దేశంలో క్రీడలను ప్రోత్సహించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఆ దిశగా అడుగులు వేసింది ABP NEWS. తాజాగా ఈ వార్తా సంస్థ ప్రొ కబడ్డీ లీగ్‌లో యూపీ యోధాకి టీమ్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోన్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ABP NEWS CEO అవినాశ్ పాండే... యూపీ యోధా సీఈవో కపిల్ బిస్త్‌తో కలిసి ఆ జట్టు కొత్త జెర్సీని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా అవినాశ్ పాండే మాట్లాడుతూ... ‘కబడ్డీని స్పాన్సర్ చేయడం గర్వంగా ఉంది. ABP ట్యాగ్ లైన్ Aap Ko Rakhey Aagey. ప్రొ కబడ్డీ లీగ్‌లో యూపీ యోధా జట్టుకు స్పానర్స్ చేయడం పట్ల సంతోషంగా ఉంది. మా జట్టు టైటిల్ గెలవాలని కోరుకుంటున్నా. దేశంలో చాలా మంది క్రికెట్ చూస్తారు. దీంతో స్పాన్సర్లు క్రికెట్‌నే ప్రోత్సహించేందుకు ఆసక్తి చూపుతారు. ప్రధాని మోదీ ఈ మధ్య దేశంలో క్రీడలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. అందులో చిన్న ప్రయత్నమే ఇది ’ అని అవినాశ్ పాండే అన్నారు.
2020లో PKL - 8వ సీజన్ జరగాల్సి ఉంది. కానీ, కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాది ఈ లీగ్‌ను నిర్వహించలేదు. ఈ ఏడాది లీగ్ కోసం ఫ్రాంఛైజీలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 29 నుంచి మూడు రోజుల పాటు ఆటగాళ్ల కోసం వేలం నిర్వహించారు. ఈ వేలం నేటితో ముగిసింది. సుమారు 500 మంది ఆటగాళ్లు ఈ ఏడాది వేలంలో పాల్గొన్నారు.
లీగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందన్న దానిపై ఇంకా క్లారిటీ లేదు. అంతా కుదురుకుంటే అక్టోబరు లేదా డిసెంబరులో లీగ్ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. గత సీజన్‌లాగే 8వ సీజన్లోనూ 12 జట్లు 13 వారాల పాటు సందడి చేయనున్నాయి. ఈ 12 జట్లను రెండు జోన్లగా విభజించి పోటీలు నిర్వహిస్తారు.