Ys Jaganmohan Reddy: రాబోయేది కురుక్షేత్ర యుద్ధమని, పేదవాడికి, పెత్తందార్లకు మధ్య పోరు అని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. వైసీపీ ప్రతినిధులతో సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు తొలి సేవకుడిగా బాధ్యతగా వ్యవహరించినట్లు చెప్పారు. 52 నెలల కాలంలో సువర్ణాక్షరాలతో లిఖించేలా పాలన అందించినట్లు పేర్కొన్నారు. పేదవాళ్లు మొత్తం ఏకమైతేనే పెత్తందార్లను ఎదుర్కోగలమని అన్నారు. 



ఆధారాలుంటే అరెస్ట్ చెయ్యొద్దట



టీడీపీ అధినేత చంద్రబాబు అవినీతి గురించి తెలుసు కాబట్టే ఈడీ, సీబీఐ నోటీసులు వచ్చినట్లు సీఎం జగన్ తెలిపారు. చంద్రబాబుపై కక్షపూరితంగా చేసి ఉంటే కేంద్రంలో బీజేపీ ఉందని, అందులో సగం మంది టీడీపీ వారే ఉన్నారని అన్నారు. స్పష్టమైన ఆధారాలున్నా చంద్రబాబును అరెస్ట్ చెయ్యొద్దట అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబును సమర్థించడమంటే పేదలను వ్యతిరేకించడమేనని, పెత్తందారి వ్యవస్థను సమర్థించడమేనని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.



ఎన్ని సున్నాలు కలిసినా రిజల్ట్ సున్నా


2, 4 ఇలా ఎన్ని సున్నాలు కలిపినా ఫలితం సున్నానే అంటూ టీడీపీ, జనసేన పొత్తులపై సీఎం జగన్ ఎద్దేవా చేశారు. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన వారికి లేదని, దోచుకో, పంచుకో, తినుకో అనేది వారి లక్ష్యమని అన్నారు. మనం చేసిన మంచే మన ధైర్యమని అందుకే 'వై నాట్ 175' అని ప్రజల్లోకి వెళ్తున్నట్లు స్పష్టం చేశారు.



ఫిబ్రవరిలో మేనిఫెస్టో


ఫిబ్రవరిలో వైసీపీ మేనిఫెస్టోతో ప్రజల వద్దకు వెళ్దామని, మార్చిలో ఎన్నికలకు సన్నద్ధమవుదామని సీఎం జగన్ పార్టీ శ్రేణులకు సూచించారు. గ్రామ స్థాయి నుంచే ప్రజలతో మమేకమవ్వాలని నిర్ధేశించారు. నేతలు, కార్యకర్తలు కలిసికట్టుగా అడుగులు వేయాలన్నారు. సంక్షేమ పథకాలను ఇంటింటికీ అందించిన ప్రభుత్వం మనదని అన్నారు. ఎక్కడా లంచాలు, వివక్షకు తావు లేదని, ప్రతీ కార్యక్రమం ఓ విప్లవమని, ధైర్యంగా ప్రతి ఇంటికీ వెళ్లి అడగడం ఓ చరిత్రని పేర్కొన్నారు.