Kohli-Naveen Ul Haq Fight: లాస్ట్ ఓవర్ థ్రిల్లర్‌లు,  ఉత్కంఠ ముగింపుల మధ్య సాగుతున్న ఐపీఎల్-16కు లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ) - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)  మధ్య జరిగిన మ్యాచ్ కావాల్సినంత మసాలాను అందించింది. ఇదేదో ఆటలో అనుకుంటే పొరపాటే. ఆటలో జరిగిన ఆటేతర విషయాలతో మ్యాచ్ రచ్చకెక్కింది. దూకుడుగా  ఉండే విరాట్ కోహ్లీ.. ఉడుకురక్తంతో ఉన్న  నవీన్ ఉల్ హక్ లు  చప్పగా సాగుతున్న మ్యాచ్‌ను రసవత్తరంగా మార్చారు. ఇద్దరి మధ్య మొదలైన వాదన.. వాగ్వాదంగా మారి గొడవకు  దారి తీసి  రచ్చ రచ్చ చేసింది. 


అయితే  మ్యాచ్ ముగిసిన తర్వాత ఈ ఇద్దరూ  తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలలో  పోటాపోటీ పోస్టులతో  మరోసారి ఈ చర్చను చల్లారనీయకుండా చేశారు.  లక్నో - బెంగళూరు  మ్యాచ్ ముగిశాక  కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో ‘మనం వినేవన్నీ అభిప్రాయాలు మాత్రమే. అవి నిజాలు కాదు. అలాగే మనం చూసేది కూడా వాస్తవం కాదు.  అది మన  దృక్కోణానికి సంబంధించింది మాత్రమే’అని  ఓ కోట్ రాసుకొచ్చాడు. 


 






నవన్ కూడా తన  ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో  ‘మీకు ఏది అర్హమైనదో అదే  దక్కుతుంది.  అది ఎలాగైనా జరిగి తీరుతుంది’అని    రాసుకొచ్చాడు.   ఈ ఇద్దరూ చేయాల్సిన రచ్చ చేసి చివరికి నీతులు చెప్పడం గమనార్హం.


ఇక ఎల్ఎస్‌జీ-ఆర్సీబీ మ్యాచ్ లో   నవీన్ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో కోహ్లీ అతడిని స్లెడ్జ్ చేశాడు. దానికి నవీన్ కూడా తగ్గలేదు.  అతడి ప్రవర్తనతో విసిగిపోయిన కోహ్లీ తన  షూకు ఉన్న దుమ్మును తీసేస్తూ ‘నువ్వు ఇది’అన్నట్టుగా  సైగ చేశాడు. ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత  షేక్ హ్యాండ్ ఇచ్చేప్పుడు కూడా ఇద్దరూ వాదులాడుకున్నారు. గొడవ కాస్త సద్దుమణిగాక  కెఎల్ రాహుల్.. కోహ్లీతో మాట్లాడుతుండగా అటుగా వెళ్తున్న  నవీన్‌ను లక్నో సారథి పిలిచాడు. దానికి అతడు ‘యే పో, నేను మాట్లాడను’ అన్నట్టుగా అక్కడ్నంచి వెళ్లిపనోయాడు.  ఇదిలా ఉంటే నవీన్ - కోహ్లీ గొడవతో పాటు సీన్ లోకి గంభీర్ దూరి దీనిని ఇంకా రచ్చ చేశాడు.  ప్రస్తుతం  భారత క్రికెట్ లో కోహ్లీ - గంభీర్ - నవీన్ ల రచ్చ గురించే చర్చ జరుగుతోంది. 


 






ఇక మ్యాచ్ విషయానికొస్తే.. స్లో టర్నర్  అయిన లక్నో పిచ్ పై   ఆర్సీబీ  ఫస్ట్ బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో  9 వికెట్ల నష్టానికి  126 పరుగులే చేసింది.   కెప్టెన్ డుప్లెసిస్ (44) టాప్  స్కోరర్. ఈ మ్యాచ్ కు ముందు  పంజాబ్ తో మ్యాచ్  లో257 పరుగులు చేసిన  లక్నో..   నిన్న 127 పరుగులు చేయడానికి నానా తంటాలు పడింది.  19.5 ఓవర్లు ఆడి  108 పరుగులకే ఆలౌట్ అయింది.  ఆ జట్టులో కృష్ణప్ప గౌతమ్  (23) టాప్ స్కోరర్.