ప్రపంచకప్‌ ఆరంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో భంగపడ్డ డిపెండింగ్‌ ఛాంపియన్ ఇంగ్లాండ్... రెండో మ్యాచ్‌లో జూలు విదిల్చింది. ధర్మశాల వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించి వన్డే ప్రపంచకప్‌ 2023లో బోణీ కొట్టింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 137 పరుగుల భారీ తేడాతో ఇంగ్లాండ్‌ చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 364 పరుగులు చేయగా... బంగ్లాదేశ్‌ 48.2 ఓవర్లలో కేవలం 227 పరుగులు చేసి ఆలౌటయ్యింది. 



 ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్.. ఇంగ్లాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. బ్రిటీష్ జట్టుకు జానీ బెయిర్‌ స్టో, డేవిడ్‌ మలన్‌ అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. తొలి వికెట్‌కు 115 పరుగులు భాగస్వామ్యం నమోదు చేసి గట్టి పునాది వేశారు. డేవిడ్‌ మలన్‌ బంగ్లా బౌలర్లపై ఎదురుదాడికి దిగి అద్భుత శతకం సాధించాడు. ఓపెనర్‌ డేవిడ్ మలన్ (140; 107 బంతుల్లో 16 ఫోర్లు, 5 సిక్స్‌లు) భారీ శతకంతో విరుచుకుపడగా.. జో రూట్ (82; 68 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌) మెరుపులు మెరిపించాడు. బెయిర్‌స్టో (52; 59 బంతుల్లో 8×4) అర్ధశతకం సాధించాడు. డేవిడ్‌ మలాన్‌ విధ్వసకర శతకానికి తోదడు జో రూట్‌, జానీ బెయిర్‌ స్టో అర్ధ శతకాలు తోడవ్వడంతో ఇంగ్లండ్‌.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 364 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. బంగ్లాదేశ్‌ బౌలర్లలో మెహదీ హసన్‌ 4 వికెట్లు పడగొట్టగా.. షోర్‌ఫుల్‌ ఇస్లాం మూడు, టాస్కిన్‌ అహ్మద్‌, షకీబ్‌ తలా వికెట్‌ సాధించారు. 



 అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్‌ 48.2 ఓవర్లలో కేవలం 227 పరుగులు చేసి ఆలౌటయ్యింది. ఓపెనర్‌ లిటన్‌ దాస్‌ (76; 66 బంతుల్లో 7×4, 2×6), ముష్ఫికర్‌ రహీమ్‌ (51; 64 బంతుల్లో 4×4) పోరాడినా ఫలితం లేకపోయింది. మిగతావారెవ్వరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. ఇంగ్లండ్‌ పేసర్‌ టాప్లీ ఆదిలోనే మూడు వికెట్లు పడగొట్టి బంగ్లాను కోలుకోలేని దెబ్బతీశాడు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో రీస్‌ టాప్లే 4 వికెట్లు పడగొట్టగా.. వోక్స్‌ 2 వికెట్లు తీశాడు. సామ్‌కరన్‌, మార్క్‌వుడ్‌, అదిల్‌ రషీద్‌, లివింగ్‌స్టోన్‌ తలో వికెట్‌ తీశారు.ఇంగ్లండ్‌ తమ తదుపరి మ్యాచ్‌లో ఆక్టోబర్‌ 15న ఢిల్లీ వేదికగా ఆఫ్టానిస్తాన్‌తో తలపడనుంది. 



 వన్డే వరల్డ్‌కప్‌ తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌... న్యూజిలాండ్‌ చేతిలో పరాజయం పాలైంది శుభారంభం చేసింది. కివీస్‌ బ్యాటర్లు డేవాన్‌ కాన్వే, రచిన్‌ రవీంద్ర శతకాలతో చెలరేగడంతో ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌ను న్యూజిలాండ్‌ చిత్తు చేసింది. బ్రిటీష్‌ బౌలర్లను ఊచకోత కోసిన కివీస్‌ బ్యాటర్లు కేవలం ఒక్క వికెట్‌ మాత్రమే కోల్పోయి ఇంగ్లాండ్‌ నిర్దేశించిన 282 పరుగుల లక్ష్యాన్ని మరో 82 బంతులు మిగిలి ఉండగానే సునాయసంగా ఛేదించారు. 273 పరుగుల రికార్డు భాగస్వామ్యంతో కాన్వే, రచిన్‌ రవీంద్ర కివీస్‌కు ఘన విజయం అందించారు. డేవాన్ కాన్వే, వన్‌ డౌన్‌ బ్యాటర్ రచిన్‌ రవీంద్ర.. ఇంగ్లాండ్‌ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. ఈ ఇద్దరు బ్యాటర్లు సెంచరీలతో కదం తొక్కడంతో కివీస్‌కు విజయం నల్లేరుపై నడకగా మారింది. కాన్వే ఊచకోతకు ఇంగ్లాండ్‌ బౌలర్లకు దిక్కుతోచలేదు. ఎన్నిసార్లు బౌలింగ్‌ మార్చినా ఈ భాగస్వామ్యాన్ని విడదీయడం బ్రిటీష్‌ బౌలర్ల తరం కాలేదు. కాన్వే 152, రచిన్‌ రవీంద్ర 123 పరుగులతో చెలరేగడంతో ఇంగ్లాండ్‌ విధించిన 282 పరుగుల లక్ష్యాన్ని కివీస్‌ కేవలం ఒక వికెట్‌ మాత్రమే కోల్పోయి 36.2 ఓవర్లలోనే ఛేదించింది.