ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్, రెండు సార్లు ప్రపంచ కప్‌ను అందించిన క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ శనివారం కన్నుమూశారు. కేవలం 46 ఏళ్ల వయస్సులో సైమండ్స్ మరణాన్ని క్రికెట్ ప్రపంచం జీర్ణించుకోలేకపోతోంది.
క్వీన్స్‌ల్యాండ్ పోలీసుల నివేదికల ప్రకారం, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సైమండ్స్ కారు రోడ్డుపై నుంచి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలతో సైమండ్స్ మరణించాడు. ఆయన మృతి పట్ల ప్రపంచం నలుమూలల నుంచి క్రీడాభిమానులు నివాళులు అర్పించారు.
భారత క్రికెటర్ హర్భజన్ సింగ్ సైమండ్స్ కుటుంబానికి తన సంతాపాన్ని తెలియజేశారు. ట్విట్టర్‌లో తన సందేశాన్ని పోస్ట్ చేశారు. "ఆండ్రూ సైమండ్స్ ఆకస్మిక మరణం గురించి విని షాక్ అయ్యాను. చాలా త్వరగా వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులకు, స్నేహితులకు నా సానుభూతి. మరణించిన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థన" అని హర్భజన్ ట్విట్టర్‌లో రాశారు.
భారత ఆఫ్ స్పిన్నర్ హర్భజన్, ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ సైమండ్స్ ఇద్దరి మధ్య వివాదం అందరికీ తెలిసిందే. ఇది క్రికెట్ ప్రపంచంలోని జాతి వివక్ష అంశాన్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. 'మంకీగేట్' పేరుతో అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. భారతదేశం, ఆస్ట్రేలియా మధ్య క్రికెట్ సంబంధాలపై ప్రభావం చూపింది.
ఆండ్రూ సైమండ్స్‌పై హర్భజన్ జాతి వివక్ష పేరుతో దూషించారనే విషయంలో తనకు ఎలాంటి సందేహం లేదని మ్యాచ్ రిఫరీ మైక్ ప్రాక్టర్ పేర్కొన్నారు. దీంతో హర్భజన్ సింగ్‌పై ఐసిసి మొదట మూడు మ్యాచ్‌లు నిషేధాన్ని విధించింది. దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన భారత జట్టు... పర్యటన నుంచి వైదొలుగుతామని బెదిరించింది.
దీనిపై అడిలైడ్ ఫెడరల్ కోర్టులో విచారణ జరిగింది. సిడ్నీలో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో ఏం జరిగిందో వివరిస్తూ ఇరు జట్లకు చెందిన స్టార్ క్రికెటర్లు ఈ విచారణలో పాల్గొన్నారు. అక్కడ జరిగిన వాస్తవ సంఘటనను కోర్టుకు తెలిపారు.
ఈ విచారణ తర్వాత, హర్భజన్‌పై విధించిన మూడు మ్యాచ్‌ల నిషేధాన్ని తొలగించారు. మ్యాచ్ ఫీజులో 50 శాతం ఫీజు కోత విధించి జరిమానాగా మార్చారు. హర్భజన్ జాతి విధ్వేష పూరిత కామెంట్స్ చేయలేదని తేల్చారు.
తర్వాత కాలంలో హర్భజన్ సింగ్, సైమండ్స్ ఇద్దరూ ఐపీఎల్‌లో ఆడారు. ఇద్దరూ ముంబయి ఇండియన్స్ తరఫున ఆడారు. అప్పటి సంఘటనపై హర్భజన్ సింగ్ మాట్లాడుతూ.. ఆస్ట్రేలియాలో జరిగిన మొత్తం ఘటనను మీడియానే డైవర్ట్ చేసిందని కామెంట్స్ చేశారు.
"ముంబై అతన్ని ఎంచుకున్నప్పుడు, అతన్ని ఎందుకు ఎంచుకున్నారు? అనే ఆలోచన నాకు వచ్చింది. మేము (నేను, సైమండ్స్) ఎలా కలిసిపోతాము? " అని అనున్నానని హర్భజన తెలిపారు. సైమండ్స్ ముంబయి ఇండియన్స్ డ్రెస్సింగ్ రూమ్‌లోకి ప్రవేశించినప్పటికి పూర్తిగా మారిపోయిన వ్యక్తిగా కనిపించాడు. అతను కోపంగా ఉంటాడని నేను అనుకున్నాను, నా గురించి కూడా తప్పుడు భావనతోనే ఉంటాడని అనుకున్నాను. అని ఓ ఇంటర్వ్యూలో హర్భజన చెప్పాడు.
"మేము చండీగఢ్‌లో ఉన్నప్పుడు ఒక సంఘటన గుర్తుకు వచ్చింది, మేము ఆడిన మ్యాచ్ గెలిచిన తర్వాత ఓ స్నేహితుడి ఇంటికి వెళ్లాం. అక్కడ, మేము మొదటిసారి కౌగిలించుకొని ఒకరికొకరు క్షమాపణ చెప్పుకున్నాము. అప్పుడే సమస్య పరిష్కరించుకున్నాం. మరింత స్నేహపూర్వకంగా మెలిగాం. ముంబయి ఇండియన్స్‌కి చెందిన చాలా మంది నా స్నేహితులు మా ఇద్దరి కలిసి ఉన్న క్షణానికి సంబంధించిన చిత్రాలను తీశారు. " అని హర్భజన వివరించాడు.
"నిజానికి మేం రాత్రిపూట కలిసి భోజనం చేసేవాళ్లం. నాకు, సైమండ్స్‌కు మధ్య ఉన్న వివాదాన్ని మీడియా బయటపెట్టింది. మేం కలిసినప్పుడు మా మధ్య అలాంటి శత్రుత్వం ఏమీ లేదని ఎప్పుడూ అనిపించలేదు" అని భజ్జీ తెలిపాడు.