Manu Bhaker Reaches Women 25 meter Pistol Final at Paris Olympics | పారిస్: పారిస్ ఒలింపిక్స్ 2024 నుంచి భారత్‌కు మరో శుభవార్త వచ్చింది. భారత షూటర్‌ మను భాకర్‌ మహిళల 25 మీటర్ల పిస్టల్‌ విభాగంలో ఒలింపిక్స్ ఫైనల్‌ చేరింది. మను భాకర్‌ ఫైనల్లో గెలుపొందితే, ఏదైనా పతకం సాధించినా అది ఆమె హ్యాట్రిక్ మెడల్ అవుతుంది. సరికొత్త చరిత్ర సృష్టించేందుకు మను భాకర్ అడుగు దూరంలో నిలిచింది. ఓ ఒలింపిక్స్ లో మూడు పతకాలు నెగ్గిన తొలి భారత క్రీడాకారిణిగా మను భాకర్ నిలవనుంది. 


మను భాకర్ ఇప్పటికే పారిస్ ఒలింపిక్స్ లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో కాంస్యం నెగ్గింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ విభాగంలోనూ ఫైనల్ చేరిన మను భాకర్ మరో కాంస్య పతకంతో మెరిసింది. తాజాగా 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఫైనల్ చేరుకుని భారత్‌కు మరో పతకం అందించేందుకు సన్నద్ధమవుతోంది. 






శనివారం మను భాకర్ ఫైనల్
మను భాకర్ ఫైనల్ చేరిన 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ ఫైనల్ శనివారం జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఆగస్టు 3న మధ్యాహ్నం 1 గంటలకు మను భాకర్ పాల్గొనే ఫైనల్ ప్రారంభమవుతుంది. పారిస్ ఒలింపిక్స్ లో రెండు పతకాలు సాధించిన మను భాకర్ మరో ఫైనల్లో ఎలాగైనా అత్యుత్తమ ప్రదర్శన చేసి ‘బంగారం’తో తిరిగి రావాలని యావత్ భారతావని ఆకాంక్షిస్తోంది.  శనివారం జరిగే ఫైనల్‌లో మను భాకర్ పతకం నెగ్గి ఓ ఒలింపిక్స్ లో హ్యాట్రిక్ పతకాలు నెగ్గిన తొలి భారత ప్లేయర్ గా చరిత్ర సృష్టించేందుకు కేవలం అడుగు దూరంలో ఉంది. 


టోక్యో ఒలింపిక్స్ 2020లో ఖచ్చితంగా పతకంతో తిరిగొస్తుందని అంతా భావించారు. ఎందుకంటే ఆ టీనేజర్ టాలెంట్ అలాంటిది. కానీ ఏం జరిగిందో కానీ ఆ ఒలింపిక్స్ ఫైనల్లో పిస్టల్ లో ఏదో సాంకేతిక సమస్య తలెత్తడంతో మను భాకర్ కు నిరాశ తప్పలేదు. తాజాగా జరుగుతున్న పారిస్ ఒలింపిక్స్ లో పతకం కాదు పతకాలు నెగ్గాలన్న సంకల్పంతో వచ్చిన మను భాకర్ కేవలం తన షూటింగ్ పైనే ఫోకస్ చేసింది. తన లక్ష్యం భారత్‌కు పతకాలు అందించడమని చాటి చెప్పింది. అయినా కూడా ఆమె రిలాక్స్ కాలేదు. భారత్ కు ఎలాగైనా స్వర్ణం నెగ్గాలన్న సంకల్పంతో మరో షూటింగ్ విభాగంలో ఫైనల్ కు చేరుకుని ఆశలు రేపుతోంది. ఈసారి ఎలాగైనా మను భాకర్ స్వర్ణం నెగ్గి భారత్ ఖాతాలో ఈ ఒలింపిక్స్ లో తొలి స్వర్ణం చేర్చాలని ఉవ్విళ్లూరుతోంది. 
పారిస్ ఒలింపిక్స్ లో మను భాకర్ ప్రతిభతో భారత్ పతకాల ఖాతా తెరిచింది. దాంతో ప్రధాని మోదీ సైతం మను భాకర్ కు ఫోన్ చేసి ప్రత్యేకంగా అభినందించారు. ఈసారి పిస్టల్ ఏ ప్రాబ్లం చేయలేదని సంభాషించారు. ఈ ఒలింపిక్స్ లో భారత్‌కు రెండు వ్యక్తిగత పతకాలు తెచ్చిన ప్లేయర్‌గా మను భాకర్ నిలిచింది. మరో పతకం నెగ్గితే, ఒకే ఒలింపిక్స్ లో హ్యాట్రిక్ పతకాలతో సరికొత్త చరిత్ర సృష్టించనుంది.