PV Sindhu and Lakshya Sen register dominant wins: పతక ఆశలను పెంచుతూ... అభిమానుల అంచనాలను అందుకుంటూ పీవీ సింధు(Pv sindhu) ఒలింపిక్స్(Olympics)లో దూసుకుపోతోంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించి గ్రూప్ స్టేజ్‌లో టాప్‌లో నిలిచి ఈ బ్యాడ్మింటన్ స్టార్ ప్రీ క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. మరో మూడు అడుగులు బలంగా వేసి... చైనా గోడను బద్దలు కొడితే సింధుకు వరుసగా మూడో ఒలింపిక్స్‌లోనూ పతకం రానుంది. ఇదే దూకుడు కొనసాగిస్తే సింధు విజయం ఖాయమని అంతా అంచనా వేస్తున్నారు.
చెలరేగిపోయిన సింధు
రెండుసార్లు పతక విజేత పీవీ సింధు ఎస్తోనియా క్రీడాకారిణి క్రిస్టినా కుబాను వరుస గేమ్‌లలో ఓడించి మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ రౌండ్-16లో బెర్త్‌ను ఖాయం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో 10వ సీడ్‌గా బరిలోకి దిగిన సింధు, 73వ ర్యాంక్‌లో ఉన్న ఇస్తోనియాకు చెందిన క్రిస్టినా కూబాపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. గ్రూప్ M చివరి మ్యాచ్‌లో సింధు 21-5, 21-10తో కూబాను సునాయసంగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో గెలిచేందుకు సింధుకు కేవలం 34 నిమిషాల సమయం మాత్రమే పట్టింది. గ్రూప్ స్టేజ్‌లో అజేయంగా నిలిచి 2 మ్యాచ్‌ల నుంచి 4 పాయింట్లతో సింధు గ్రూప్ ఎమ్‌లో టాప్‌గా నిలిచి ప్రీ క్వార్టర్‌లో అడుగుపెట్టింది. సింధు తన తొలి మ్యాచ్‌లో అబ్దుల్ రజాక్ ఫాతిమాపై ఘన విజయం సాధించగా... తాజాగా క్రిస్టినా పైనా ఘన విజయం సాధించింది. క్రిస్టినాతో జరిగిన మ్యాచ్‌ను సింధు బలంగా ప్రారంభించింది. వరుసగా మొదటి మూడు పాయింట్లను గెలుచుకుంది. ఆ తర్వాత కూడా మ్యాచ్‌పై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించిన సింధు... క్రిస్టినాకు ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. సింధు స్మాష్‌లు, క్రాస్ కోర్టు షాట్లు, డ్రాప్‌లతో క్రిస్టినాకు చెమటలు పట్టించింది. అసలు ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే సింధు తొలి మ్యాచ్‌ను గెలిచేసింది. క్రాస్-కోర్ట్ డ్రైవ్‌తో 13 పాయింట్ల ఆధిక్యంతో సింధు తొలి సెట్‌ను సునాయసంగా గెలిచేలా కనిపించింది. ఆ తర్వాత సింధు ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ 18-3 స్కోరుకు వెళ్లింది. క్రిస్టినా మరో రెండు పాయింట్లు సాధించే సరికి సింధు తొలి సెట్‌ను 21-5తో సొంతం చేసుకుంది.
రెండో సెట్‌లోనూ
రెండో సెట్‌లోనూ సింధు దూకుడు ముందు క్రిస్టినా నిలవలేకపోయింది. రెండో మ్యాచ్‌ను త్వరగా ముగించి నాకౌట్ మ్యాచ్‌లకు శక్తిని ఆదా చేయాలని భావించిన సింధు మ్యాచ్‌ను వేగంగా పూర్తి చేయాలని భావించింది. అయితే ఆరంభంలో స్కోరును 2-2తో సమం కావడంతో క్రిస్టినా పోరాడుతుందని అనిపించింది. కానీ సింధు శక్తివంతమైన స్మాష్‌లకు క్రిస్టినా వద్ద సమాధానమే లేకుండా పోయింది. క్రిస్టినా తప్పులు కూడా సింధుకు కలిసివచ్చాయి. వేగవంతమైన స్మాష్‌లు, ఖచ్చితమైన డ్రాప్ షాట్‌లతో సిందు 15-6 ఆధిక్యంలో దూసుకెళ్లింది. ఆ తర్వాత కూడా దాన్ని కొనసాగిస్తూ 21-10తో రెండో సెట్‌ను సొంతం చేసుకుంది. ఆమె మ్యాచ్‌ను వరుస సెట్లలో 21-5, 21-10తో గెలుచుకుంది. ప్రిక్వార్టర్ ఫైనల్‌లో సింధు చైనా క్రీడాకారిణి హీ బింగ్‌జియావోతో సింధు తలపడనుంది. ఇందులో విజయం సాధిస్తే సింధుకు పతక ఆశలు మరింత పెరుగుతాయి.
అదరగొట్టిన లక్ష్యసేన్.. ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశం!
పారిస్ ఒలింపిక్స్ పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ ప్రిక్వార్టర్స్‌లోకి (రౌండ్ 16) ప్రవేశించాడు. చివరి లీగ్ మ్యాచ్‌లో 21-18, 21-12 తేడాతో జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)పై గెలిచాడు. తొలి గేమ్‌లో ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్న లక్ష్యసేన్ చెమటోడ్చి నెగ్గాడు. రెండో సెట్‌లో మాత్రం అలవోకగా విజయం సాధించాడు. మొత్తం 16 గ్రూపుల నుంచి ఒక్కో ఆటగాడు నాకౌట్ చేరుకుంటారు.