Armyman Hokato Hotozhe Sema wins bronze medal in shot put: హొకాటో హోటోజె సెమా( Hokato Hotozhe Sema)... పలికేందుకు కాస్త కష్టమైన పేరు. కానీ భారత క్రీడా చరిత్రలో నిలిచిపోయే పేరు కూడా. అటు యుద్ధ రంగంలో.. ఇటు క్రీడా రంగంలో దేశానికి ఎనలేని సేవలు చేసిన రియల్‌ హీరో. జమ్ముకశ్మీర్‌లోని యుద్ధ భూమి నుంచి పారాలింపిక్స్‌(Paris 2024 Paralympics)లో పతకం వరకు సెమా ప్రయాణం అసాధారణం. ఆరోగ్య, మానసిక సవాళ్లను దాటి సెమా పారాలింపిక్స్‌లో కాంస్యంతో సత్తా చాటాడు. కానీ ఈ ప్రయాణంలో అతను ఎదుర్కొన్న సవాళ్లు.. అధిగమించిన అడ్డంకులు... మాములువి కావు. అందుకే సెమా.. ఓ రియల్ హీరో. పదండి ఈ రియల్ హీరో ప్రస్థానాన్ని ఓసారి మనం తెలుసుకుందాం...

 





రియల్ హీరో సెమా.. 

నాగాలాండ్‌(Nagaland)కు చెందిన హొకాటో హోటోజె సెమా 1983లో జన్మించాడు. 2000వ సంవత్సరంలో కేవలం 17 ఏళ్ల వయసులో ఇండియన్ ఆర్మీలో చేరాడు. జమ్ముకశ్మీర్‌లోని చౌకీబాల్‌లో విధులు నిర్వహిస్తున్న సమయంలో సెమా జీవితం తలకిందులైంది. 2002లో నియంత్రణ రేఖ వద్ద విధులు నిర్వహిస్తున్న సమయంలో ఉగ్రవాదులు పెట్టిన మందుపాతర పేలి సెమా తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తర్వాత సెమా ఎడమ కాలును మోకాలి కింద వరకు తొలగించారు. దీంతో భారత సైన్యంలో ప్రత్యేక దళంలో చేరి సేవలందించాలనుకున్న సెమా ఆశలు ముగిసిపోయాయి. కాలు పోయినందుకంటే తాను ప్రత్యేక దళాల్లో సేవ చేసే అవకాశం కోల్పోయినందుకే సెమా తీవ్రంగా బాధపడ్డాడు. ఈ విషాద ఘటనతో సెమా ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాడు. ఆరోగ్యపరంగా... మానసికంగా సతమతమయ్యాడు. కష్యాల మధ్యే ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు. 

 

పారా క్రీడల వైపు...

ఆ తర్వాత 2016లో పారా క్రీడల వైపు దృష్టి సారించారు. అవయవ లోపాలు, బలహీనమైన కండరాల శక్తి ఉన్న అథ్లెట్లను కలిగి ఉన్న F57 విభాగంలో సెమా వేగంగా ఎదిగాడు. తన ప్రతిభతో ఆకట్టుకున్నాడు. పారాలింపిక్స్‌లో కాంస్య పతకం గెలవాలన్న కలను పారిస్‌ విశ్వ క్రీడల్లో నెరవేర్చుకున్నాడు. హవిల్దార్ హొకాటో హోటోజె సెమా పారాలింపిక్స్‌  పురుషుల F57 షాట్‌పుట్ ఈవెంట్‌లో 14.65 మీటర్ల త్రోతో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. " 2016లో పారా స్పోర్ట్స్‌కు ప్రజాదరణ లేదు. నేను 2016లో పారా స్పోర్ట్‌ను ప్రారంభించాను. 2018లో నా కేటగిరీని మార్చుకున్నాను. 2023 ఆసియా పారా గేమ్స్‌లో పతకం గెలిచిన తర్వాత.. పారాలింపిక్స్‌లో పతకం గెలవాలన్న లక్ష్యం పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ కల నెరవేరింది" అని పారాలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన తర్వాత సెమా తెలిపాడు. "నేను ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే నేను ఇండియన్ ఆర్మీ నుంచి పారాలింపిక్స్‌లో పతకం సాధించిన రెండో అథ్లెట్‌ను నేను. అథ్లెటిక్స్‌లో భారత సైన్యానికి ఇదే మొదటి పతకం. భారత సైన్యం మద్దతు లేకుండా ఇది సాధ్యం కాదు. ఈ పతకం నాలాంటి అనేక మంది సైనికులకు స్ఫూర్తినిస్తుందని కచ్చితంగా అనుకుంటున్నాను. 2028 లాస్ ఏంజెల్స్ గేమ్స్‌లో మరింత మెరుగ్గా రాణించి స్వర్ణం సాధించాలన్నదే నా తదుపరి లక్ష్యం" అని సెమా  చెప్పాడు.