శ్రీజేష్‌ పూర్తిగా కిందపడుకుని  తన హాకీ గేర్‌కు నమస్కరించాడు. పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని ఖాయం చేసి తన ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్‌ను ముగించి ఘనమైన వీడ్కోలు అందుకున్నాడు. సహచర ఆటగాళ్ల నుంచి శ్రీజేష్‌ ఘన వీడ్కోలు అందుకున్నాడు. 2006లో భారత్‌ హాకీ జట్టులోకి అరంగేట్రం చేసిన శ్రీజేష్... 2020 టోక్యో ఒలింపిక్స్‌లో జట్టు కాంస్య పతక విజయంలో కీలకపాత్ర పోషించాడు. 

 

భారత జట్టు మూల స్తంభం

అవును సుదీర్ఘ కెరీర్‌లో భారత జట్టుకు మూల స్తంభంలా మారాడు. శ్రీజేష్‌ అద్భుత కెరీర్‌లో భారత గోల్‌పోస్ట్ ముందు కంచు కోటను నిర్మించాడు. క్లిష్టమైన పెనాల్టీ కార్నర్‌లను ఆపి భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. శ్రీజేష్ 36 సంవత్సరాల వయస్సులో.. 18 సంవత్సరాల కెరీర్‌లో చివరి మ్యాచ్‌ను చిరస్మరణీయంగా చేసుకుని వెనుదిరిగాడు.భారత హాకీ చరిత్రలో శ్రీజేష్‌ చెరగని ముద్ర వేశాడు. అలాంటి శ్రీజేష్‌కు ఒలింపిక్స్‌ కాంస్య పతకంతో భారత హాకీ జట్టు ఘనమైన వీడ్కోలు పలికింది.