GT vs DC Preview: ఐపీఎల్‌లో  వరుస విజయాలతో దూసుకుపోతూ  ప్లేఆఫ్స్ రేసులో అందరికంటే ముందున్న గుజరాత్ టైటాన్స్ (జీటీ)..  నేడు  ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) ఢీకొనబోతున్నది.   ఆడిన 8 మ్యాచ్‌లలో  ఆరు గెలిచిన గుజరాత్‌ను అడ్డుకోవడం  ఢిల్లీకి   ప్రస్తుతానికైతే శక్తికి మించిన పనే. అదీగాక  మ్యాచ్ జరిగేది  జీటీ సొంత గ్రౌండ్ అహ్మదాబాద్‌లో.. 


ప్లేఆఫ్స్ పైనే దృష్టి.. 


గుజరాత్ టీమ్ ను ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో ఓ మీమ్ తెగ వైరల్ అవుతున్నది. ‘అసలు మీ టీమ్ లో ఏం పెడతారు బ్రో తినడానికి.  ఎంత చెత్తగా ఆడే ప్లేయర్ అయినా మీదాంట్లో బాగా ఆడుతున్నాడు..’అని.  గుజరాత్ ఆట  కూడా  అలాగే ఉంది. ఈ సీజన్‌లో  రాజస్తాన్ చేతిలో ఓడిన తర్వాత   గుజరాత్ వరుసగా మూడు మ్యాచ్‌లలోనూ గెలిచి హ్యాట్రిక్ కొట్టింది.  8 మ్యాచ్‌లలో ఆరు విజయాలు సాధించిన పాండ్యా సేన..  బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని విభాగాలలో  పటిష్టంగా ఉంది. లక్నోతో పోతుందనుకున్న మ్యాచ్ (136 టార్గెట్) గెలిచింది. 


హార్ధిక్ పాండ్యా ‘అతి’ తప్ప  ఆ టీమ్ లో వేలెత్తి చూపించడానికి లోపాలు కూడా పెద్దగా లేవు.  బ్యాటింగ్ గిల్, హార్ధిక్ పాండ్యా, విజయ్ శంకర్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాటియా, డేవిడ్ మిల్లర్ లతో ఆ జట్టు పటిష్టంగా ఉంది.   బౌలింగ్ లో షమీ,  మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, రషీద్ ఖాన్  లు దుమ్ము రేపుతున్నారు.


 






ఢిల్లీ ఓడితే ఇక అస్సామే.. 


ఈ సీజన్ లో ఆడిన 8 మ్యాచ్ లలో రెండు మాత్రమే గెలిచిన  ఢిల్లీ.. ఇటీవలే సన్ రైజర్స్ చేతిలో చావుదెబ్బతింది.  గుజరాత్ జట్టు అన్ని విభాగాల్లో ఎంత పటిష్టంగా ఉందో ఢిల్లీ అంత వీక్ గా ఉంది.   బ్యాటింగ్ లో డేవిడ్ వార్నర్ రాణిస్తున్నా గత మ్యాచ్ లో డకౌట్ అయ్యాడు. మిచెల్ మార్ష్, సాల్ట్ లు ఫామ్ ను అందుకోవడం కాస్త ఊరటనిచ్చే అంశం.  ఆ తర్వాత వస్తున్న బ్యాటర్లందరూ  ఏదో చుట్టపు చూపునకు వచ్చినట్టు వచ్చి పోతున్నారు. అక్షర్ పటేల్  మీద ఆ జట్టు ఆశించినదానికంటే ఎక్కువ ఆధారపడుతున్నది. 


బౌలింగ్ లో కూడా అన్రిచ్ నోర్జే, కుల్దీప్ యాదవ్ వంటి అంతర్జాతీయ స్టార్లు  పెద్దగా ప్రభావం చూపడంలేదు.  గత మ్యాచ్ లో మార్ష్ బౌలింగ్ లో కూడా నాలుగు వికెట్లు తీశాడు.   అహ్మదాబాద్   గ్రౌండ్ అక్షర్ పటేల్ కు సొంత మైదానం. మరి ఇక్కడ  ‘బాపూ’ (అక్షర్ నిక్ నేమ్) ఏమేరకు గుజరాత్ ను కట్టడి చేస్తాడనేది ఆసక్తికరం. ఈ మ్యాచ్ లో కూడా ఓడితే ఢిల్లీ ఇక ఈ టోర్నీలో ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా తప్పుకున్నట్టే అవుతుంది. 


 






హెడ్ టు హెడ్ : ఐపీఎల్ లో ఈ రెండు జట్ల మధ్య గత సీజన్ లో ఒకటి ఈ సీజన్ లో మరో మ్యాచ్  జరిగాయి. రెండింటిలోనూ గుజరాత్  దే గెలుపు. 


పిచ్ : అహ్మదాబాద్ స్టేడియం బ్యాటింగ్ ప్యారడైజ్. ఈ సీజన్ లో ఇక్కడ  యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోరు  190 గా నమోదైంది.  ఛేదన చేసే జట్టుకు విజయావకాశాలెక్కువ. 


తుది జట్లు (అంచనా) : 


గుజరాత్ టైటాన్స్ : వృద్ధిమాన్ సాహా, శుభ్‌మన్ గిల్, హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), విజయ్ శంకర్, అభినవ్ మనోహర్, డేవిడ్ మిల్లర్,  రాహుల్ తెవాటియా,  రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ 



ఢిల్లీ క్యాపిటల్స్ : డేవిడ్ వార్నర్ (కెప్టెన్), ఫిలిప్ సాల్ట్, మిచెల్ మార్ష్, మనీష్ పాండే, ప్రియమ్ గార్గ్, అక్షర్ పటేల్,  రిపల్ పటేల్,  కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నోర్జ్, ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్