India Wins Thomas Cup 2022: థామస్ కప్‌ను భారత్ తొలిసారి సొంతం చేసుకుంది. ఇండోనేషియాపై 3-0 తేడాతో భారత ఆటగాళ్లు థామస్ కప్ 2022ను కైవసం చేసుకున్నారు. మొదట తొలి సింగిల్స్‌లో, ఆపై డబుల్స్ లో విజయంతో ప్రతిష్టాత్మక థామస్ కప్ భారత్ వశమైంది. తొలుత సింగిల్స్‌లో భారత ఆటగాడు లక్ష్య సేన్ 8-21, 21-17, 21-16 తేడాతో గింటింగ్ పై గెలుపొందాడు. 14 సార్లు చాంపియన్ అయిన ఇండోనేషియాను ఫైనల్లో బోల్తా కొట్టించి భారత్ విజయదుందుబి మోగించింది.
భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ వరుస గేమ్‌లలో విజయం సాధించడంతో థామస్ కప్ 3 -0తో భారత్ సొంతమైంది. శ్రీకాంత్ 21 -15, 23-21 తేడాతో ఇండోనేషియాకు చెందిన జోనాథన్ క్రిస్టీపై రెండు వరుస గేమ్‌లు నెగ్గి మ్యాచ్ సొంతం చేసుకున్నాడు. థామస్ కప్ ఫైనల్‌లో భారత్‌కు చెందిన కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్, లక్ష్యసేన్ ఇండోనేషియా ఆటగాళ్లపై అద్భుతంగా రాణించారు. ఇరు దేశాల ఆటగాళ్ల మధ్య టైటిల్ కోసం 5 మ్యాచ్‌లు జరగగా.. మూడింటిలో భారత్ విజయం సాధించి విజేతగా నిలిచి స్వర్ణం గెలుచుకుంది.
డబుల్స్ టైటిల్ భారత్‌దే
థామస్ కప్ ఫైనల్లో భారత ద్వయం సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి టైటిల్ పోరులో సత్తా చాటారు. ఇండోనేషియాకు చెందిన అసాన్, సంజయ జోడిపై మూడు సెట్ల పోరులో విజయం సాధించారు. 18-21, 23-21, 21-19తో ఇండోనేషియా ద్వయంపై సాత్విక్, చిరాగ్ శెట్టి పోరాడి గెలుపొందారు. తొలి గేమ్‌ను చివరి నిమిషంలో తడబాటుకు లోనై కోల్పోయిన భారత జోడీ.. రెండో సెట్లో ప్రత్యర్థి ఆటగాళ్లకు గట్టిపోటీ ఇచ్చింది. ట్రై అయినా చివరివరకూ తగ్గకుండా 23-21తో రెండో గేమ్ నెగ్గారు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో అసాన్, సంజయ జోడీతో పోటాపోటీగా పాయింట్లు సాధించారు సాత్విక్, చిరాగ్ శెట్టి. తొలిసారి ఫైనల్ చేరినప్పటికీ ఒత్తిడిని జయించి కీలక సమయాల్లో పాయింట్లు సాధించి, 14 టైటిళ్లు గెలిచిన ఇండోనేషియా జంటపై భారత జోడీ సత్తా చాటింది.