How the Games have changed between Paris 1924 and Paris 2024: విశ్వ క్రీడల సంరంభానికి అంతా సిద్ధమవుతోంది. పారిస్‌ ఒలింపిక్స్‌ 2024(Paris olympics 2024)లో సత్తా చాటేందుకు ప్రపంచ దేశాలకు చెందిన అథ్లెట్లు... ఫ్రాన్స్‌లో అడుగుపెడుతున్నారు. విశ్వ క్రీడల్లో పతకం గెలిచి తమ దేశ కీర్తిని అంతర్జాతీయ వేదికపై రెపరెపలాడించాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. అయితే పారిస్‌లో చివరి ఒలింపిక్స్‌ గేమ్స్ 1924లో జరిగాయి. మళ్లీ ఇప్పుడు 2024లో జరుగుతున్నాయి. అంటే సరిగ్గా వంద సంవత్సరాల(100 Years) తర్వాత పారిస్‌లో విశ్వ క్రీడలు నిర్వహిస్తున్నారు.  ఈ వంద సంవత్సరాల్లో క్రీడల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి. పదండి ఈ వందేళ్ల కాలంలో అథ్లెటిక్స్‌లో జరిగిన మార్పులను మరోసారి నెమరు వేసుకుందాం.


 

క్రీడల్లో భారీ మార్పులు 

మరికొద్ది రోజుల్లో ఒలింపిక్ క్రీడలు ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో ఆరంభం కాబోతున్నాయి. సరిగ్గా 100 సంవత్సరాల తర్వాత పారిస్ మూడవసారి ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. గత 10 దశాబ్దాల కాలంతో విశ్వ క్రీడల్లో పెను మార్పులు సంభవించాయి. 1924 పారిస్‌లో జరిగిన ఒలింపిక్ క్రీడలలో 27 అథ్లెటిక్స్ ఈవెంట్‌లు జరిగాయి. ఈ 27 విభాగాల్ు అన్నీ పురుషులకు మాత్రమే నిర్వహించారు. 1928లో ఆమ్‌స్టర్‌డామ్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో మహిళలను ఒలింపిక్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్‌లలోకి అనుమతించలేదు. కానీ పారిస్‌లో జరిగే 2024 ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్‌ ఈవెంట్‌లో మహిళలకు 23. పురుషులకు 23 విభాగాలు ఉన్నాయి. అంతే పారిస్‌లో వందేళ్ల క్రితం జరిగిన అథ్లెటిక్స్‌ విభాగంలో అసలు పోటీలోనే లేని మహిళ అథ్లెట్లు... ఇప్పుడు మాత్రం పురుషులతో సమానంగా 23 ఈవెంట్‌లలో పోటీ పడుతున్నారు. 

 

అయితే శతాబ్దం క్రితం పారిస్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో కనిపించిన కొన్ని విభాగాలను తర్వాత తొలగించారు. క్రాస్ కంట్రీ వ్యక్తిగత విభాగం, టీం ఈవెంట్‌లు, 3000 మీటర్లు టీం రేస్‌, 10,000 మీటర్ల వాక్‌ అండ్‌ పెంటాథ్లాన్ ఈవెంట్‌లు తర్వాతి ఒలింపిక్స్‌ క్రీడల నుంచి తొలగించారు. దిగ్గజ అథ్లెట్‌ పావో నూర్మి తన ఐదు బంగారు పతకాలలో మూడు స్వర్ణ పతకాలను ఈ తీసేసిన ఈవెంట్‌లలోనే సాధించాడు.

 

ఆస్పత్రికి అథ్లెట్లు

పారిస్‌లో జరిగిన 1924 ఒలింపిక్స్‌లో 10,000 మీటర్ల క్రాస్ కంట్రీ రేస్‌లో 38 మంది పాల్గొన్నారు. అయితే 45 డిగ్రీల ఉష్ణోగ్రతలో సీన్ ఒడ్డున ఉన్న ఫ్యాక్టరీల సమీపంలో ఈ రేస్ నిర్వహించారు. అప్పుడు హానికరమైన పొగను పీల్చిన ‌అథ్లెట్లు సొమ్మసిల్లి పడిపోగా వారిని ఆస్పత్రికి తరలించారు. మొత్తం 38 మంది రేస్‌లో పాల్గొనగా కేవలం 15 మందే ఆ రేస్‌ను పూర్తి చేశారు. ఆ ఒలింపిక్స్‌లో పెంటాథ్లాన్ 7.77 మీటర్ల లాంగ్ జంప్ చేసి అమెరికాకు చెందిన రాబర్ట్‌ లెజెండ్రై కాంస్య పతకాన్ని సాధించాడు. ఆ ఒలింపిక్స్‌లో వ్యక్తిగత ఒలింపిక్ బంగారు పతకాన్ని గెలుచుకున్న మొదటి నల్లజాతి క్రీడాకారుడిగా హబ్బర్డ్, రికార్డు సృష్టించాడు. అమెరికాకు చెందిన మోర్గాన్ టేలర్ 1924లో పారిస్‌లో జరిగిన 400 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. ఇలా 1924 పారిస్‌ ఒలింపిక్స్‌లో పతకాలను అందించిన కొన్ని ఈవెంట్‌లు తర్వాత కాలగర్భంలో కలిసిపోయాయి, ఒకప్పుడు అరకొర సౌకర్యాల మధ్యే క్రీడాకారులు అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చారు. ఇప్పుడు క్రీడాకారులకు సకల సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. పోటీలో పాల్గొనే క్రీడాకారుల సంఖ్య కూడా పెరిగింది.