India Beat Australia For The 1st Time In 52 Years: భారత హాకీ జట్టు (India Hockey team)చరిత్ర సృష్టించింది. 2021 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించి సుదీర్ఘ పతక నిరీక్షణకు తెరదించిన హాకీ జట్టు... ఈ ఒలింపిక్స్‌లోను పతకం దిశగా దూసుకుపోతోంది. ఈ క్రమంలో అర్ధ శతాబ్దం తర్వాత విశ్వ క్రీడల్లో ఆస్ట్రేలియాను ఓడించి సత్తా చాటింది. 52 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియాను భారత్ ఓడించింది. శుక్రవారం జరిగిన పురుషుల హాకీ పూల్ బీ చివరి మ్యాచ్‌లో భారత్ 3-2తో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. 1972 ఒలింపిక్స్ తర్వాత హాకీలో ఆస్ట్రేలియాను భారత్ ఓడించడం ఇదే తొలిసారి. భారత్ తరఫున అభిషేక్, హర్మన్‌ప్రీత్ సింగ్ (2) గోల్స్ చేయగా, ఆస్ట్రేలియా తరఫున థామస్ క్రెయిగ్, బ్లేక్ గోవర్స్ చెలరేగారు. ఈ విజయంతో భారత్ 5 మ్యాచుల్లో 10 పాయింట్లతో పూల్ బీలో రెండో స్థానానికి ఎగబాకింది. ఈ పూల్‌లో బెల్జియం అగ్రస్థానంలో ఉండగా... భారత్‌ రెండు... ఆస్ట్రేలియా మూడో స్థానంలో ఉంది. న్యూజిలాండ్‌పై విజయంతో ఈ ఒలింపిక్స్‌ను ప్రారంభించిన భారత్, అర్జెంటీనాపై డ్రా చేసుకుని... ఆపై ఐర్లాండ్‌ను ఓడించింది. 

 

అద్భుత ఆటతీరుకు ఫిదా

ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియా ఎదురుపడిన ప్రతీసారి ఓటమితో తిరిగివచ్చిన భారత జట్టు ఈ సారి మాత్రం వారికి ఆ అవకాశాన్ని ఇవలేదు. ఇన్నేళ్ల బాధను ముగిస్తూ... గత చేదు జ్ఞాపకాలను తుడిచేస్తూ పూల్‌ బీ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై 3-2తో విజయం సాధించింది. ఈ అద్భుత విజయంతో హాకీ జట్టు పూల్‌ బీలో రెండో స్థానానికి ఎగబాకడం విశేషం. ఇప్పుడు భారత్‌ క్వార్టర్‌ ఫైనల్లో బ్రిటన్‌తో తలపడనుంది. భారత హాకీ  జట్టుకు ఈ విజయం ఎంతో ఆత్మ విశ్వాసాన్ని ఇస్తుంది. 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్‌లో భారత్‌.. కంగారులను ఓడించింది. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు దూకుడు విధానాన్ని అవలంభిస్తూ కంగారులను కంగారు పెట్టారు. 1980 తర్వాత టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ కాంస్యం గెలిచింది. ఈ మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన భారత్‌... 3-1తో స్పష్టమైన ఆధిక్యాన్ని కనపరిచింది. కానీ ఆట మరో అయిదు నిమిషాల్లో ముగుస్తుందనగా  ఆస్ట్రేలియా ఓ గోల్‌ చేసింది. దీంతో స్కోరు 3-2కు తగ్గింది. ఈ క్రమంలో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. అయితే గోల్‌ కీపర్‌ శ్రీజేష్‌ మరోసారి ఆపద్భాందవుడిగా మారాడు. భారత డిఫెన్స్‌ను దాటుతూ చివరి సెకన్లలో ఆస్ట్రేలియా స్ట్రైకర్లు గోల్‌ పోస్ట్‌ సమీపానికి దూసుకొచ్చారు. అయితే శ్రీజేష్ తన ఎడమ చేతితో ఆసిస్‌ షాట్‌ను ఆపి భారత్‌కు విజయాన్ని అందించాడు. 

 

కోచ్‌ క్రెయిక్‌ వ్యూహాలు అదుర్స్‌

ఈ ఒలింపిక్స్‌లో భారత ఆటతీరులో వైవిధ్యం స్పష్టంగా కనిపిస్తోంది. కోచ్ క్రెయిగ్ ఫుల్టన్ వ్యూహాలు భారత్‌కు కలిసి వస్తున్నాయి. తన వ్యూహాలను ఒక్కొక్కటిగా బయటకు తీస్తూ ప్రత్యర్థి జట్లకు క్రెయిక్‌ షాక్‌ ఇస్తున్నాడు. బంతిపై పట్టు కోల్పోకుండా జాగ్రత్తగా పాస్ చేయడం, మైదానంలో ఖాళీలను గుర్తించడం, ముందుకు సాగడం వంటి వాటిపై క్రెయిక్‌ ఎక్కువగా దృష్టి పెడుతున్నాడు. ఫుల్టన్ ఆధ్వర్యంలో టీమ్ పటిష్టంగా కనిపిస్తోంది.