TSPSC Exams :  టీఎస్‌పీఎస్సీ పరీక్షలు మళ్లీ ఎప్పుడు ? నిరుద్యోగుల్ని ఇదే వెంటాడుతోంది. ప్రిపరేషన్స్ కొనసాగించాలని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ ఎప్పుడు పరీక్షలు పెడతారో స్పష్టం చేయలేకపోతున్నారు.  రద్దు చేసిన నాలుగు ఎంపిక పరీక్షలతోపాటు మిగిలిన మరో మూడు నియామకాలకు సంబంధించిన పరీక్షలను ఇప్పట్లో నిర్వహించడం కష్టసాధ్యమని తెలుస్తోంది. ప్రస్తుత పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పాలక మండలి వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 33 వేల ఉద్యోగాల భర్తీకి ఇప్పటి వరకు 26 నోటిఫికేషన్లు జారీ చేయగా ఇందులో 7 పరీక్షలు నిర్వహించింది.  లీకేజీ వ్యవహారంపై దర్యాప్తు జరుపుతున్న సిట్‌ ఈ పరీక్షా ప్రశ్నాపత్రాలు లీకయ్యాయా..? లేదా..? అన్న అంశంపై నివేదిక ఇస్తే వీటి భవితవ్యం కూడా తేలనుంది. 


పరీక్షల సీజన్ అయిపోయిన తర్వాతే పరీక్షలు
   
 రద్దైన గ్రూప్‌-1 ప్రాథమిక పరీక్షతోపాటు మిగతా పరీక్షలను నిర్వహించాలంటే కనీసం మూడు నెలల వ్యవధి పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.  ఒకవైపు ఇంటర్మీడియట్‌, పదో తరగతి పరీక్షలు జరుగుతుండడం, వచ్చే రెండు మూడు నెలల్లో ఎంసెట్‌, ఈసెట్‌, ఐసెట్‌, పీజీసెట్‌తోపాటు జాతీయస్థాయిలో నిర్వహించే ఐఐటీ, జేఈఈ, నీట్‌ వంటి పరీక్షలు జరుగుతుండడంతో మిగతా పోటీ పరీక్షలు, నియామక పరీక్షలకు పరీక్షా కేంద్రాలు అందుబాటులో ఉండే అవకాశాలు కూడా లేవని చెబుతున్నారు. మే నుంచి ఆగస్టు వరకు జాతీయస్థాయి పరీక్షల నిర్వహణకు ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ కాగా, విద్యార్థులు ఆ పరీక్షలకు హాజరయ్యేందుకు దరఖాస్తు చేసుకునే పనిలో పడ్డారు.   వివిధ పరీక్షలకు సంబంధించి ఇప్పటికే పరీక్షా కేంద్రాలు నిర్ణయించడంతో రద్దు అయిన పరీక్షలతోపాటు వాయిదా పడిన మిగతా మూడు ఎంపిక పరీక్షలను నిర్వహించడానికి మూడు నెలల సమయం  పట్టే అవకాశం ఉంది. 


నోటిఫికేషన్ల జారీకి మళ్లీ అనుమతులు ఇవ్వాలి ! 


 నోటిఫికేషన్ల జారీకి ప్రభుత్వం అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవైపు ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో దూకుడుగా వెళుతున్న సిట్‌ ప్రభుత్వానికి దర్యాప్తు నివేదికను అందజేయడానికి మరో నెల సమయం పడుతుందని చెబుతున్నారు. లీకేజీలో నిందితులను విచారించేందుకు కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకున్న వారిని సోమవారం న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టాల్సి ఉంది. ఈ కేసు విచారణకు సంబంధించిన పూర్తి నివేదికను తమకు అందజేయాలని రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని కోరింది. వరుస ప్రవేశ పరీక్షలు, సిట్‌ విచారణ, ప్రశ్నాపత్రాల కూర్పు, పరీక్షా కేంద్రాల కేటాయింపు సంబంధిత కారణాల నేపథ్యంలో రద్దు అయిన నాలుగు పరీక్షలను, ఇప్పటికే నోటిఫికేషన్లు ఇచ్చిన మరో మూడు పరీక్షల నిర్వహణ జూన్‌, జులై మాసాల్లోనే జరిగే అవకాశం ఉందని, అప్పటికీ రాష్ట్రంలో ప్రవేశ పరీక్షలన్నీ పూర్తయి ఫలితాలు కూడా విడుదలవుతాయని చెబుతున్నారు.
 
ఇంటి దొంగల పని పట్టే ప్రయత్నాలు


పేపర్ లీకేజీ అంశం బయటికి వచ్చాక అడిషనల్ సెక్రటరీ స్థాయి అధికారికి కాన్ఫిడెన్షియల్ విభాగం అప్పగించారు. ఇంతవరకు ఒక్క అధికారికి కూడా మెమో జారీ చేయలేదు. శాఖాపరమైన చర్యలకు వెనకాడటంపై పలు అనుమానాలు తావిస్తోంది. TSPSCలో మొత్తం 165 మంది ఉద్యోగులు ఉండగా, అందులో రెగ్యులర్ 83, అవుట్ సోర్సింగ్ 82 ఉన్నారు. సొంత కమిషన్ సభ్యులు 26 మంది పరీక్ష రాస్తే కనీస సెలవుల నిబంధనలను అధికారులు గాలికొదిలేశారు. TSPSC మొత్తాన్ని రద్దు చేయాలని రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.