ఒలింపిక్స్‌లో ఇండియాకు తొలి మెడల్ అందించిన వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపింది. తాను సాధించిన పతకాన్ని దేశానికి అంకితమిస్తున్నట్టు పేర్కొంది. తన ఒలింపిక్ ప్రయాణంలో కోట్లమంది భారతీయుల ప్రార్థనలు తన వెన్నంటే ఉన్నాయని అభిప్రాయపడింది. తన తల్లికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నానని.. తన కోసం ఆమె ఎన్నో త్యాగాలు చేసిందని గుర్తు చేసుకుంది. తనపై తల్లి ఉంచిన విశ్వాసమే తనను గెలిపించిందని ఉద్వేగానికి లోనయ్యారు.



నిరంతరాయంగా మద్దతు ఇస్తూ... ప్రోత్సహించిన ప్రభుత్వాలకు, క్రీడా మంత్రిత్వశాఖ, ఎస్ఏఐ, ఐఓఏ, వెయిట్‌లిఫ్టింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ రైల్వే, ఓజీక్యూ, స్పాన్సర్లు, తన మార్కెటింగ్ ఏజెన్సీ ఐఓఎస్‌కు మీరాబాయి థాంక్స్‌ చెప్పారు. కోచ్ విజయ్ శర్మ, సపోర్ట్ స్టాఫ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ట్వీట్ చేసింది. 



టోక్యో ఒలింపిక్సక్‌లో  వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో మహిళల 49 కేజీల విభాగంలో మీరాబాయి చాను స్నాచ్‌లో 87 కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 115 కిలోలు కలిపి మొత్తంగా 202 కిలోలు ఎత్తి భారత‌కు తొలి పతకాన్ని అందించింది. ఫలితంగా కరణం మల్లీశ్వరి తర్వాత వెయిట్ లిఫ్టింగ్‌లో భారత్‌కు మరో పతకం దక్కింది.



గత రియో ఒలింపిక్స్‌లో ఎదురైన ఓటమినే ఆమె ఇప్పటి విజయానికి కారణమైంది. పట్టుదల, తీవ్రంగా శ్రమించి టోక్యో ఒలింపిక్స్‌లో అద్భుతమైన ప్రదర్శనతో మెడల్ సాధించారు. ఒలింపిక్స్‌లో వెయిట్‌ లిఫ్టింగ్‌ విభాగంలో రజతం సాధించిన తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించారు మీరాబాయి చాను. 



చిన్నప్పుడే టీవీల్లో స్పోర్స్ట్‌చూసి ఇన్‌స్పైర్ అయ్యేవారు. అదే స్థాయిలో తాను ఎదగాలని కష్టపడేవారు. అదే మీరాబాయి చానును గెలిపించింది. రియో ఒలింపిక్స్‌లో ఓటమి చెందినప్పుడే నిర్ణయించుకున్నానని.. టోక్యోలో తానేంటో నిరూపించుకోవాలని అని మీరాబాయి చెప్పడం ఆమె ఆత్మవిశ్వాసాన్ని తెలియజేస్తోంది. ఐదేళ్లలో ఐదు రోజులే ఇంటి వద్ద ఉన్నానని.. ఇప్పుడు ఈ పతకంతో ఊళ్లో అడుగుపెడతానంటూ గర్వంగా చెప్పారు. 




మీరాబాయి చానుకు మణిపూర్‌ వంటకం కంగోసి అంటే చాలా ఇష్టం. ఈ చరిత్రాత్మక క్షణంతో మీరా కుటుంబం సభ్యులు, స్నేహితులు, బంధువులు హ్యాపీగా ఫీల్‌ అవుతున్నారు. ఊరు ఊరుంతా సంబరాల్లో మునిగింది. ఆరుగురు సంతానంలో చిన్నదైన మీరాబాయి చాను సాధించిన విజయానికి ఫ్యామిలీ ఉప్పొంగిపోతోంది. సర్‌ప్రైజ్‌లు ప్లాన్ చేస్తున్నారు.