టోక్యో ఒలింపిక్స్‌లో భారత జట్టుకి ఎన్ని పతకాలు వస్తాయి? ఎవరు పతకాలు సాధిస్తారు? అంటే... ఆ లిస్ట్‌లో స్టార్ షట్లర్ పీవీ సింధు, బాక్సర్ మేరీ కోమ్ ఉన్నారు. వీరిద్దరూ స్వర్ణ పతకమే గెలుస్తారని అభిమానుల భారీ అంచనా వేస్తున్నారు.
విశ్వ క్రీడలు టోక్యో ఒలింపిక్స్‌లో వీరి ప్రయాణం ఆదివారం ప్రారంభంకానుంది. మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధు, 51 కేజీల విభాగంలో మేరీ కోమ్ కూడా ఆదివారమే తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఆర్చరీలో ప్రపంచ నంబర్ వన్ దీపిక కుమారి నుంచి పతకం ఆశించింది భారత్. కానీ, మిక్స్‌డ్ డబుల్స్‌లో దీపిక జోడీ నిరాశపరిచింది. దీంతో ఇప్పుడు పీవీ సింధు, మేరీ కోమ్, టెన్నిస్ జోడీ సానియా మీర్జా- అంకిత రైనాపై అందరి దృష్టి పడింది.
73 ఏళ్ల భారత్ బాక్సింగ్ ఒలింపిక్ చరిత్రలో మన క్రీడాకారులు సాధించింది కేవలం రెండు పతకాలు మాత్రమే. 1948 లండన్ ఒలింపిక్స్‌లో తొలి సారిగా భారత్ నుంచి బాక్సర్లు పాల్గొన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు బాక్సింగ్‌లో సాధించినవి రెండు పతకాలు. అందులో ఒకటి 2012లో మేరీ కోమ్ సాధించిన కాంస్య పతకమే. గత కొన్నేళ్లుగా భారత బాక్సర్లు అంతర్జాతీయ వేదికలపై తమ సత్తాను చాటుతున్నారు. ముఖ్యంగా దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్ ఒక ఒలింపిక్ పతకంతో పాటు ఆరు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించి తన కెరీర్‌కి గ్రాండ్‌గా వీడ్కోలు పలకాలని చూస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఇటలీలో శిక్షణ తీసుకుంది. ఆదివారం జరిగే తొలి రౌండ్లో మేరీ కోమ్ డొమినికన్ రిపబ్లిక్ క్రీడాకారిణి హెర్నాండేజ్‌తో తలపడనుంది.
రియో ఒలింపిక్స్‌లో సాధారణ కంటెస్టెంట్‌గా బరిలోకి దిగి రజతం సాధించి యావత్తు ప్రపంచం దృష్టి ఆకర్షించింది. ఫైనల్లో కరోలినా మారిన్‌తో పోరాడి ఓడింది. ఇక అప్పటి నుంచి ఏ టోర్నీలో పాల్గొన్నా పీవీ సింధు పతకం గెలుస్తుందని భావించారు కానీ, ఆ తర్వాత పాల్గొన్న చాలా టోర్నీల్లో సింధు ఫైనల్ వరకూ చేరింది కానీ విజేతగా నిలవడంలో తడబడింది. ఈ ఒలింపిక్స్‌లో ద్వారా సింధు తన రజతాన్ని స్వర్ణంగా మార్చుకోవాలని ఉబలాటపడుతోంది. ఈ క్రీడల్లో సింధుకు కలిసొచ్చే అంశం ఏంటంటే... కొందరు టాప్ ఆటగాళ్లు లేకపోవడమే. క్వార్టర్ ఫైనల్ వరకూ సింధుకు తన కంటే తక్కువ ర్యాంకు ఉన్న క్రీడాకారులతోనే డ్రా పడింది.
టోక్యో ఒలింపిక్స్‌లో గ్రూప్-జెలో ఉన్న పీవీ సింధు.. హాంకాంగ్‌కి చెందిన చెంగ్‌తో ఫస్ట్ మ్యాచ్‌లో తలపడనుంది. చెంగ్ ర్యాంక్ ప్రస్తుతం 34కాగా.. ఆ తర్వాత 58వ ర్యాంక్‌లో ఉన్న ఇజ్రాయిల్ షట్లర్ పోలికపోవాతో సింధు ఢీకొట్టనుంది. ప్రస్తుతం 7వ ర్యాంక్‌లో ఉన్న పీవీ సింధుకి ఇది చాలా సులువైన డ్రా అని అందరూ అంచనాలు వేస్తున్నారు. సింధు కూడా ఒలింపిక్స్ కోసం విదేశాల్లో శిక్షణ తీసుకుంది. కానీ, మ్యాచ్లో ఎవరు ఎలా రాణిస్తారనేది ముఖ్యం. ప్రస్తుతం టోక్యోలో ఉన్న సింధుపై అంచనాలు భారీగా ఉండటంతో ఒత్తిడికి గురవుతోందని సమాచారం.
ఇక టెన్నిస్ స్టార్ సానియా మీర్జా విషయానికి వస్తే టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల డబుల్స్ విభాగంలో అంకిత రైనాతో కలిసి బరిలోకి దిగింది. కానీ, టెన్నిస్ విభాగంలో భారత క్రీడాకారులకు కఠినమైన డ్రానే పడింది. మహిళల డబుల్స్‌లో సానియా మీర్జా–అంకిత రైనా జంట తొలి రౌండ్‌లో నదియా–లైద్మిలా కిచెనోక్ (ఉక్రెయిన్) జంటతో తలపడనుంది. ఒకవేళ తొలి రౌండ్ అడ్డంకిని సానియా ద్వయం అధిగమిస్తే రెండో రౌండ్‌లో ఎలీనా వెస్నినా–వెరోనికా కుదెర్మెతోవా (రష్యా ఒలింపిక్ కమిటీ) జోడీతో ఆడే అవకాశముంది. వెస్నినా 2016 రియో ఒలింపిక్స్‌లో మకరోవా జోడీగా మహిళల డబుల్స్‌లో స్వర్ణం సాధించింది. అంకిత రైనాకు ఒలింపిక్స్‌లో ఆడిన అనుభవం లేదు. తనకు ఇదే తొలి ఒలింపిక్స్. మరోపక్క 34 ఏళ్ల సానియా మీర్జా బాబుకి జన్మనిచ్చి సుమారు నాలుగు సంవత్సరాలు మైదానానికే దూరమైంది. తిరిగి ఆడటం ప్రారంభించిన సానియా ఓ టోర్నీలో విజేతగా కూడా నిలిచింది. ఒలింపిక్స్‌లో కూడా సానియాకు మెరుగైన రికార్డు లేదు. డబుల్స్‌లో ఆమె రెండో రౌండ్‌కు చేరడమే ఆమె అత్యుత్తమం.