అతి విశ్వాసమే టీమ్‌ఇండియా కొంప ముంచిందని దక్షిణాఫ్రికా మాజీ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ అంటున్నాడు. వన్డే సిరీసులో సఫారీలు అద్భుతంగా ఆడారని ప్రశంసించాడు. టీమ్‌ఇండియా గొప్ప జట్టేనని పేర్కొన్నాడు. ఆతిథ్య జట్టును తక్కువ అంచనా వేయడం వల్లే వారికీ పరాభవం ఎదురైందని వెల్లడించాడు.
'నేనే జట్టు పైనా తీర్పు చెప్పను. నిజానికి టీమ్‌ఇండియా గొప్ప జట్టు. ఇప్పుడు దక్షిణాఫ్రికా ఇప్పుడిప్పుడే ఎదుగుతోంది. కేఎల్ రాహుల్ సేన వారిని తప్పుగా అంచనా వేసింది. సఫారీలను సునాయాసంగా ఓడిస్తామని అతి విశ్వాసానికి పోయింది. అందువల్లే టీమ్‌ఇండియా ఓటమి పాలైంది' అని ఇమ్రాన్ తాహిర్ అన్నాడు. యువ సఫారీ జట్టుపై అతడు ప్రసంశలు కురిపించాడు. సుదీర్ఘ ఫార్మాట్, పరిమిత ఓవర్ల క్రికెట్లో అదరగొట్టిందని పేర్కొన్నాడు.
'నాలుగైదేళ్లుగా అటు టెస్టు, ఇటు వన్డే ప్రపంచ క్రికెట్లో టీమ్‌ఇండియా ఆధిపత్యం చెలాయిస్తోంది. కానీ ఈ సఫారీ జట్టు అద్భుతంగా ఆడింది. స్వదేశంలోని పరిస్థితులను చక్కగా ఉపయోగించుకుంది. వాటిని విజయాలుగా మలుచుకుంది' అని తాహిర్ అన్నాడు.
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీసును టీమ్‌ఇండియా 0-2తో చేజార్చుకున్న సంగతి తెలిసిందే. రెండో వన్డేలోనూ జట్టు విజయానికి చేరువై బోల్తా పడింది. ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 287 పరుగులు సాధించింది. కేఎల్ రాహుల్‌తో (55: 79 బంతుల్లో, నాలుగు ఫోర్లు) రిషబ్ పంత్ (85: 71 బంతుల్లో, 10 ఫోర్లు, రెండు సిక్సర్లు) రాణించారు. ఈ లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 48.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లు అందరూ రాణించారు. జానేమన్ మలన్ (91: 108 బంతుల్లో, 8 ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా, యజ్వేంద్ర చాహల్, శార్దూల్ ఠాకూర్‌లకు తలో వికెట్ దక్కింది.
Also Read: Ind vs SA, Innings Highlights: అయిపాయే.. రెండో మ్యాచ్‌లోనూ భారత్ ఓటమి.. సిరీస్ కూడా!
Also Read: IPL 2022 Retention: లక్నో, అహ్మదాబాద్ ఎంచుకున్న ఆటగాళ్లు వీరే.. కెప్టెన్లు ఎవరంటే?
Also Read: David Warner: పుష్పని వదలని వార్నర్.. తర్వాతి ఐపీఎల్ ఫ్రాంచైజీకి హింట్ ఇచ్చాడా?