వన్డే వరల్డ్‌కప్‌ 2023లో  నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్‌ అరుదైన రికార్డు సృష్టించాడు. ఉప్పల్‌ వేదికగా జరిగిన నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒకే బంతికి 13 పరుగులు చేసి అరుదైన ఘనత సాధించాడు. ప్రపంచకప్‌లో ఒకే బంతికి 13 పరుగులు చేసిన బ్యాటర్‌గా శాంట్నర్‌ నిలిచాడు. హైదరాబాద్‌ వేదికగా జరిగిన నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్‌ను డచ్‌ బౌలర్ బ్యాస్ డి లీడే వేశాడు. ఇన్నింగ్స్‌ చివరి బంతిని లీడే వేయగా.. శాంట్నర్‌ సిక్స్‌ కొట్టాడు. ఆఫ్‌ సైడ్‌లో లీడే వేసిన బంతి శాంట్నర్‌ నడుము కంటే ఎక్కువ ఎత్తులో రావడంతో అంపైర్‌ ఆ బంతిని నోబాల్‌గా ప్రకటించాడు. ఆ బంతికి సిక్స్‌ కూడా రావడంతో ఏడు పరుగులు వచ్చాయి. నోబాల్‌ కావడంతో తర్వాతి  బంతికి ఫ్రీహిచ్‌ కూడా వచ్చింది. ఫ్రీ హిట్‌ బాల్‌ను కూడా నెదర్లాండ్స్‌ బౌలర్‌ ఫుల్‌ టాస్‌ వేయడంతో శాంట్నర్‌ మరో భారీ సిక్స్‌ బాదేశాడు. రెండు భారీ సిక్సులు, ఒక నో బాల్‌తో ఆ ఒక్క బంతికే 13 పరుగులు వచ్చాయి. దీంతో ఒక్క బంతిలోనే 13 పరుగులు చేసిన ఆటగాడిగా శాంట్నర్‌ రికార్డు సృష్టించాడు.


శాంట్నర్‌ విధ్వంసంతో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ చివరి బంతికి 13 పరుగులు చేసిన నెదర్లాండ్స్‌ ముందు 322 పరుగులు చేసింది. శాంట్నర్‌ 17 బంతుల్లోనే 36 పరుగులు చేసి నెదర్లాండ్స్‌ 300 పరుగుల మైలురాయిని దాటడంలో కీలకంగా వ్యవహరించాడు. 
 అనంతరం బాల్‌తోనూ నెదర్లాండ్స్‌ను ముప్పుతిప్పలు పెట్టిన శాంట్నర్‌.. డచ్‌ పతనాన్ని శాసించాడు. 59 పరుగులిచ్చి 5 వికెట్లు నేలకూల్చాడు. ప్రపంచ కప్ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన మొదటి న్యూజిలాండ్‌ స్పిన్నర్‌గా కూడా శాంట్నర్‌ రికార్డు సృష్టించాడు. శాంట్నర్‌ స్పిన్‌తో నెదర్లాండ్స్‌ జట్టు 46.3 ఓవర్లలో 223 పరుగులకే ఆలౌట్ అయ్యింది. 



  ప్రపంచకప్‌ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌ను చిత్తు చిత్తుగా ఓడించిన న్యూజిలాండ్‌... రెండో మ్యాచ్‌లోనూ ఘన విజయం సాధించింది. హైదరాబాద్‌ వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో కూడా పసికూన నెదర్లాండ్స్‌పై న్యూజిలాండ్ జట్టు ఘన విజయం సాధించింది. అంచనాలకు తగ్గట్లే ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ జట్టుకు ఏ మాత్రం అవకాశం ఇవ్వని న్యూజిలాండ్‌... 99 పరుగుల తేడాతో విజయదుంధుభి మోగించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ జట్టు 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 322 పరుగులు సాధించింది. 323 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన డచ్ ఆర్మీ... 46.3 ఓవర్లలో కేవలం 223 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ జట్టు అగ్రస్థానాన్ని బలపరుచుకుంది.



 ప్రపంచ కప్ 2023లో నెదర్లాండ్స్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో గెలిచిన న్యూజిలాండ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ప్రపంచ కప్‌లో ఇప్పటివరకు న్యూజిలాండ్, నెదర్లాండ్స్ మాత్రమే రెండు మ్యాచ్‌లు ఆడాయి. అందులో న్యూజిలాండ్ జట్టు రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి అగ్రస్థానంలో నిలిచింది. కాగా డచ్ జట్టు మాత్రం రెండింటిలోనూ ఓటమిని చవి చూసింది. 


Also Read:రంగంలోకి బ్లాక్‌ క్యాట్స్‌, భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు కనీవినీ ఎరుగని భద్రత


Also Read:  ఆస్పత్రిలో చేరిన శుభ్‌మన్‌ గిల్‌ , ఆందోళనపరుస్తున్న ఆరోగ్యం