ప్రపంచకప్‌లో హై ఓల్టేజ్‌ మ్యాచ్‌ అక్టోబర్‌ 14న జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులు ఊపిరి బిగపట్టి మరీ చూసే భారత్‌-పాక్‌ మ్యాచ్‌ ఆ రోజున జరగనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ మైదానమైన గుజరాత్‌ అహ్మాదాబాద్‌లోని నరేంద్రమోదీ క్రికెట్‌ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌ జరిగే నరేంద్ర మోదీ స్టేడియంపై బాంబు దాడి, రసాయన దాడులు చేస్తామన్న బెదిరింపులతో పోలీసులు కనివినీ ఎరుగని భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. చీమ చిటుక్కుమన్నా తెలిసేలా... అహ్మదాబాద్‌పై డేగ కన్ను వేస్తున్నారు. వేలమంది భద్రతా సిబ్బందితో ఇప్పటికే అహ్మదాబాద్‌ను జల్లెడ పడుతున్నారు. బాంబు దాడులు, రసాయన దాడులు చేస్తామంటూ వచ్చిన హెచ్చరికల నేపథ్యంలో భారీగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు అహ్మదాబాద్‌ పోలీసులు తెలిపారు. 



 భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌కు NSG బ్లాక్‌ క్యాట్‌ కమెండోలను మోహరిస్తున్నట్లు అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ జిఎస్ మాలిక్ తెలిపారు. NSGతో పాటు 7 వేలమంది పోలీసులను మోహరిస్తున్నట్లు వెల్లడించారు. అక్టోబర్ 14న జరిగే భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌పై ప్రపంచవ్యాప్తంగా దృష్టి ఉంటుందని.. అందుకే దానికి తగ్గట్లు ఏర్పాట్లు చేశామని మాలిక్ వివరించారు. బెదిరింపుల నేపథ్యంలో అత్యున్నత స్థాయి భద్రతా ఏర్పాట్లు చేశామని తెలిపారు. మ్యాచ్‌ నేపథ్యంలో నరేంద్రమోదీ స్టేడియం వద్ద ఎలైట్ టెర్రర్ నిరోధక దళం (NSG), ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF), హోంగార్డులు, గుజరాత్ పోలీసులతో సహా దాదాపు 11 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించినట్లు వివరించారు. మ్యాచ్ సందర్భంగా అహ్మదాబాద్‌లో మతపరమైన సున్నితమైన ప్రాంతాల్లో  శాంతిభద్రతలను పర్యవేక్షించేందుకు 4 వేలమంది హోంగార్డులను మోహరించినట్లు పోలీస్‌ కమిషనర్‌ వెల్లడించారు. 20 ఏళ్లలో అహ్మదాబాద్‌లో క్రికెట్ మ్యాచ్‌ల సందర్భంగా మతపరమైన హింస ఎప్పుడూ జరగలేదని అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ జిఎస్ మాలిక్ గుర్తు చేశారు.



భారత్‌-పాక్‌ మ్యాచ్‌ చూసేందుకు లక్ష మందికిపైగా ప్రేక్షకులు వస్తారని అంచనా వేస్తున్నామని.. దానికి తగ్గట్లు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఈ మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు చేశారని... దానికి తగ్గట్లు భద్రతను కట్టుదిట్టం చేశారు. మ్యాచ్‌ నేపథ్యంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ గాంధీనగర్‌లో హోంశాఖ సహాయ మంత్రి హర్ష్ సంఘవి, డీజీపీ వికాస్ సహాయ్ సహా ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. 
 నరేంద్రమోదీ స్టేడియం వద్ద బాంబు నిర్వీర్య బృందాలను మోహరించామని మాలిక్‌ తెలిపారు. ముఖ్యమంత్రి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారని, మ్యాచ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారని వెల్లడించారు. మూడు హిట్ టీమ్‌లు, ఒక యాంటీ డ్రోన్ బృందాన్ని మోహరిస్తామని వెల్లడించారు. బాంబు డిటెక్షన్, డిస్పోజల్ స్క్వాడ్‌లోని తొమ్మిది బృందాలు ఉంటాయని వివరించారు. నలుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులు, 21 మంది డీసీపీలు మ్యాచ్ రోజు పరిస్థితిని పర్యవేక్షిస్తారని వెల్లడించారు. 
 రిజర్వ్ పోలీసులకు చెందిన 13 కంపెనీలతో పాటు, మూడు కంపెనీల ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌లను అహ్మదాబాద్‌లోని సున్నితమైన ప్రాంతాల్లో మోహరిస్తామని వివరించారు. ఒకవేళ తొక్కిసలాట జరిగితే ఎలా ఎదుర్కోవాలనే దానిపై ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేశామని... స్టేడియంలో రిహార్సల్స్ కూడా జరుగుతున్నాయని వివరించారు.



గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంపై బాంబు దాడి చేస్తామని ముంబై పోలీసులకు ఈ మెయిల్‌ రావడంతో అహ్మదాబాద్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. 500 కోట్ల రూపాయలు డబ్బు ఇచ్చి, గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ను జైలు నుంచి విడుదల చేయకపోతే నరేంద్ర మోదీ, స్టేడియంపై దాడి చేస్తామని ముంబై పోలీసులకు మెయిల్‌ వచ్చింది. ఈ బెదిరింపు మెయిల్‌ రావడంతో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కోసం అదనపు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.