థామస్ కప్‌ను భారత్ సొంతం చేసుకుని చరిత్రను తిరగరాసింది. ఇండోనేషియాపై 3-0 తేడాతో గెలిచిన టీమిండియా థామస్ కప్‌ను కైవసం చేసుకుంది. మొదట సింగిల్స్‌లో, అనంతరం డబుల్స్‌లో విజయం సాధించడంతో ప్రతిష్టాత్మక థామస్ కప్‌ భారత్ సొంతం అయింది. ఈ కప్‌లో విజయం సాధించిన భారత ఆటగాళ్ల వివరాలు ఇవే...


1. లక్ష్యసేన్
20 సంవత్సరాల ఈ యువ ఆటగాడు ఫైనల్స్‌లో 8-21, 21-17, 21-16 తేడాతో గింటింగ్‌పై గెలుపొందాడు. 2016 నుంచి తను బ్యాడ్మింటన్ ఆడుతున్నాడు. అదే సంవత్సరం జూనియర్ ఏషియన్ చాంపియన్ షిప్‌లో కాంస్యం సొంతం చేసుకున్నాడు. వారి ఫ్యామిలీలో అందరూ బ్యాడ్మింట్మన్ ప్లేయర్లే. తండ్రి డీకే సేన్ బ్యాడ్మింటన్ కోచ్ కాగా... అన్నయ్య చిరాగ్ సేన్ కూడా అంతర్జాతీయ బ్యాడ్మింటన్ ఆడుతున్నాడు. ప్రస్తుతం అంతర్జాతీయ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో లక్ష్యసేన్ తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. ఇతను ఉత్తరాఖండ్‌కు చెందిన ఆటగాడు.


2. కిడాంబి శ్రీకాంత్
భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ 21-15, 23-21 తేడాతో ఇండోనేషియాకు చెందిన జోనాథన్ క్రిస్టీపై విజయం సాధించాడు. 29 సంవత్సరాల ఈ ఆటగాడు 2011 నుంచి బ్యాడ్మింటన్ ఆడుతున్నాడు. పుల్లెల గోపీచంద్ తనకు శిక్షణ అందిస్తున్నారు. 2018లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంకుకు కూడా చేరిన శ్రీకాంత్ ప్రస్తుతం 11వ ర్యాంక్‌లో ఉన్నాడు. కిడాంబి శ్రీకాంక్ తెలుగు ఆటగాడు. ఆంధ్రప్రదేశ్‌లోని రావులపాలెంలో 1993లో తను జన్మించాడు.


3. హెచ్ఎస్ ప్రణయ్
భారత బ్యాడ్మింటన్‌లోని సీనియర్ ఆటగాళ్లలో ప్రణయ్ కూడా ఒకడు. 29 సంవత్సరాల ఈ ప్లేయర్ ప్రస్తుతం గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. 2010లోనే తను మొదటి సారి వెలుగులోకి వచ్చాడు. అంతర్జాతీయ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో అత్యధికంగా ఎనిమిదో ర్యాంకుకు చేరుకున్నాడు. ప్రస్తుతం తను 23వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. హెచ్ఎస్ ప్రణయ్ తమిళనాడుకు చెందిన ఆటగాడు.


4. సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి
ఇండోనేషియాకు చెందిన అసాన్‌, సంజ‌య ద్వయంపై సాత్విక్, చిరాగ్ శెట్టి 18-21, 23-21, 21-19తో విజయం సాధించారు. 21 సంవత్సరాల సాత్విక్ 2018లో కామన్వెల్త్ స్వర్ణం సాధించడంతో వెలుగులోకి వచ్చాడు. తను కూడా గోపీచంద్ అకాడమీలోనే శిక్షణ పొందుతున్నాడు. ప్రస్తుతం పురుషుల డబుల్స్ ఏడో ర్యాంక్‌లోనూ, మిక్స్‌డ్ డబుల్స్‌లో 26వ స్థానంలోనూ ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురం తన స్వస్థలం.


2018లో కామన్వెల్త్ స్వర్ణం సాధించినప్పుడు సాత్విక్ భాగస్వామి చిరాగ్ శెట్టినే. 1997లో జన్మించిన చిరాగ్ కూడా ఆ స్వర్ణంతోనే వెలుగులోకి వచ్చాడు. ప్రస్తుతం పురుషుల డబుల్స్‌లో తను ఏడో ర్యాంక్‌లో ఉన్నాడు. తన స్వస్థలం ముంబై.


Also Read: చరిత్ర సృష్టించిన భారత్, 3-0తో థామస్ కప్ కైవసం - 14 సార్లు చాంపియన్‌ ఇండోనేషియాకు నిరాశే