Hockey World Cup 2023: జనవరి 13 నుంచి ఒడిశా వేదికగా పురుషుల హాకీ ప్రపంచకప్- 2023 ప్రారంభం కానుంది. నేడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కటక్ లోని బారాబతి స్టేడియంలో పురుషుల ప్రపంచకప్ ప్రారంభ వేడుకను జరపనున్నారు. ఈ వేడక కోసం ఇప్పటికే ఆ మైదానం ముస్తాబైంది. 


ఈరోజు సాయత్రం బారాబతి స్టేడియంలో హాకీ ప్రపంచకప్ ప్రారంభ వేడుక జరగనుంది. ఈ టోర్నీలో భారత్ తో సహా 16 దేశాలు పాల్గొనబోతున్నాయి. మన దేశం, ఇంకా పాల్గొనబోయే దేశాల పరిచయ కార్యక్రమం జరగనుంది. మనదేశ సంస్కృతి, ఉత్సవం, క్రీడాస్ఫూర్తి ఆలోచనలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ ప్రదర్శన సాగనుంది. దీనికోసం ఒడిశా ప్రభుత్వం అనేక సాంస్కృతిక ప్రదర్శనలను ఏర్పాటు చేసింది. ఒడిశా వరుసగా రెండో సారి పురుషుల హాకీ ప్రపంచకప్ నకు ఆతిథ్యం ఇస్తోంది. 


ప్రముఖుల ప్రదర్శనలు


ఈ ప్రారంభ వేడుకలో స్థానిక చలనచిత్ర పరిశ్రమల ప్రముఖులు, బాలీవుడ్ గాయకులు, విదేశాల నుంచి వచ్చిన కళాకారులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. రణ్ వీర్ సింగ్, దిశా పటానీ, ప్రీతమ్, బెన్నీ దయాల్, నీతి మోహన్, లీసా మిశ్రా, అమిత్ మిశ్రా, అంతరా మిత్ర, శ్రీరామచంద్ర, నకాష్ అజీక్, షల్మాలి ఖోల్ గాడే ఇంకా పలువురు పాల్గొననున్నారు. ఒడిశాకు చెందిన శ్రీయ లెంకాకు చెందిన కె-పాప్ గ్రూప్ బ్లాక్ స్వాన్ కూడా ఈ వేడుకలో ప్రదర్శన ఇవ్వనుంది. 


ఈ ప్రపంచకప్ ప్రారంభోత్సవంలో అత్యాధునిక డ్రోన్ షోను ప్రదర్శించనున్నారు. మొత్తం 500 డ్రోన్లను ఒకేసారి ఎగురవేయనున్నారు. కటక్ నగరవాసులు కార్యక్రమాలను వీక్షించేందుకు నగర మెట్రోపాలిటన్ కార్పొరేషన్ విస్తృత సన్నాహాలు చేసింది. మొత్తం 59 వార్డుల్లో ఎల్ ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. 


జనవరి 13న జరుగనున్న పూల్ మ్యాచ్‌లతో హాకీ ప్రపంచకప్ ప్రారంభమవుతుంది. జనవరి 29న జరగబోయే ఫైనల్‌ మ్యాచ్‌లో ఈ టోర్నీ ముగుస్తుంది. ఇప్పటి వరకు అత్యంత విజయవంతమైన ప్రపంచ కప్ జట్టుగా ఉన్న పాకిస్థాన్ 2023 ఎడిషన్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది. ఇప్పటివరకు భారత్ 4 సార్లు ఈ మెగా టోర్నీకి ఆతిథ్యమిచ్చింది. అయితే ఆతిథ్య జట్టుగా భారత్ కప్పును అందుకోలేకపోయింది.