YSRCP Reverse : వైఎస్ఆర్‌సీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేల్ని సస్పెండ్ చేశారు. క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారని గుర్తించడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వైఎస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. అసలు తమకు తిరుగే లేదనుకుంటున్న వైఎస్ఆర్‌సీపీకి చివరికి ఓ ఎమ్మెల్సీ స్థానంలో ఓడిపోయి తమ ఎమ్మెల్యేల్ని సస్పెండ్ చేసుకోవాల్సి రావడం అనూహ్యమే. 2019 నుంచి మొన్నటి వరకూ రాష్ట్రంలో ఫ్యాన్ గాలి బలంగా వీచింది. ఇప్పుడు స్లో అయి... ఫ్యాన్ రివర్స్ తిరగడం స్టార్ట్ అయింది. మొన్న గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీలు, నిన్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలతో కథ అడ్డం తిరిగినట్లయింది.
సైలెంట్‌గా రాజకీయం చేసిన చంద్రబాబు !
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా పంచుమర్తి అనురాథ గెలవడం వైసీపీకి షాక్ లాంటిదే. మొత్తంగాఏడు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. టీడీపీ అసుల పోటీ పెడుతుందని కూడా ఎవరూ అనుకోలేదు. సీఎం జగన్ తమ పార్టీ తరపున ఏడుగురు అభ్యర్థుల్ని ప్రకటించారు. బీఫామ్స్ ఇచ్చారు. అప్పుడు కూడా టీడీపీలో కదలిక లేదు. కానీ నామినేషన్లు ప్రారంభమయిన తర్వాత విజయవాడ మాజీ మేయర్, బీసీ నేత పంచుమర్తి అనూరాధను బరిలో నిలబెట్టాలని నిర్ణయించారు. అప్పటికీ చాలా మందికి నమ్మకం లేదు గెలుస్తారని. మామూలుగా అధికారికంగా ఉన్న లెక్కల ప్రకారం అయితే ఏడింటింలో ఒకటి టీడీపీకి రావాలి. కానీ నలుగురు ఎమ్మెల్యేలు ఫిరాయించడంతో ఆ చాన్స్ లేదు. కానీ వైసీపీలో మారిన పరిస్థితుల్ని చంద్రబాబు అనుకూలంగా మార్చుకున్నారు. ఇప్పటి వరకూ బహిరంగ అసంతృప్తి వ్యక్తం చేసిన వారు ధిక్కరించి ఓటేస్తారని అనుకున్నారు కానీ.. ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి వంటి వారు ధిక్కరిస్తారని అనుకోలేదు. చివరికి నష్టం జరిగిపోయింది.
టీడీపీ ఒక్కటే గెల్చిందంటున్న వైసీపీ నేతలు !
23 23 అంటూ అవమానకరంగా మాట్లాడారు. కానీ ఇప్పుడు ఆ 23 తోనే దెబ్బకొట్టాం అంటూ టీడీపీ సంబరాలు చేసుకుంది. అయితే వైసీపీ వాదన మాత్రం విచిత్రంగా ఉంది. పట్టభద్రులు, ఉపాధ్యాయులు, స్థానిక సంస్థల్లో మేం 100శాతం సాధించామని.. ఎమ్మెల్యే కోటాలో తాము 6 గెలిస్తే .. వాళ్లు గెలిచింది. మూడే అని కొంతమంది నాయకులు అంటున్నారు. టీవీ డిబేట్లలో మేం ఆరు గెలిస్తే వాళ్లు గెలిచింది ఒకటి అంటున్నారు. ఇలా మాట్లాడింది. మంత్రులు, ఎంపీలు. ఈ వాదన చూస్తే.. మామూలు జనాలకు కూడా మైండ్ పోతోంది. అంటే వాళ్ల ఎమ్మెల్యేల ఓట్లు కూడా వాళ్లు వేసుకోరా అనిపిస్తుంది. 150 మంది లో నలుగురే పోయారు.. మిగతా వాళ్లంతా మా వైపే అని చెబుతున్నారు. నిజానికి ఇది పూర్తిగా చేతులెత్తేసే వాదన. టీడీపీ నేతలు మాత్రం తమ అభ్యర్థి ఎక్కడ ఓడిపోయారో చెప్పాలంటున్నారు. స్థానిక సంస్థలు, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ పోటీ చేయలేదు. మూడు గ్రాడ్యూయేట్ స్థానాల్లో పోటీ చేసి విజయం సాధించారు. ఒక ఎమ్మెల్యే కోటా స్థానానికి అభ్యర్థిని పెట్టి విజయం సాధించారు. అంటే.. నలుగుర్ని నిలబెట్టి నలుగుర్నీ గెలిపించుకున్నారు.
