India Beat Spain To Win Back-To-Back Bronze Medals: భారత హాకీ జట్టు(Indian Hockey Team) చరిత్ర సృష్టించింది. వినేశ్‌ ఫొగాట్‌ అనర్హత వేటుతో తీవ్ర నిర్వేదంలో మునిగిపోయిన భారత క్రీడాభిమానులకు స్వాంతన కలిగించింది. కాంస్య పతక పోరులో స్పెయిన్‌(Spain)ను చిత్తు చేస్తూ వరుసగా రెండో పతకాన్ని భారత్‌కు అందించింది. కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ అద్భుత ఆటతీరుతో అలరించిన వేళ... భారత్‌ పతకాల సంఖ్య నాలుగుకు పెరిగింది. ఈ మ్యాచ్‌లో హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత్‌కు స్పెయిన్‌ గట్టి పోటీ ఇచ్చింది. తొలుత 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే అద్భుతంగా పుంజుకున్న భారత జట్టు... రెండు పెనాల్టీ కార్నర్‌లను గోల్స్‌గా మలిచి ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి క్వార్టర్‌లో స్పెయిన్‌ 1-0 ఆధిక్యంలోకి వెళ్లగా రెండో క్వార్టర్‌లో ఒక గోల్‌.. మూడో క్వార్టర్‌లో మరో గోల్‌తో భారత్‌ 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే చివరి క్వార్టర్‌లో భారత డిఫెండర్లు రాణించడంతో స్పెయిన్‌కు మరో గోల్‌ చేసే అవకాశం దక్కలేదు.
  





 

హోరా హోరీ పోరు

కాంస్య పతక పోరులో స్పెయిన్‌-భారత్ మధ్య మ్యాచ్‌ హోరాహోరీగా సాగింది. సగం సమయం ముగిసే సరికి ఇరు జట్లు 1-1తో నిలిచాయి. రెండో క్వార్టర్‌ మరో 30 సెకన్లలో ముగుస్తుందనగా పెనాల్టీ కార్నర్‌కు గోల్‌గా మలిచిన భారత్‌ స్పెయిన్‌ గోల్స్‌ను సమం చేసింది. ఆ తర్వాత కూడా అదే దూకుడు కొనసాగించిన భారత జట్టు.. వరుసగా స్పెయిన్‌ గోల్‌ పోస్ట్‌పై దాడులు చేసింది. స్పెయిన్‌ గోల్ కీపర్‌ భారత దాడులను సమర్ధంగా అడ్డుకోగలిగాడు. చివరి క్వార్టర్‌లో గోల్‌ను సమం చేసేందుకు స్పెయిన్ వరుసగా దాడులు చేసినా భారత డిఫెండర్లు ఆ అవకాశం ఇవ్వలేదు. 





 

భారత ఆటగాళ్ల భావోద్వేగం

వరుసగా రెండో కాంస్య పతకం గెలవడంతో భారత ఆటగాళ్లు భావోద్వేగానికి గురయ్యారు. తన కెరీర్‌లో చివరి మ్యాచ్‌ ఆడిన ది గ్రేట్‌ ఆఫ్‌ వాల్‌ ఆప్‌ ఇండియా శ్రీజేష్‌ భావోద్వేగానికి గురయ్యాడు. విశ్వ క్రీడల్లో కాంస్య పతకంతో తన సుదీర్ఘ కెరీర్‌కు శ్రీజేష్‌ వీడ్కోలు పలికాడు. పతకం గెలిచిన తర్వాత కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ సహా భారత ఆటగాళ్లు భావోద్వేగంతో కంటతడి పెట్టుకున్నారు.  భారత జట్టు సంబరాలతోపాటు మైదానంలోనూ భారత్‌ మాతా కీ జై అన్న నినాదాలు మార్మోగాయి.

 

మళ్లీ స్వర్ణ యుగం దిశగా...

అంతర్జాతీయ క్రీడా వేదికపై మరోసారి భారత హాకీ జట్టు సత్తా చాటింది. ధ్యాన్‌చంద్‌ యుగంలో వరుసగా బంగారు పతకాలు సాధించి సత్తా చాటిన భారత ఒలింపిక్‌ జట్టు ఆ తర్వాత గాడి తప్పింది. భారత్‌కు నాలుగు దశాబ్దాల పాటు అసలు ఒలింపిక్‌ పతకమే లేకుండా పోయింది. ఆ నిరీక్షణకు తెరదించుతూ 2021 టోక్యో ఒలింపిక్స్‌లో భారత జట్టు కాంస్య పతకంతో మెరిసింది. ఇప్పుడు పారిస్‌ ఒలింపిక్స్‌లోనూ కాంస్య పతకాన్ని సాధించి వరుసగా రెండో పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇక భారత్‌ ఇదే జోరు కొనసాగిస్తే భారత్‌ స్వర్ణ యుగం మళ్లీ ఆరంభం కానుంది.