CAS Report on Vinesh Phogat | పారిస్ ఒలింపిక్స్ లో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఈసారి ఎలాగైనా పతకం సాధించాలని భావించారు. అనుకున్నట్లుగానే ప్రతి రౌండ్ లో విజయం సాధిస్తూ ఫైనల్ చేరుకున్నారు. కానీ అనూహ్యంగా వినేశ్ ఫొగాట్ ను అనర్హురాలిగా ప్రకటించారు. 50 కేజీల రెజ్లింగ్ విభాగంలో బరిలోకి దిగుతున్న వినేశ్ నిర్ణీత బరువు కంటే కేవలం 100 గ్రాములు అధిక బరువు ఉందని డిస్ క్వాలిఫై చేశారు. ఫైనల్ చేరుకున్నందున కనీసం తనకు సిల్వర్ మెడల్ రావాలని కోర్ట్ ఆఫ్ ఆర్బిటరేషన్ ఆఫ్ స్పోర్ట్స్ (CAS) ను సంప్రదించారు రెజ్లర్ వినేశ్. కొన్ని వాయిదాలు ఇస్తూ వచ్చిన కాస్ చివరికి వినేశ్ ఫొగాట్ అప్పీల్ ను కొట్టివేసింది. దాంతో పారిస్ ఒలింపిక్స్ లో భారత్ ప్రస్థానం 6 పతకాలతో ముగిసింది.
ఆగస్టు 19న వినేశ్ ఫొగాట్ అప్పీల్ ను ఎందుకు కొట్టివేసిందో కాస్ స్పష్టం చేసింది. ఈ మేరకు సోమవారం నాడు 24 పేజీల రిపోర్ట్ విడుదల చేసింది. ఆగస్టు 14న కాస్ వినేశ్‌కు పతకం ఇవ్వడం వీలుకాదని వినేశ్ అప్పీల్ ను కొట్టివేయడం తెలిసిందే. వినేశ్ ఫొగాట్ తొలి రోజు బరువు చూసుకున్నప్పుడు 49.9 కేజీలు ఉన్నారు. ఆరోజు అన్ని రౌండ్లలో గెలుపొంది ఫైనల్ చేరుకున్నారు. రెండో రోజు బరువు చెక్ చేయగా 50.150 గ్రాములు ఉండగా.. 15 నిమిషాల డెడ్ లైన్ టైమ్ అనంతరం 50.100 కేజీలు ఉన్నారు. అంటే నిర్ణీత బరువు కంటే 100 గ్రాములు అధికంగా ఉన్న కారణంగా వినేశ్ ను ఫైనల్ ఆడేందుకు అనర్హురాలిగా ప్రకటించారు.
వినేశ్ తనకు సిల్వర్ మెడల్ రావాలని ఆగస్టు 7న అప్పీల్ చేసుకున్నారు. కానీ ఫైనల్ రోజు రెండోసారి బరువు చెక్ చేసుకున్నప్పుడు నిర్ణీత బరువు కంటే అధికంగా ఉన్న కారణంగా ఆమె అప్పీల్ ను కొట్టివేసినట్లు కాస్ పేర్కొంది. ఆర్టికల్ 11 ప్రకారం రెజ్లర్లు తాము పోటీ చేసిన విభాగాల్లో నిర్ణీత బరువుకు మించి ఉండకూడదని.. రూల్స్ ప్రకారమే వినేశ్ ఫొగాట్ ను డిస్ క్వాలిఫై చేసినట్లు స్పష్టం చేసింది. ఏ రెజ్లర్ కు మినహాయింపు ఉండదని, బరువు విషయంలో ఎవరికైనా రూల్ అంటే రూల్ పాటించాల్సిందేనని చెప్పింది.