ఐపీఎల్ 2022 కొత్త జట్లు మూడేసి ఆటగాళ్లను ఎంచుకున్నాయి. అహ్మదాబాద్ జట్టు హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్, శుభ్‌మన్ గిల్‌లను ఎంచుకోగా.. లక్నో కేఎల్ రాహుల్, మార్కస్ స్టోయినిస్, రవి బిష్ణోయ్‌లను తమ జట్టులో చేర్చుకున్నాయి. వీరిలో రషీద్ ఖాన్, మార్కస్ స్టోయినిస్ విదేశీ ఆటగాళ్లు. అహ్మదాబాద్ జట్టుకు హార్దిక్, లక్నో జట్టుకు కేఎల్ రాహుల్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారని వార్తలు వస్తున్నాయి.


దీంతో వేలానికి ఏయే ఆటగాళ్లు అందుబాటులో ఉండనున్నారనే విషయం పూర్తి క్లారిటీ వచ్చింది. రిటైన్ చేసుకున్న వారి ధరలను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే లక్నో ఫ్రాంచైజీ కేఎల్ రాహుల్‌కు రూ.17 కోట్లు, మార్కస్ స్టోయినిస్ రూ.9.2 కోట్లు, రవి బిష్ణోయ్ రూ.4 కోట్లు వెచ్చించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక అహ్మదాబాద్ ఫ్రాంచైజీ హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్‌లకు చెరో రూ.15 కోట్లు, శుభ్‌మన్ గిల్‌కు రూ.8 కోట్లు చెల్లించాయని తెలుస్తోంది.