కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ ఎంపీగా అనర్హుడని ప్రకటించడంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. అన్నిపార్టీలు ఏకోన్ముఖంగా ఖండించాయి. ప్రజాస్వామం హననమైందని అభివర్ణించారంతా. అనర్హతవేటుపై రాహుల్ గాంధీ ట్విటర్లో స్పందించారు. దేశ ప్రజల కోసం ఎంతవరకైనా పోరాడుతానని ట్వీట్ చేశారు. ప్రజల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నానని రాహుల్ ప్రకటించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్
భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో నేడు చీకటిరోజు అన్నారు సీఎం కేసీఆర్. ఈ దుశ్చర్య నరేంద్రమోదీ దురంహంకారానికి, నియంతృత్వానికి పరాకాష్ట అన్నారు. పార్లమెంటును సైతం హేయమైన చర్యలకోసం వినియోగించుకోవడం బాధాకరమన్నారు. బీజేపి దుశ్చర్యను ప్రజాస్వామ్య వాదులందరూ ముక్తకంఠంతో ఖండించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
మోదీ ఏలుబడిలో ప్రతిపక్ష నేతలు టార్గెట్ అయ్యారని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. నేరచరిత్ర కలిగిన బీజేపీ నేతల మంత్రివర్గంలోకి రావొచ్చు కానీ, ప్రతిపక్షనేతలు మాత్రం అదేంటని ప్రశ్నించవద్దని మమత ట్వీట్ చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం మరింత పతనమైందని ట్విటర్లో రాసుకొచ్చారు.
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
రాహుల్ గాంధీని లోక్ సభ నుంచి బహిష్కరించడం సరికాదన్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఈ చర్య విస్మయం కలిగించిందన్నారు. దేశం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోందని, బీజేపీ అహంకార పాలనకు వ్యతిరేకంగా దేశ ప్రజలంతా ఏకంకావాలని పిలుపునిచ్చారు సీఎం కేజ్రీవాల్
జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ముఫ్తీ
2024 ఎన్నికలకు భయపడే మోదీ అణచివేత విధానాలు అవలంభిస్తున్నారని జమ్మూకశ్మీర్ మాజీ సీఎం మొహబూబా ముఫ్తీ విమర్శించారు. రాహుల్ గాంధీతో రాజకీయంగా పోరాడలేకనే అనర్హతవేటు వేశారని మొహబూబా ముఫ్తీ అన్నారు.
సీతారాం ఏచూరి
రాహుల్ లోక్ సభ సభ్యత్వ రద్దును CPM ఖండించింది. ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేసేందుకు బీజేపీ ఎంచుకున్న తీరు దుర్మార్గమైంద సీతారాం ఏచూరి విమర్శించారు. విపక్ష నేతలపై సీబీఐ, ఈడీ దాడులే కాకుండా ప్రజాస్వామ్య వ్యవస్థలను వాడుకోవడం సరికాదని ఏచూరి సూచించారు. మోదీ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.
రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్
రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడాన్ని మోదీ నియంతృత్వానికి మరో ఉదాహరణ అన్నారు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్. ప్రధాని నియంతృత్వపాలనకు వ్యతిరేకంగా ప్రజలు బలమైన పోరాటం చేస్తున్నారని అందుకే రాహుల్ గాంధీని అణచివేసే కుట్ర చేశారని సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు.
రాష్ట్రీయ జనతా దళ్
రాహుల్ పై అనర్హతవేటును తప్పుపట్టింది రాష్ట్రీయ జనతా దళ్. మోదీ నియంతృత్వం తారాస్థాయికి చేరిందనడానికి ఇదే నిదర్శనమని RJD విమర్శించింది.
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్
రాహుల్ పై అనర్హతవేటును జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ ఖండించారు. అమృత్ కాలంలో ప్రతిపక్ష నేతలను బీజేపీ సర్కార్ టార్గెట్ చేసిందని హేమంత్ సోరేన్ ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ, ఆ పార్టీ నేతలకు మాత్రమే ఇది అమృత్ కాల్, దేశంలోని పౌరులకు, ప్రతిపక్షాలకు ఇది ఆపత్కాల్ అని అభివర్ణించారు సీఎం హేమంత్ సోరేన్.
DMK MP కనిమొళి
రాహుల్ గాంధీపై అనర్హతవేటు బీజేపీ కక్షపూరిత చర్యగా అభిప్రాయపడ్డారు DMK MP కనిమొళి. ప్రతిపక్షాల గొంతులను మోదీ సర్కార్ నొక్కాలని చూస్తోందని, తమని ఎంత బలహీన పరచాలని చూస్తే.. అంత బలపడుతామని కనిమొళి అన్నారు.
ఉద్ధవ్ ఠాక్రే
రాహుల్ గాంధీ ఎంపీగా అనర్హుడని ప్రకటించడాన్ని మహారాష్ట్ర అసెంబ్లీ ఖండించింది. మహా వికాస్ అఘాడీ ఎమ్మెల్యేలంతా సభ నుంచి వాకౌట్ చేశారు. దేశంలో మాట్లాడే స్వేచ్ఛా లేకుండా పోయిందని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. దొంగను దొంగ అని పిలవడం కూడా నేరంగా మారిందన్నారు. రాహుల్ పై అనర్హతవేటు వేయడం ప్రజాస్వామ్యాన్ని ప్రత్యక్ష హత్య చేయడమే అన్నారు ఉద్ధవ్ ఠాక్రే.
మల్లికార్జున ఖర్గే, జైరాం రమేశ్, ప్రియాంక
బీజేపీ నియంతృత్వ చర్యలను, కుట్రలను తిప్పి కొడతామన్నారు కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గే. నిజాలు మాట్లాడితే ఎన్డీయే సర్కార్ ఓర్చుకోవడం లేదన్నారు. ఈ చర్యపై మౌనంగా ఉండబోము.. న్యాయపోరాటం చేస్తాం..రాజకీయంగా ఎదుర్కొంటామని జైరాం రమేశ్ అన్నారు. అవినీతిని బీజేపీ సమర్ధిస్తున్నదని ఒప్పుకున్నట్టేనా అని ప్రియాంకాగాంధీ ప్రశ్నించారు.
అఖిలేశ్ యాదవ్
రాహుల్ లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయడం ద్వారా పాలిటిక్స్ ముగిసినట్టు కాదన్నారు యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్. రాజకీయాలంటే పార్లమెంటులో గెలువడం కాదు..ప్రజల కోసం పోరాడి గెలువాలి అన్నారు. ఆర్ధిక నేరస్తులపై ఇలాంటి బహిష్కరణలు చేపట్టాలని అఖిలేశ్ సూచించారు
తెలంగాణ మంత్రులు
రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం మీద అనర్హత వేటుపై తెలంగాణ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, నిరంజన్ రెడ్డి, జగదీశ్ రెడ్డి స్పందించారు. బీజేపీ ఆకృత్యాలకు ఇది పరాకాష్ట అన్నారు. కనీసం ప్రశ్నించే తత్వాన్ని సహించలేని స్థితిలో బీజేపీని పతనం మొదలైందని అన్నారు.