Swapnil Kusale : పారిస్ ఒలింపిక్స్‌ 2024లో భారత్‌ మూడో పతకం సాధించింది. షూటింగ్ విభాగంలో భారత షూటర్ స్వప్నిల్ కుసాలే కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఇప్పటి వరకు మను భాకర్ వ్యక్తిగతంగా ఒక పతకం, సరబ్‌ జీత్‌సింగ్‌తో కలిసి రెండో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. ఇవాళ భారత్ మూడో పతకాన్ని కైవసం చేసుకుంది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్‌లో స్వప్నిల్ కుసాలే ఈ పతకాన్ని గెలుచకున్నాడు. ఈ గేమ్‌లో కుసాలే ఫైనల్‌లో 451.4 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. 


ఒలింపిక్స్ 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్‌లో తొలిసారిగా భారత షూటర్‌ పతకం సాధించడం ఇక్కడ హర్షించదగ్గ విషయం. ఇప్పటివరకు షూటింగ్ ఈవెంట్లలో భారత్‌కు మూడు పతకాలు వరించాయి. ఇవాళ జరిగిన ఈవెంట్‌లో చైనాకు చెందిన లియు యుకున్ స్వర్ణ పతకం సాధించాడు. రెండో స్థానంలో ఉన్న ఉక్రెయిన్‌కు చెందిన కులిష్ సెర్హి రజత పతకాన్ని గెలుచుకున్నాడు. 






స్వప్నిల్ కుసాలే విజయం అంత ఈజీగా సాగలేదు. ఒకానొక టైంలో స్వప్నిల్ కుసాలే 310.1 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. చివరికి వచ్చేసరికి పట్టుదలతో స్టాండింగ్ సిరీస్ తర్వాత పుంజుకున్నాడు. మొదట మోకాళ్లపై కూర్చొని షూటర్ షూట్ చేస్తారు. ప్రోన్‌లో నేలపై పడుకుని షూటింగ్ చేస్తారు. ఇది కాకుండా  షూటర్లు నిలబడి కూడా షూట్ చేయాల్సి ఉంటుంది. 


మహారాష్ట్రలోని కొల్హాపూర్‌ నుంచి వచ్చిన స్వప్నిల్ కుసాలే క్వాలిఫికేషన్ రౌండ్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ షూటర్ క్వాలిఫికేషన్ రౌండ్‌లో 590 పాయింట్లు సాధించాడు. ఫైనల్‌లో కూడా అంచనాలకు మించి స్కోర్ చేసి భారత్‌కు మూడో పతకం సాధించాడు. ఇప్పటి వరకు షూటింగ్‌లో మాత్రమే భారత్‌కు మూడు పతకాలు వచ్చాయి. ఆ మూడూ కాంస్య పతకాలే.