ప్రభావం క్యాడర్‌పై పడకుండా సజ్జల జాగ్రత్తలు
పార్టీ వ్యవహారాలను అన్నీ తానై చూసుకునే సజ్జల రామకృష్ణారెడ్డి డ్యామేజ్ కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేశారు కానీ.. కానీ పూర్తిగా కుదర్లేదు. ఈ ఎన్నికలను అంత సీరియస్‌గా తీసుకోబోమని సజ్జల చెప్పారు. కానీ రాజకీయాల్లో పండిపోయిన ఆయనకు నిజం ఏమిటో తెలుసు. క్యాడర్ మనోస్థైర్యం దెబ్బతినకుండా ఆయన అలా మాట్లాడి ఉండవచ్చు. టీడీపీ శ్రమ అయినా.. ప్రభుత్వ వ్యతిరేకత అయినా.. టీడీపీకి కచ్చితంగా జాక్ పాట్ అనుకోవచ్చు. వైసీపీ నేతలు రాజధాని అని చెబుతున్న చోట.. 14శాతానికి పైగా, వైసీపీకి ప్రాబల్యం తూర్పు రాయలసీమ లో 11శాతం ... పూర్తిగా వైసీపీ మయం అయిన పశ్చిమ రాయలసీమ హోరాహోరీలో గెలవడం ... ఇవన్నీ మామూలు బూస్టింగ్ కాదు. పైగా పశ్చిమ రాయలసీమ స్థానానికి జగన్ మోహనరెడ్డి సొంత ఊరు పులివెందుల నుంచి కాండిడేట్ ను పెట్టి మరీ గెలివడం సామాన్య విషయం కాదు.
పట్టభద్రులది న్యూట్రల్ ఓటింగ్ !
రాజకీయాల్లో ఫలితాన్ని డిసైడ్ చేసేది న్యూట్రల్ ఓటింగ్ . జనరల్ గా చదువుకున్న వాళ్లే న్యూట్రల్స్ ఉంటారు. లేదా యువత. 108 నియోజకవర్గాల్లో ఆరున్నరలక్షలకు పైగా చెల్లిన ఓట్లు ఉన్నాయి. రెండు పార్టీల మధ్య 8 శాతం ఓట్ల తేడా వచ్చింది. దీనిని ఓ సంకేతంలా తీసుకోకుండా ఉపాధ్యాయులు… తమ ఓటర్లు మాత్రమే తమకు వేసిన స్థానిక ఓట్లను కోటాను కలుపుకుని గెలిచేశాం అనుకుంటే రాజకీయగా తమను తాము మోసం చేసుకున్నట్లే. ఏడో స్థానం మాది కాదు.. అని ఇప్పుడు చెప్పే వైకాపా ఆ స్థానానికి పోటీ ఎందుకు పెట్టింది. టీడీపీ బలహీనంగా ఉంది.కాబట్టి ఆ సీట్ గెలిచేసుకోచ్చనుకుంది. టీడీపీ ఇంకా బలహీనంగా ఉందని ప్రూవ్ చేయాలనుకుంది. ఇక్కడ అర్థం కావలసింది.. బలహీనంగా ఉన్నోడిని కొట్టడం గొప్ప కాదు. కానీ బలహీనంగా ఉన్నాడు అనుకున్నవాడు తిరిగి కొడితే.. వాడు అసలైన బలవంతుడి కన్నా పెద్దగా కనిపిస్తాడు. ఇంత చిన్న లాజిక్ వైకాపా వ్యూహకర్తలు మర్చిపోయారు.
చంద్రబాబుకు పాత ఇమేజ్ తెచ్చి పెట్టిన వైసీపీ వ్యూహకర్తలు !
