Paris Olympics 2024:  మనం తరుచుగా ఒక మాట వింటుంటాం. అదేంటంటే వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే అని. అది నిజమే. అయితే ఒలింపిక్స్‌ లాంటి విశ్వ క్రీడల్లోనూ దీనిని నిరూపిస్తూ కొందరు చిచ్చర పిడుగులు అద్భుతాలు చేశారు. అసలు అంతర్జాతీయ క్రీడా వేదికంటేనే కాకలు తీరిన ఆటగాళ్లు ఉంటారు. ఏళ్ల తరబడి కఠోర శ్రమ చేసి విశ్వ క్రీడల్లో సత్తా చాటేందుకు వస్తారు. అలాంటి వారి మధ్య పట్టుమని పదహారేళ్లు కూడా లేని చిన్నారులు పోటీ పడి సత్తా చాటారంటే మనం ఆశ్చర్యపోవాల్సిందే.. పాఠశాల నుంచి ఒలింపిక్స్‌కు వచ్చిన ఆ అథ్లెట్లు క్రీడా ప్రపంచాన్నే అబ్బురపరిచారు. పదేళ్ల వయసులో ముక్కుపచ్చలారని చిన్నారులు ఒలింపిక్స్‌లో అదరగొట్టారంటే ఔరా అనాల్సిందే. పదేళ్ల వయసు కూడా లేని ఈ బుడతలు... దశాబ్దాల అనుభవం ఉన్న దిగ్గజ అథ్లెట్లతో పోటీ పడి సత్తా చాటారు. అంతర్జాతీయ క్రీడా వేదికపై అలా అద్భుతాలు చేసిన పది మంది బుడతల గురించి తెలుసుకుందాం పదండి..

 

డిమిట్రియోస్ లౌండ్రాస్ 

డిమిట్రియోస్ లౌండ్రాస్ 1896 ఒలింపిక్ గేమ్స్‌లో పోటీ పడిన మొదటి అథ్లెట్ల్‌. ఏథెన్స్‌ ఒలింపిక్స్‌లో పాల్గొని తన జిమ్నాస్టిక్స్ జట్టుతో కలిసి కాంస్య పతకాన్ని గెలుచుకున్నప్పుడు లౌండ్రాస్‌ వయస్సు  కేవలం 10 సంవత్సరాలు. ఒలింపిక్‌ పతకం సాధించిన అతిపిన్న వయస్కుడి రికార్డు అతని పేరిటే ఉంది.

 

గౌరికా సింగ్

నేపాల్‌కు చెందిన గౌరికా సింగ్ 13 ఏళ్ల వయసులో ఒలింపిక్స్‌లో స్విమ్మింగ్‌ విభాగంలో ఆ దేశానికి ప్రాతినిథ్యం వహించింది. 13 ఏళ్ల 255 రోజుల వయసులో 2016 రియో ఒలింపిక్స్‌లో 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ రేసులో పాల్గొంది. పతకం గెలవకపోయినా 

అందరి దృష్టిని ఆకర్షించింది. 

 

స్కై బ్రౌన్ 

టోక్యో ఒలింపిక్స్‌లో స్కేట్‌ బోర్డింగ్ విభాగంలా పాల్కొన్న 13 ఏళ్ల స్కై బ్రౌన్‌ అద్భుతం చేసింది. బ్రిటన్‌కు చెందిన స్కై బ్రౌన్‌ ఆ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించింది. ఆ విభాగంలో మెడల్‌ గెలిచిన అతి పిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించింది. 

 

కోకోనా హిరాకి

జపనీస్ స్కేటర్ కోకోనా హిరాకీకి 12 ఏళ్ల 343 రోజుల వయసులో ఒలింపిక్స్‌లో పాల్గొంది. టోక్యో ఒలింపిక్స్‌ 2020లో మహిళల పార్క్ స్కేట్‌బోర్డింగ్‌లో 59.04 స్కోరుతో రజత పతకాన్ని గెలుచుకుంది. ఈ చారిత్రాత్మక విజయంతో ఆమె ఈ ఈవెంట్‌లో పతకం సాధించిన అతి పిన్న వయస్కురాలిగా నిలిచింది. 

