Mumbai Indians Women vs UP Warriorz, Eliminator: మహిళల ప్రీమియర్ లీగ్ 2023 ఎలిమినేటర్ మ్యాచ్‌లో యూపీ వారియర్జ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ భారీ స్కోరు సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఆల్ రౌండర్ నాట్ స్కివర్ బ్రంట్ (72 నాటౌట్: 38 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, రెండు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. మహిళల ప్రీమియర్ లీగ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన ఢిల్లీ నేరుగా ఫైనల్స్‌కు చేరుకుంది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన యూపీ మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముంబై బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్ యాస్తిక భాటియా (21: 18 బంతుల్లో, నాలుగు ఫోర్లు) యూపీ బౌలర్లపై మొదటి బంతి నుంచి విరుచుకుపడింది. కానీ నాలుగో ఓవర్లో అంజలి శర్వాణి యాస్తికను అవుట్ చేసి యూపీకి మొదటి వికెట్ అందించింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన నాట్ స్కివర్ బ్రంట్ (72 నాటౌట్: 38 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, రెండు సిక్సర్లు) వేగంగా ఆడింది.
కాసేపటికి మరో ఓపెనర్ హేలీ మాథ్యూస్ (26: 26 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) అవుట్ అయింది. తన స్థానంలో వచ్చిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (14: 15 బంతుల్లో, ఒక ఫోర్) కూడా కీలక మ్యాచ్‌లో ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేదు. కానీ మరో ఎండ్‌లో నాట్ స్కివర్ బ్రంట్ మాత్రం ఊచ కోత ఆపలేదు. హర్మన్ ప్రీత్ కౌర్ తర్వాత వచ్చిన మెలీ కెర్ (29: 19 బంతుల్లో, ఐదు ఫోర్లు) బ్రంట్‌కు చక్కని సహకారం అందించింది. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు ఐదు ఓవర్లలోనే 60 పరుగులు జోడించారు. ఆఖర్లో మెలీ కెర్ అవుటైనా పూజా వస్త్రాకర్ (11 నాటౌట్: 4 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) విలువైన పరుగులు చేసింది. దీంతో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. యూపీ బౌలర్లలో సోఫీ ఎకిల్‌స్టోన్ రెండు వికెట్లు పడగొట్టింది. పార్శవి చోప్రా, అంజలి శర్వాణిలకు చెరో వికెట్ దక్కాయి.
ముంబై ఇండియన్స్ మహిళలు తుది జట్టు
హేలీ మాథ్యూస్, యాస్తికా భాటియా(వికెట్ కీపర్), నాట్ స్కివర్ బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), మెలీ కెర్, పూజా వస్త్రాకర్, ఇస్సీ వాంగ్, అమంజోత్ కౌర్, హుమైరా కాజీ, జింటిమణి కలితా, సైకా ఇషాక్
యూపీ వారియర్స్ తుది జట్టు
అలిస్సా హీలీ(కెప్టెన్, వికెట్ కీపర్), శ్వేతా సెహ్రావత్, సిమ్రాన్ షేక్, తహ్లియా మెక్‌గ్రాత్, గ్రేస్ హారిస్, కిరణ్ నవ్‌గిరే, దీప్తి శర్మ, సోఫీ ఎక్లెస్టోన్, అంజలి సర్వాణి, పార్షవి చోప్రా, రాజేశ్వరి గయాక్వాడ్