Anand Mahindra Pens Emotional Post After India Ranka 71st In Olympics: దిగ్గజ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్ర(Anand Mahindra) చేసిన ట్వీట్‌ ఇప్పుడు క్రీడా ప్రపంచంలో సంచలనం రేపుతోంది. పారిస్‌ ఒలింపిక్స్‌(Paris Olympics) ముగించుకుని దేశానికి వచ్చిన అథ్లెట్లకు స్వాగతం పలుకుతూ మహీంద్ర చేసిన ట్వీట్‌ ఇప్పుడు చాలామందిని ఆలోచించేలా చేసింది. విశ్వ క్రీడల్లో భారత్‌ పతకాలు సాధించడం ఆనందమే అయినా... పతకాల జాబితాలో భారత స్థానంపై మహీంద్ర నిర్వేదం వ్యక్తం చేశారు. అన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా... కఠోర శ్రమ చేస్తున్న మన ప్రతిభను ఏ శక్తి అడ్డుకుంటుందో అర్థం కావడం లేదని మహీంద్ర చేసిన ట్వీట్‌ ఆసక్తితో పాటు ఆవేదనను కలిగిస్తోంది. ఒలింపిక్‌ పతకాలు సాధించిన అథ్లెట్లకు స్వాగతం అంటూనే మహీంద్ర... భవిష్యత్తు ఛాంపియన్లను తయారు చేయాలంటూ సందేశాన్ని కూడా ఆ ట్వీట్‌లో ఇచ్చారు.

 

ఇంకా ఏమన్నారంటే..

పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాలు తెచ్చి... మన దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన క్రీడాకారులను ఆనంద్‌ మహీంద్ర ఆ ట్వీట్‌లో అభినందించారు. దేశానికి ఒలింపిక్‌ పతకం సాధించడం మాములు గౌరవం కాదన్నారు. ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన వారిని చూస్తే సంతోషంగా ఉందన్నారు. కానీ పతకాల జాబితాలో భారత స్థానం చూసినప్పుడే ఆవేదన కలుగుతోందని ఆనంద్‌ మహీంద్ర అన్నారు. ఒలింపిక్స్‌ సహా అంతర్జాతీయ స్థాయి క్రీడలే లక్ష్యంగా భారత ప్రభుత్వం భారీగా డబ్బు ఖర్చు పెడుతోందని... పతకాలు సాధించిన వారికి భారీగా నజరానాలు కూడా ఇస్తోందని మహీంద్ర గుర్తు చేశారు. గతంతో పోలిస్తే క్రీడాకారులకు మౌలిక వసతులు, సదుపాయాలు సహా చాలా పెరిగాయన్నారు. ప్రభుత్వంతో పాటు ప్రైవేట్‌ వ్యక్తులు, సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా క్రీడాకారులకు అండగా నిలుస్తున్నాయని మహీంద్ర అన్నారు. ఇవన్నీ జరుగుతున్నా భారత పతకాల సంఖ్య పెరగకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ ఆలోచన విధానం పూర్తిగా మారినప్పుడు... విశ్వక్రీడల్లో ప్రపంచాన్ని ఓడించే ప్రతిభను ఈ భూగ్రహం మీద ఏ శక్తి అడ్డుకుంటోందని మహీంద్ర ప్రశ్నించారు. 





ఆనంద్‌ మహీంద్ర చేసిన ఈ ట్వీట్‌ ఇప్పుడు చాలామంది నెటిజన్లను ఆకట్టుకుంటోంది. మన ప్రతిభను అడ్డుకునే శక్తి ఏమిటో అర్థం కావడం లేదని ఓ నెటిజన్‌ రిప్లై ఇచ్చాడు. భవిష్యత్తులో మరింతమంది ఛాంపియన్లు వస్తారని మరొకరు తెలిపారు.

 

స్పందించిన రేవంత్‌రెడ్డి

ఆనంద్‌ మహీంద్ర ట్వీట్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించారు. ఆనంద్‌ మహీంద్ర ఆవేదనలో దేశంపై ప్రేమ, యువతపై అపార నమ్మకం కనిపిస్తోందని రేవంత్‌ ఆ పోస్ట్‌కు రిప్లై ఇచ్చారు. తెలంగాణలో క్రీడా విశ్వ విద్యాలయం ఏర్పాటుకు ప్రణాళికలు రచిస్తున్నామని.... తమ అమూల్యమైన సలహాలు ఇవ్వాలంటూ ఆనంద్‌ మహీంద్రను రేవంత్‌రెడ్డి కోరారు.  హైదరాబాద్‌లో స్పోర్స్ట్‌ యూనివర్సిటీ ఏర్పాట్కు దక్షిణ కొరియాలోని యూనివర్సిటీ అంగీకరించిందని ఈ సందర్భంగా రేవంత్‌ వెల్లడించారు. భవిష్యత్తు ఒలింపిక్స్‌ ఛాంపియన్లను తయారు చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రేవంత్‌ తెలిపారు.