 

మోమీజీ నిషియా

14 ఏళ్ల జపనీస్ స్కేటర్ మోమోజీ నిషియా 2020 టోక్యో ఒలింపిక్స్‌లో హిరాకితో కలిసి పోటీ పడింది. నిషియా మహిళల స్ట్రీట్ ఈవెంట్‌ విభాగంలో స్వర్ణం గెలుచుకుంది, జపాన్‌లో అత్యంత పిన్న వయస్కురాలైన ఒలింపిక్ బంగారు పతక విజేతగా నిలిచింది.

 

రైస్సా లీల్,

13 ఏళ్ల రైస్సా లీల్‌ బ్రెజిల్‌ స్కేటర్‌. ఈ చిచ్చరపిడుగు 2020 టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొంది. తన ఈవెంట్‌లో రజత పతకాన్ని గెలుచుకుంది, మోమీజీ నిషియాకు రెండో స్థానంలో నిలిచింది. ఒలింపిక్స్ చరిత్రలో పతకం సాధించిన అతి పిన్న వయస్కుల్లో ఒకరిగా ఆమె తన స్థానాన్ని పదిలం చేసుకుంది. 

 

క్వాన్ హాంగ్‌చాన్

14 ఏళ్ల చైనీస్ డైవర్ క్వాన్ హాంగ్‌చాన్ టోక్యోలో 2020 ఒలింపిక్స్ అరంగేట్రం చేశాడు. హాంగ్‌చాన్‌ వ్యక్తిగత 10 మీటర్ల డైవింగ్‌ ఈవెంట్‌లో 466.20 పాయింట్లతో స్వర్ణం గెలుచుకున్నాడు. 2008లో చెన్ రౌలిన్ నెలకొల్పిన 447.7 రికార్డును హాంగ్‌చాన్ బద్దలు కొట్టి మరీ స్వర్ణాన్ని సాధించాడు. 

 

కేటీ గ్రిమ్స్

15 ఏళ్ల అమెరికన్ స్విమ్మర్ కేటీ గ్రిమ్స్ 2020 ఒలిపింక్స్‌లో అతి పిన్న వయస్కురాలు. ఆమె ఈవెంట్‌లో పతకం సాధించలేకపోయినప్పటికీ స్విమ్మింగ్‌ 800 మీటర్ల  ఫ్రీస్టైల్‌లో నాల్గో స్థానంలో నిలిచింది. త్రుటిలో పతకం సాధించే అవకాశాన్ని కోల్పోయినా ఎందరినో ఆకట్టుకుంది.

 

హెండ్ జాజా

టేబుల్ టెన్నిస్ ప్లేయర్ హెండ్ జాజా 2020 విశ్వక్రీడల్లో  అతి పిన్న వయస్కురాలైన ఒలింపియన్. మొదటి రౌండ్‌లో  వెటరన్ అథ్లెట్‌తో 12 ఏళ్ల హెండ్‌ జాజా పోరాడి ఓడింది. సిరియాకు చెందిన హెండ్ జాజా ఈ క్రీడల్లో అతి పిన్న వయస్కుడైన అథ్లెట్. 

 

లిల్లీ స్టోఫాసియస్

14 ఏళ్ల జర్మన్ స్కేట్‌బోర్డింగ్ ఛాంపియన్ లిల్లీ స్టోఫాసియస్ 2020లో ఒలింపిక్ అరంగేట్రం చేసింది. ఆ సమయంలో లిల్లీ వయసు 14 ఏళ్లు. మహిళల పార్క్ స్కేట్‌బోర్డింగ్ ఈవెంట్‌లో ఆమె 9వ స్థానంలో నిలిచింది.

 

బీట్రైస్ హుస్టియు

11 ఏళ్లు బీట్రైస్ హుస్టియు ఫ్రాన్స్‌లోని గ్రెనోబుల్‌లో జరిగిన 1968 ఒలింపిక్స్‌లో సింగిల్స్ ఫిగర్ స్కేటింగ్‌లో పోటీ పడింది. కానీ పతకం సాధించలేదు.