పైగా చంద్రబాబు చాణక్యుడు.. ఏదైనా చేయగలడు.. అని ఇప్పటికే ఉన్న ఓ అభిప్రాయానికి పాదుచేసి నీళ్లు పోశారు. చంద్రబాబు వ్యూహం , చాణిక్యం ఇందులో ఎంతుందో తెలీదు.. వీళ్లు ముసలివాడు అంటూ వెక్కిరిస్తున్న ఆయనను ఇప్పుడు మళ్లీ బలోపేతం చేసినట్లయింది. పంచుమర్తి అనురాధ బలిపశువు చేస్తున్నారని ప్రచారం చేశారు. చివరికి అది బీసీని ఇలాంటి టాస్క్ లో పెట్టి గెలిపించాడు అని చెప్పుకునే అవకాశాన్ని జగన్ ఇచ్చారన్న అభిప్రాయంగా మారింది. అదే సమయంలో వైసీపీ ఏడో స్థానం కోసం ఇద్దరు బీసీలను పెట్టడం అందులో ఒకరు ఓడిపోవడం.. వైసీపీ ఎప్పుడూ చెప్పేలా..భగవంతుడి స్క్రిప్ట్ అన్నట్లు అయింది. అనూరాధ విజయవాడ వాసి కావడం… అమరావతి ఉద్యమానికి స్ట్రాంగ్ బేస్ పాయింట్ నుంచి ఇలాంటి సిచ్యువేషన్ లో గెలవడం టీడీపీకి ప్లస్ పాయింట్. బీసీలను జగన్ తన వైపు తిప్పుకున్నారని వైసీపీ ప్రచారం చేసుకుంటున్న వేళ .. టీడీపీ తన ట్రేడ్ మార్క్ బీసీతో హిట్ కొట్టడం .. ఇవన్నీ మామూలు కంటే కూడా ఎక్కువ బలాన్నిచ్చిన విషయాలు.
జగన్ పట్టు కోల్పోయారనే సంకేతాలు !
ఎలక్షన్ ముందు ఇది కచ్చితంగా ప్రతిపక్షానికి తిరుగులేని బలాన్నిస్తుంది. జగన్ అంటే తిరుగులేదు .. మాటంటే శాసనం అనుకునే స్థాయి నుంచి క్యాంపులు పెట్టి, నిఘా పెట్టి మరీ రాజకీయం నడిపినా నలుగురు నుకాపాడుకోలేకపోయాడు అనే మాట పడటం మారిన రాజకీయానికి సంకేతం. అదే సమయంలో చంద్రబాబు తన క్యాంప్ నుంచి నలుగురుని లాగేస్తే.. నీ దగ్గర నుంచి నలుగురును తెస్తా అన్నఇమేజ్ పెంచుకోవడం వైసీపీకి ఇబ్బందికరమే. అన్నింటికంటే క్లియర్ గా చూడాల్సింది ఏంటంటే.. కేవలం 23మంది గెలిచి.. అందులో నలుగురు వెళ్లిపోయి. గంటా లాంటి వాళ్లు ఓ కాలు బయటపెట్టి.. బైబై చెబుతూ.. ఇంకొంతమంది లోపాయకారీగా వైఎస్సార్సీపీతో టచ్ లో ఉంటూ వెళ్లడానికి సిద్ధమవుతున్న దశలో.. స్థానిక ఎన్నికల్లో 90శాతం స్థానాల్లో వైసీపీ గెలిచి.. గ్రామస్థాయిలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న దశలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు .. తెలుగుదేశానికి ఎక్కడలేని బలాన్ని తెచ్చింది.
టీడీపీకి ప్రత్యేక బలం !
ఇప్పుడు గంటా లాంటి వాళ్లు లోపలకు వచ్చారు. ఆయనే అనురాధ అభ్యర్థిత్వాన్ని బలపరిచింది. అటో ఇటో అన్నట్లున్న సీనియర్లు.. ఈ ఎన్నికల్లో యాక్టివ్ అయిపోయారు. పాత వాళ్లంతా మళ్లీ పనిచేయడం స్టార్ట్ చేశారు. అదే సమయంలో ఇంతమంది ఎమ్మెల్యేలు ఉండీ.. తమకు వ్యతిరేకంగా ఉంది ఎవరో తెలియని అయోమయంలో వైసీపీ పడిపోయింది. ఆనం, కోటంరెడ్డి బహిరంగంగా వైసీపీకి వ్యతిరేకం కాబట్టి వాళ్లిద్దరితో పాటు… మరో ఇద్దరు అని వైసీపీ ప్రచారం చేస్తోంది. ఇద్దరి పేర్లను లీక్ కూడా చేసింది. అయితే నిజంగా వాళ్లేనా. ఇప్పుడు బయటకొచ్చిన రెండు పేర్లకు సంబంధించిన వాళ్లకి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే అవకాశం సున్నా. కాబట్టి వాళ్ల పేర్లు చెబితే నష్టం లేదు అని వాళ్ల పేర్లను బయటకు చెప్పి.. లోపల ఉన్న ఉడుకును కప్పెట్టే ప్రయత్నం చేస్తున్నారా.. అలా చేసుకుంటే.. ఉక్కపోత మరింత పెరిగినట్లే. ఈ దెబ్బ తర్వాత .. వైనాట్ 175 అనడానికి కాస్తంతా ఆలోచించాలి ఏమో..?