Kohli vs Gambhir: ఐపీఎల్-16లో తీవ్ర చర్చనీయాంశమైన కోహ్లీ - గంభీర్‌ల గొడవపై ఆ ఇద్దరి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేసుకుంటున్నారు. గొడవకు కారణం గంభీర్ అని కోహ్లీ ఫ్యాన్స్.. కాదు కాదు కోహ్లీనే గెలికాడని గంభీర్ అభిమానులు నానా బూతులతో నానా విధాలుగా దుమ్మెత్తిపోసుకుంటున్నారు. అయితే ఈ వివాదంపై టీమిండియా మాజీ స్పిన్నర్లు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరి వ్యక్తిగత విభేదాల కారణంగా ఆట గౌరవాన్ని మంటగలపొద్దని సూచిస్తున్నారు.
కోహ్లీ - గంభీర్ వివాదంపై టీమిండియా మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే జియో సినిమాతో మాట్లాడుతూ.. ‘ఆటలో భావోద్వేగాలు సహజం. కానీ మీరు వాటిని ఇక్కడచూపించకూడదు. అది చాలా కీలకం. ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి. కానీ అది ఇలా కాదు. ఇది ఆమోదయోగ్యం కాదు.
మ్యాచ్‌లో ఏం జరిగినా సరే ఆట ముగియగానే ప్రత్యర్థిని, ఆ జట్టు ఆటగాళ్లను గౌరవించాలి. ప్రత్యర్థి టీమ్ ప్లేయర్ కు షేక్ హ్యాండ్ ఇవ్వాలి. అలా అయితేనే ఆటకు గౌరవిమిచ్చినట్టు. మీకు వ్యక్తిగత విభేదాలుంటే అవి మైదానం లోపల చూపించకూడదు. ఈ గొడవలో విరాట్, గంభీర్ లు ఇన్వాల్వ్ అవడం ఏమీ బాగోలేదు...’ అని అన్నాడు.
కాగా ఇదే విషయమై టర్బోనేటర్ హర్భజన్ సింగ్ కూడా స్పందించాడు. గంభీర్, కోహ్లీలు తనకు సోదరుల వంటి వారని, ఈ మ్యాచ్ లో ఇద్దరూ చేసింది కరెక్ట్ కాదని అన్నాడు. లక్నో - బెంగళూరు మ్యాచ్ ముగిశాక తన యూట్యూబ్ ఛానెల్ లో మాట్లాడుతూ.. 15 ఏండ్ల క్రితం ఇదే ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ బౌలర్ శ్రీశాంత్ ను కొట్టినందుకు తాను ఇప్పటికీ రిగ్రీట్ అవుతున్నానని, కోహ్లీ - గంభీర్ లు కూడా తనలా చేయొద్దని అన్నాడు. కోహ్లీ - గంభీర్ లు వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యులని, కానీ ఈ మ్యాచ్ లో గొడవపడకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. ఈ విషయంలో తప్పెవరిది అయినా ఇది క్రికెట్‌కు ఏమాత్రం మంచిది కాదని చెప్పాడు. తాను శ్రీశాంత్ విషయంలో ఇప్పుడు బాధపడుతున్నట్టే ఓ పదేండ్ల తర్వాత విరాట్, గంభీర్ లు తాము ఇలా ఎందుకు చేశామా..? అని సిగ్గుపడతారని తెలిపాడు.
నిన్నటి మ్యాచ్ ముగిశాక గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ ఒకర్నొకరు హ్యాండ్ షేక్ ఇచ్చుకున్నారు. దాంతో అంతా ప్రశాంతంగానే ఉందనిపించింది. కాసేపయ్యాక లక్నో ఓపెనర్ కైల్ మేయర్స్.. కోహ్లీ దగ్గరికి వెళ్లి ఏదో మాట్లాడుతున్నాడు. అప్పుడే గంభీర్ ఎంటరయ్యాడు. మేయర్స్‌ను పక్కు తీసుకెళ్లి ఏదో చెప్పాడు. కోహ్లీని ఉద్దేశించి ఏవో మాటలు అన్నాడు. దాంతో అతడు గంభీర్ దగ్గరికి వచ్చి దీటుగా ప్రతిస్పందించాడు. గొడవ పెద్దది అవుతుందనిపించడంతో రెండు జట్ల ఆటగాళ్లు, సపోర్ట్ స్టాప్ వారిద్దరినీ విడదీశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.