లక్నో ఐపీఎల్ జట్టు కేఎల్ రాహుల్‌ను కెప్టెన్‌గా ఎంచుకున్న సంగతి తెలిసిందే. అయితే కేఎల్ రాహుల్‌కు లక్నో చెల్లించే మొత్తం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఏకంగా రూ.17 కోట్లు చెల్లించి కేఎల్ రాహుల్‌ను లక్నో సొంతం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఐపీఎల్ చరిత్రలోనే ఒక ఆటగాడికి చెల్లించిన అత్యధిక మొత్తం.


2018లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విరాట్ కోహ్లీకి అంతే మొత్తం చెల్లించింది. అప్పుడు విరాట్ కెరీర్‌లోనే పీక్ ఫాంలో ఉన్నాడు. దాంతోపాటు తను ఆర్సీబీకి కెప్టెన్ కూడా. ఇప్పుడు విరాట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి కూడా తప్పుకున్నాడు. ఈ సీజన్‌లో తన ధర రూ.15 కోట్లుగా ఉంది.


కేఎల్ రాహుల్‌తో పాటు మార్కస్ స్టోయినిస్, రవి బిష్ణోయ్‌లను కూడా లక్నో డ్రాఫ్ట్ చేసింది. మార్కస్ స్టోయినిస్ బిగ్ బాష్ లీగ్‌లో అద్భుతమైన ఫాంలో ఉన్నాయి. ఇక రవి బిష్ణోయ్ కూడా గత ఐపీఎల్‌లో తన సత్తా చూపించాడు. తొమ్మిది మ్యాచ్‌ల్లో 12 వికెట్లు తీసుకున్నాడు. తన బౌలింగ్ యావరేజ్ 18.5 కాగా, ఎకానమీ 6.34 మాత్రమే కావడం విశేషం. ఇంత టాలెంటెడ్ ఆటగాడు కాబట్టే రాహుల్ తనను ఎంచుకున్నాడు.


నేరుగా వేలంలో కొనుగోలు చేసిన వారిలో దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్ మొదటి స్థానంలో ఉన్నాడు. 2021 సీజన్‌కు గానూ రూ.16.25 కోట్లు చెల్లించి రాజస్తాన్ రాయల్స్ తనను సొంతం చేసుకుంది. ఈసారి ఐపీఎల్ వేలంలో డేవిడ్ వార్నర్, శ్రేయస్ అయ్యర్, పృధ్వీ షా, ఇషాన్ కిషన్, ఫాఫ్ డుఫ్లెసిస్ వంటి సూపర్ స్టార్లు కూడా ఉన్నారు కాబట్టి ఈ రికార్డు కూడా బద్దలయ్యే అవకాశం ఉంది.