KL Rahul Donates INR 31 Lakhs : టీమ్ఇండియా క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ మరోసారి అభిమానుల హృదయాలు గెలుచుకున్నాడు! ఓ చిన్నారి శస్త్రచికిత్స కోసం రూ.31 లక్షలు విరాళంగా ఇచ్చాడు. 11 ఏళ్ల వరద్‌ అనే పిల్లాడి ప్రాణం కాపాడాడు. అరుదైన బోన్‌ మ్యారో మార్పిడి శస్త్రచికిత్సకు సాయం అందించాడు.


డిసెంబర్‌ నుంచి తల్లిదండ్రులు వరద్‌ శస్త్రచికిత్స కోసం డబ్బులు సేకరిస్తున్నారు. రూ.35 లక్షల కోసం ఓ ఫండ్‌రైజింగ్‌ కార్యక్రమం చేపట్టారు. ఈ విషయం తెలియగానే సాయం చేసేందుకు కేఎల్‌ రాహుల్‌ ముందుకొచ్చాడు. రూ.31 లక్షలు విరాళం అందించాడు.


'వరద్‌ పరిస్థితి తెలియగానే నా టీమ్‌ గివ్‌ఇండియా (GiveIndia)ను సంప్రదించింది. మాకు వీలైన రీతిలో సాయం చేయాలని అనుకున్నాం. శస్త్రచికిత్స విజయవంతం అయినందుకు సంతోషంగా ఉంది. ఇప్పుడా పిల్లాడు కోలుకుంటున్నాడు. అతడు త్వరగా లేచి నిలబడి తన కలలను సాకారం చేసుకుంటాడని ఆశిస్తున్నా. నేను చేసిన ఈ సాయం అవసరంలో ఉన్న వారిని ఆదుకొనేందుకు మరింత మందికి ప్రేరణనివ్వాలని అనుకుంటున్నా' అని రాహుల్‌ అన్నాడు.


'కేఎల్‌ రాహుల్‌కు మా కృతజ్ఞతలు. వరద్‌ సర్జరీ కోసం అతడు భారీ మొత్తం విరాళంగా ఇచ్చాడు. అతడే లేకుంటే బోన్‌ మ్యారో మార్పిడి సర్జరీ ఇంత త్వరగా అయ్యేది కాదు. థాంక్యూ రాహుల్‌' అని వరద్‌ తల్లిదండ్రులు తెలిపారు.


ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో లక్నో సూపర్‌ జెయింట్స్‌కు కేఎల్‌ రాహుల్‌ సారథ్యం వహించనున్నాడు. పంజాబ్‌ కింగ్స్‌ను వీడిని అతడిని లక్నో డ్రాఫ్ట్‌ చేసుకుంది. వెస్టిండీస్‌తో రెండో వన్డేలో పిక్క కండరాలు పట్టేయడంతో జట్టుకు దూరమయ్యాడు. త్వరలో శ్రీలంకతో జరిగే సిరీసుకు అతడు అందుబాటులో ఉండటం లేదు. అతడి స్థానంలో కుర్రాళ్లకు చోటు దక్కనుంది.