టీమిండియా స్టార్ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ ఆరోగ్య పరిస్థితి అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. భీకర ఫామ్‌లో ఉన్న ఈ స్టార్‌ ప్లేయర్‌.. ఈ ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేస్తాడని బోలెడు ఆశలు పెట్టుకున్న గిల్‌.. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఇప్పుడు అక్టోబర్‌ 14న పాకిస్థాన్‌-భారత్‌ మధ్య జరిగే హై ఓల్టేజ్‌ మ్యాచ్‌కు కూడా గిల్‌ దూరం కానున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. కొద్ది రోజులుగా డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న గిల్‌.. ప్లేట్‌ లెట్స్‌ స్వల్పంగా తగ్గిపోవడంతో చెన్నైలోని కావేరీ హాస్పిటల్‌లో చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గిల్‌ వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఆఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌ కోసం టీమిండియా న్యూఢిల్లీకి బయల్దేరగా గిల్‌ ట్రీట్‌మెంట్‌ తీసుకుంటూ చెన్నైలోనే ఉండిపోయాడు. ప్లేట్‌ లెట్స్‌ కౌంట్‌ పెరిగాక అతను తిరిగి భారత శిబిరంలో చేరుతాడు. గిల్‌ పూర్తిగా కోలుకునేంత వరకు టీమిండియాతోనే ఉండాలని నిర్ణయించకున్నాడని, అతను విశ్రాంతి కోసం ఇంటికి వెళ్లేందుకు కూడా ఇష్టపడలేదని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.  



 గిల్ ఢిల్లీకి వెళ్లలేదని, చెన్నైలో ఉంటూనే చికిత్స పొందుతాడని బీసీసీఐ బులెటిన్‌ విడుదల చేసింది. మంగళవారం సాయంత్రం గిల్‌ ప్లేట్‌లెట్స్ తగ్గిపోయి ఆస్పత్రిలో చేరాడని, ప్రస్తుతం చికిత్స కొనసాగుతోందని వివరించింది. శనివారం పాకిస్థాన్‌తో జరిగే హై ఓల్టేడ్‌ మ్యాచ్‌లోను గిల్ ఆడే అవకాశం లేదని తెలుస్తోంది. గిల్ ఈ మ్యాచ్‌కు కూడా అందుబాటులో లేకపోతే రోహిత్ శర్మతో కలిసి ఇషాన్ కిషన్ ఓపెనింగ్‌కు వస్తాడు. డెండ్యూ ఫీవర్‌ కారణంగా శుభ్‌మన్‌ గిల్‌ వరల్డ్‌కప్‌లో ఇప్పటికే ఆసీస్‌తో కీలక మ్యాచ్‌కు దూరమయ్యాడు. అఫ్ఘానిస్తాన్‌తో మ్యాచ్‌ తర్వాత పాక్‌తో మ్యాచ్‌కు ముందు రెండు రోజులు గ్యాప్‌ ఉండటంతో గిల్‌ పూర్తిగా కోలుకుంటాడని భారత క్రికెట్‌ అభిమానులంతా ఆశిస్తున్నారు.



 గత వారం గిల్‌కు డెంగ్యూ పాజిటివ్ వచ్చింది. ఆదివారం భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌కు ఈ స్టార్‌ ఓపెనర్‌ దూరమయ్యాడు. శనివారం పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో గిల్ ఫిట్‌గా ఉంటాడని అంతా భావించే సమయంలో మళ్లీ ఆస్పత్రిలో చేరడం ఆందోళన కలిగిస్తోంది. డెంగ్యూ నుంచి కోలుకోవడానికి కనీసం రెండు వారాలు పడుతుందని వైద్యులు చెబుతున్నారు. అంటే గిల్ వచ్చే వారం ప్రారంభంలో మాత్రమే  తిరిగి బరిలోకి దిగగలడని భావిస్తున్నారు. ఈ ఏడాది వన్డేల్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా గిల్ నిలిచాడు. గిల్‌ పూర్తిగా ఫిట్‌గా ఉంటే, ప్రపంచ కప్‌లో టీమిండియాకు అతిపెద్ద గేమ్ ఛేంజర్‌గా ఉంటాడని మేనేజ్‌మెంట్‌ ధీమాతో ఉంది. 


ఇటీవలికాలంలో భీకర ఫామ్‌లో ఉన్న గిల్‌ లేకపోవడం టీమిండియాకు పెద్ద లోటే అయినప్పటికీ విరాట్‌ కోహ్లి, కేఎల్‌ రాహుల్‌ లాంటి స్టార్లు ఆ లోటును పూడుస్తున్నారు. ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుపోయిన టీమిండియాను విరాట్‌, రాహులే గట్టెక్కించారు.
 ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్‌కు గిల్‌ దూరమవడంతో.. రోహిత్‌తో కలిసి ఇషాన్‌ కిషన్‌ ఓపెనింగ్‌ చేశాడు. అయితే.. రోహిత్‌, ఇషాన్‌, శ్రేయస్‌ ముగ్గురూ సున్నాకే ఔట్‌ కావడంతో భారత్‌ ఆదిలోనే పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌ క్లిష్ట పరిస్థితులను అధిగమించి.. సమయోచితంగా ఆడుతూ జట్టుకు విజయాన్నందించారు.  ఏదిఏమైనప్పటకీ గిల్‌ డెంగ్యూ నుంచి పూర్తిగా కోలుకుని త్వరలో బరిలోకి దిగాలని ఆశిద్దాం.