Kohli vs Gambhir: 


'చేసుకున్నవాళ్లకు చేసుకున్నంత' అన్నది సామెత! ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2023లో లక్నో సూపర్‌ జెయింట్స్, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మ్యాచులో అతి చేసిన ముగ్గురికీ నిర్వాహకులు జరిమానా విధించారు. లక్నో మెంటార్‌ గౌతమ్ గంభీర్‌, ఆర్సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మ్యాచు ఫీజులో వంద శాతం కోత విధించారు. ఇక లక్నో పేసర్‌ నవీన్‌ ఉల్‌ హఖ్‌ మ్యాచు ఫీజులో 50 శాతం తగ్గించారు.






'లక్నో సూపర్ జెయింట్స్‌ మెంటార్‌ గౌతమ్‌ గంభీర్‌ మ్యాచు ఫీజులో 100 శాతం జరిమానా విధిస్తున్నాం. ఎకనా స్టేడియంలో లక్నో, ఆర్సీబీ మ్యాచులో ఆయన ఐపీఎల్‌ నియమావళిని ఉల్లంఘించాడు' అని మ్యాచ్‌ రిఫరీ ప్రకటించారు. 'ఐపీఎల్‌ నియమావళిలోని ఆర్టికల్‌ 2.21లోని రెండో లెవల్‌ తప్పిదాన్ని గంభీర్ అంగీకరించాడు' అని ఐపీఎల్‌ నిర్వాహకులు తెలిపారు.


'మిస్టర్‌ కోహ్లీ కూడా ఐపీఎల్‌ నియమావళిలోని ఆర్టికల్‌ 2.21 కింద రెండో స్థాయి తప్పిదాన్ని అంగీకరించాడు. ఆయన మ్యాచు ఫీజులో వంద శాతం కోత విధిస్తున్నాం' అని ఐపీఎల్‌ కమిటీ తెలిపింది.  'లక్నో సూపర్‌ జెయింట్స్‌ బౌలర్‌ నవీన్‌ ఉల్‌ హఖ్‌ మ్యాచు ఫీజులో 50 శాతం కోత విధిస్తున్నాం. ఐపీఎల్‌ నియమావళిలోని ఆర్టికల్‌ 2.21 కింద లెవల్‌ వన్‌ తప్పిదాన్ని అతడు అంగీకరించాడు' అని కమిటీ వెల్లడించింది.






ఇండియన్‌ ప్రీమియర్‌ లీగు 2023లో కొన్ని అగ్లీ సీన్స్‌ చోటు చేసుకున్న సంగతి తెఇసిందే. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌  కోహ్లీ, లక్నో సూపర్‌ జెయింట్స్‌ మెంటార్‌ గౌతమ్ గంభీర్ ఒకర్నొకరు దూషించుకున్నారు! కాస్త ఘాటుగానే మాటలు అనుకున్నారు.


ఏకనా స్టేడియంలో సోమవారం లక్నో సూపర్‌ జెయింట్స్ (Lucknow Super Giants), రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (Roayal Challengers Bangalore) తలపడ్డాయి. ఈ పోరులో ఆర్సీబీ విజయం సాధించింది. అయితే ఛేదనలో లక్నో బ్యాటర్లు ఔటైన ప్రతిసారీ విరాట్‌ కోహ్లీ (Virat Kohli) అతిగా స్పందించాడు. ఎక్కువ యానిమేటెడ్‌గా కనిపించాడు. ఈ సీజన్‌ మొదటి మ్యాచులో చిన్నస్వామిలో లక్నో ఆఖరి బంతికి ఉత్కంఠకర విజయం సాధించింది. అప్పుడు ఆర్సీబీ అభిమానులను ఉద్దేశించి.. గౌతమ్‌ గంభీర్‌ (Gautam Gambhir) నోర్మూసుకోండి అని సైగలు చేశాడు. ఇందుకు ప్రతీకారంగానే విరాట్ అతిగా స్పందించినట్టు అనిపిస్తోంది.


మ్యాచు ముగిశాక గౌతమ్‌ గంభీర్‌, విరాట్‌ కోహ్లీ ఒకర్నొకరు హ్యాండ్ షేక్‌ ఇచ్చుకున్నారు. దాంతో అంతా ప్రశాంతంగానే ఉందనిపించింది. కాసేపయ్యాక లక్నో ఓపెనర్‌ కైల్‌ మేయర్స్‌.. కోహ్లీ దగ్గరికి వెళ్లి ఏదో మాట్లాడుతున్నాడు. అప్పుడే గంభీర్‌ ఎంటరయ్యాడు. మేయర్స్‌ను పక్కు తీసుకెళ్లి ఏదో చెప్పాడు. కోహ్లీని ఉద్దేశించి ఏవో మాటలు అన్నాడు. దాంతో అతడు గంభీర్ దగ్గరికి వచ్చి దీటుగా ప్రతిస్పందించాడు. గొడవ పెద్దది అవుతుందనిపించడంతో రెండు జట్ల ఆటగాళ్లు, సపోర్ట్‌ స్టాప్‌ వారిద్దరినీ విడదీశారు. ఈ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.