స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్‌లో కఠిన ప్రత్యర్థి ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించి ఆత్మ విశ్వాసంతో ఉన్న టీమిండియా రెండో మ్యాచ్‌కు సిద్ధమైంది. ఢిల్లీ వేదికగా అఫ్గానిస్థాన్‌తో రెండో మ్యాచ్‌లో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. తొలి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, కె. ఎల్. రాహుల్ అద్భుత బ్యాటింగ్‌తో క్లిష్ట పరిస్థితుల నుంచి తేరుకుని రోహిత్ సేన చిరస్మరణీయ విజయం సాధించింది. చెన్నై చెపాక్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో లో స్కోర్లు నమోదవ్వగా.. ఢిల్లీలో మాత్రం భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. ఢిల్లీ అరుణ్‌జైట్లీ మైదానంలో దక్షిణాఫ్రికా-శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్‌లో 700 కంటే ఎక్కువ పరుగులు నమోదయ్యాయి. ఈ మ్యాచ్‌లోనూ భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు. చిన్న మైదానం కావడంతో భారత బ్యాటర్లు నిలబడితే వారిని కట్టడి చేయడం అఫ్ఘాన్ బౌలర్లకు తలకు మించిన భారం కావచ్చు.
తొలి మ్యాచ్‌లో విఫలమైన రోహిత్, ఇషాన్ కిషన్, శ్రేయస్స్ అయ్యర్ ఈ మ్యాచ్‌లో గాడిలో పడాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. బౌలర్లు సమర్థంగా రాణిస్తున్నా టాపార్డర్ వైఫల్యమే టీమిండియాను కలవరపాటుకు గురిచేస్తోంది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో తక్కువ స్కోరును ఛేదించే క్రమంలో రెండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోవడం భారత జట్టును ఆందోళనకు గురిచేస్తోంది. డెంగ్యూ కారణంగా భీకర ఫామ్‌లో ఉన్న శుబ్‌మన్ గిల్ రెండో మ్యాచ్‌కు కూడా దూరం కావడం రోహిత్ సేనకు ప్రతికూలంగా మారింది. శుభ్‌మన్ గిల్ దూరం కావడంతో రోహిత్‌తో పాటు ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలతో భారత బ్యాటింగ్ దుర్భేద్యంగా ఉంది. బుమ్రా, సిరాజ్, రవీంద్ర జడేజా, కుల్‌దీప్ యాదవ్‌లతో భారత బౌలింగ్ దళం కూడా బలంగా ఉంది. ఈ బౌలింగ్ దాడిని తట్టుకుని అఫ్గాన్ నిలవడం కష్టమే అని మాజీలు అంచనా వేస్తున్నారు. అయితే ఇద్దరు స్పిన్నర్లతోనే బరిలోకి దిగాలని రోహిత్ భావిస్తే... అశ్విన్ స్థానంలో మహ్మద్ షమీకి తుది జట్టులో చోటు దక్కవచ్చు. ఈ ఒక్క మార్పు మినహా జట్టులో పెద్దగా మార్పులు ఉండవు.
వన్డే ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్ కూడా అత్యుత్తమ ప్రదర్శన చేయాలని పట్టుదలతో ఉంది. బంగ్లాదేశ్‌తో ఘోర పరాజయం తర్వాత ఢిల్లీలో తమ ఉత్తమ ప్రదర్శన చేయాలని అఫ్గాన్ భావిస్తోంది. స్పిన్‌పైనే ఎక్కువ ఆధారపడుతున్న అఫ్గాన్ మరోసారి బంతితో భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టాలని చూస్తోంది. ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ టాప్ ఫామ్‌లో ఉండడం అఫ్గాన్‌కు కలిసిరానుంది. రషీద్ ఖాన్‌ను భారత బ్యాటింగ్ దళం ఎలా ఎదుర్కొంటుందో వేచి చూడాలి.
భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, KL రాహుల్ (కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, సూర్యకుమార్ యాదవ్, శార్దూల్ ఠాకూర్.
అఫ్గానిస్థాన్ జట్టు:
హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రియాజ్ హసన్, రహమత్ షా, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, ఇక్రమ్ అలీఖిల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మద్, ఎఫ్ నూర్ అబ్దుల్, ఎఫ్ నూర్ అబ్దుల్, ఎఫ్. హక్