నదుల్లోనూ, జలపాతాలవద్ద సంచరించే మొసలి పంట కాలువలో దర్శనమివ్వడంతో స్థానికులు హడలెత్తిపోయారు. భయాందోళనలకు గురయ్యారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని అమలాపురం ప్రధాన పంటకాలువలో మొసలి సంచరించడం కలకలం రేపింది. దీన్ని గమనించిన కొందరు సెల్‌ఫోన్‌లలో వీడియోలు తీశారు.

 

ఆ తరువాత అది కనిపించకుండాపోవడంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతుంది. పంటకాలువలోకి ఎవ్వరూ దిగవద్దని మొసలి తిరుగుతుందని మున్సిపాలిటీ కమిషనర్‌ హెచ్చరికలు జారీ చేయడంతో  మరింత కలవరపాటుకు గురవుతున్నారు స్థానిక ప్రజలు. నడిపూడి నుంచి ఈదరపల్లి మధ్యలో రెండు రోజుల క్రితం కొందరికి మొసలి కనిపించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే కనిపించిన చోట మొసలి జాడ లేకపోవడంతో అది ఎటువైపుకు వెళ్లిందో తెలియని పరిస్థితి కనిపిస్తోంది. దీంతో కాలువలోకి దిగాలంటే చాలు ప్రజలు హడలెత్తిపోతున్నారు.

 

హెచ్చరిక జారీ చేసిన కమిషనర్‌..
నడిపూడి లాకుల వద్ద నుంచి సమనస లాకుల మధ్యలో ప్రధాన పంటకాలువలో మొసలి తిరుగుతుందని, అందు వల్ల ఎవరూ పంటకాలువలోకి దిగవద్దని అమలాపురం మున్సిపల్‌ కమిషనర్‌ అయ్యప్పనాయుడు ఓ ప్రకటన జారీచేశారు. ఇరిగేషన్‌ అధికారులు  ఇప్పటికే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఇరిగేషన్‌, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా మొసలిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అయ్యప్పనాయుడు తెలిపారు.

 

ఆత్రేయపురంలో కనిపించిన మొసలి ఇదేనా..
ఇటీవల ఆత్రేయపురం మండలంలో బబ్బర్లంక వద్ద ప్రధాన పంటకాలువలో మొసలి ఉన్నట్లు గుర్తించారు కొందరు. వినాయక విగ్రహాలు నిమజ్జనోత్సవం సందర్భంగా కాలువలోకి దిగిన కొందరికి మొసలి కనిపించిందని, దీంతో భయాందోళనలతో పరుగులుపెట్టారు. అప్పట్లో స్థానిక ఎస్సై కిరణ్‌కుమార్‌ కూడా మొసలి సంచారంపై హెచ్చరిస్తూ ప్రకటన జారీ చేశారు. అయితే అది అప్పట్లో బబ్బర్లంక నుంచి అమలాపురం మీదుగా ప్రవహించే ప్రధాన పంటకాలువ కావడంతో అదే మొసలి ఇలా అమలాపురం వరకు వచ్చేసి ఉంటుందని బబ్బర్లంక వద్ద కనిపించిన మొసలే ఇప్పుడు అమలాపురంలో కనిపించిన మొసలి అని నిర్ధారించారు.

 

కాలువల్లో దిగాల్సిన అవసరం..
సాగునీటి అవసరాలు తీర్చుకునేందుకు, పశువులను శుభ్రం చేయడం వాటిని నీళ్లు పెట్టడం వంటి అవసరాలకు రైతులు చాలా మంది పంటకాలువలపైనే ఆధారపడుతుంటారు. ప్రధాన పంటకాలువలో మొసలి సంచరిస్తుందన్న వార్తతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొసలి తిరుగుతుందన్న వార్తతో రెండు రోజుల నుంచి కాలువలోకి దిగాలంటే భయం వేస్తుందని పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.

 

ఇరిగేషన్‌, అటవీశాఖ అధికారులు వెంటనే మొసలిని పట్టుకుని వేరే ప్రాంతంలో విడిచిపెట్టాలని, లేకపోతే ఏ సమయంలో ఎవరిపై దాడి చేస్తుందని భయపడిపోతున్నామని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే నడిపూడి లాకుల నుంచి సమనస లాకుల వరకు మధ్య ఉన్న దూరం దాదాపు 10 కిలోమీటర్లు ఉంటుంది, ఈ లాకులను మూసివేసి నీటిని వదిలేస్తే మొసలి ఎక్కడ ఉన్నది చాలా సునాయాసంగా గుర్తించవచ్చని అంటున్నారు. ఆ దిశగా అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదని పలువురు విమర్శిస్తున్నారు.