Lakshya Sen Makes History as 1st Men's Singles Semi-finalist:  లక్ష్యసేన్‌ (Lakshya Sen) చరిత్ర సృష్టించాడు. పతకం దిశగా మరో అడుగు ముందుకేశాడు. ఇక బ్యాడ్మింటన్‌లో పతకం ఖాయం చేసే దిశగా మరో అడుగు ముందుకేశాడు. సెమీఫైనల్లో అడుగు పెట్టి తుది పోరుకు కేవలం ఒకే అడుగు దూరంలో ఉన్నాడు. క్వార్టర్‌ ఫైనల్లో తొలి సెట్‌ ఓడిపోయినా... అద్భుతంగా పుంజుకున్న లక్ష్యసేన్‌.. తన లక్ష్యాన్ని వదలకుండా ముందుకు సాగాడు. చైనీస్‌ తైపీ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ చో చెన్‌పై ఆధిపత్యం ప్రదర్శించాడు. తర్వాత రెండు సెట్లను కైవసం చేసుకుని సెమీఫైనల్లో అడుగుపెట్టాడు. ఇక బంగారు పతకానికి కేవలం రెండే అడుగుల దూరంలో నిలిచాడు. లక్ష్యసేన్‌ దూకుడు చూస్తుంటే ఈ ఒలింపిక్స్‌(Paris Olympics 2024)లో భారత్‌కు మరో పతకం ఖాయమయ్యేలా కనిపిస్తుంది. ఒలింపిక్స్‌లో సెమీ ఫైనల్‌ చేరిన తొలి భారత పురుష బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా లక్ష్య సేన్ చరిత్ర సృష్టించాడు.






మాములుగా పుంజుకోలేదు..


క్వార్టర్‌ ఫైనల్లో పూర్తి ఆత్మ విశ్వాసంతో బరిలోకి దిగిన లక్ష్యసేన్‌కు షాక్‌కు తగిలింది. తొలి సెట్‌ను చైనీస్‌ తైపీ ప్లేయర్‌ గెలుచుకున్నాడు. ఇప్పటికే పీవీ సింధు, సాత్విక్‌-చిరాగ్‌ శెట్టి వైదొలగడంతో భారత అభిమానులు కీడు శంకించారు. అయితే లక్ష్యసేన్‌ మాత్రం అంత ఈజీగా వదల్లేదు. తన శక్తినంత కూడదీసుకుని... తనలోని ప్రతిభనంతా బయటకు తీసి తర్వాతి రెండు సెట్లను గెలిచి సెమీస్‌లోకి దూసుకెళ్లాడు. తొలి సెట్‌ను గెలుచుకుని లక్ష్యసేన్‌పై ఆధిపత్యం ప్రదర్శించాలని చైనీస్‌ తైపీ ప్లేయర్‌ చూసినా లక్ష్యసేన్‌ ముందు ఈ ఆటలు సాగలేదు. తొలి సెట్‌లో లక్ష్యసేన్‌ చివరి వరకూ పోరాడినా దానిని చైనీస్‌ తైపీ ప్లేయర్‌ చో చెన్‌ 19-21తో గెలుచుకున్నాడు. ఇక రెండో సెట్‌లో లక్ష్యసేన్‌ దూకుడు ముందు తేలిపోయాడు. తొలి సెట్‌ ఓడిపోయినా పూర్తి నమ్మకం, ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగిన లక్ష్యసేన్‌... స్మాష్‌లు.. నెట్‌ గేమ్‌తో చైనీస్‌ తైపీ ప్లేయర్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. రెండో సెట్‌ను 21-15తో గెలుచుకుని మ్యాచ్‌ను మూడో సెట్‌కు తీసుకెళ్లాడు. రెండో సెట్‌లో 10-10తో స్కోరు సమంగా ఉన్న దశలో లక్ష్యసేన్‌ దూకుడైన ఆటతీరుతో చైనీస్‌ తైపీ ప్లేయర్‌తో ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. స్కోరును 14-13కు తీసుకెళ్లాడు. ఇక్కడి నుంచి మరింత అద్భుతంగా ఆడిన లక్ష్యసేన్‌... చైనీస్‌ తైపీ ప్లేయర్‌ మరో పాయింట్‌ దక్కించుకునే సరికే సెట్‌ను గెలిచేశాడు.


మూడో సెట్‌లోనూ ఆధిపత్యమే: 


మూడో సెట్‌లోనూ లక్ష్యసేన్‌ ఛాంపియన్‌ ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ఆరంభంలో చో చెన్‌ కాస్త పోరాడినా తర్వాత లక్ష్యసేన్‌ ముందు నిలవలేకపోయాడు. లక్ష్యసేన్‌ మంచి ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. వరుస పాయింట్లతో 9-4 తో ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు, ఆ తర్వాత కూడా అదే దూకుడుగా ఆడిన లక్ష్యసేన్‌ చూస్తుండగానే 19-12 స్కోరుకు వెళ్లాడు. అనంతరం ఇక లేట్‌ చేయకుండా మరో రెండు పాయింట్లు కూడా సాధించేసి 21-12తో సెట్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. ఈ విజయంతో లక్ష్యసేన్‌ సెమీస్‌కు చేరాడు. సెమీస్‌ చేరిన తొలి భారత ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు.