AIFF New President: అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (AIFF) నూతన అధ్యక్షుడిగా కల్యాణ్ చౌబే ఎన్నికయ్యారు. బైచుంగ్ భుటియాతో జరిగిన పోటీలో ఘన విజయం అందుకున్నారు. 33-1 ఓట్ల తేడాతో ప్రత్యర్థిని ఓడించారు. వీరిద్దరూ ఫుట్‌బాల్‌ మాజీ ఆటగాళ్లే కావడం ప్రత్యేకం. 85 ఏళ్ల సమాఖ్య చరిత్రలో ఓ మాజీ ఆటగాడు అధ్యక్షుడిగా ఎంపికవ్వడం ఇదే తొలిసారి. కాగా ఆయన పశ్చిమ్‌ బంగాల్‌లో బీజేపీ నేతగా ఉన్నారు.


కల్యాణ్‌ చౌబే టాటా పుట్‌బాల్‌ అకాడమీ (TFA) నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. 1996 గోల్డెన్‌ బ్యాచ్‌ నుంచి పాస్‌ఔట్‌ అయ్యారు. గత పార్లమెంటు ఎన్నికల్లో ఆయన బీజేపీ తరఫున కృష్ణా నగర్‌లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆయన ఒక్కసారీ భారత పుట్‌బాల్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించలేదు. కొన్ని సందర్భాల్లో జట్టులో చోటు దక్కించుకున్నారు. వయసు ఆధారిత అంతర్జాతీయ టోర్నీల్లో భారత్‌కు ఆడారు. నిజానికి ఈస్ట్‌ బెంగాల్‌ జట్టులో బైచుంగ్‌ భుటియా, చౌబీ సహచరులే కావడం గమనార్హం.


ప్రత్యర్థులకు దొరక్కుండా గోల్‌ కొట్టడంలో 'సిక్కిమీస్‌ స్నైపర్‌'గా పేరు పొందిన బైచుంగ్ భుటియాకు ఈ ఎన్నికల్లో మద్దతు లభించలేదు. 34 రాష్ట్ర సంఘాల ప్రతినిధుల్లో ఆయనకు ఒక్కరే ఓటు వేశారు. నామినేషన్‌ సమయంలో తన సొంత రాష్ట్ర సంఘం నుంచీ ప్రతిపాదించనివారు లేరు. టీమ్‌ఇండియా తరఫున భుటియా 104 మ్యాచుల్లో  40 గోల్స్‌ కొట్టారు. 2011లో ఆటకు వీడ్కోలు పలికారు. 1999లో ఐరోపా క్లబ్‌తో ఒప్పందం కుదుర్చుకున్న తొలి భారతీయుడిగా ఆయన రికార్డు సృష్టించారు. ఇంగ్లిష్ టీమ్ బరీకి ఆడారు. మోహన్ బగాన్, తూర్పు బంగాల్‌, సెలాంగోర్‌, యునైటెడ్‌ సిక్కిం క్లబ్‌లకు ఆడారు.


కర్ణాటక ఫుట్‌బాల్‌ సంఘం అధ్యక్షుడు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఎన్‌ఏ హ్యారిస్‌ ఏఐఎఫ్‌ఎఫ్‌ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. రాష్ట్రస్థాన్‌ ఎఫ్‌ఏకు చెందిన మన్వేంద్ర సింగ్‌ను ఓడించారు. అరుణాచల్‌ ప్రదేశ్‌ ప్రతినిధి కిపా అజయ్‌ ఆంధప్రదేశ్ అభ్యర్థి గోపాల్‌కృష్ణ కొసరాజును ఓడించి కార్యదర్శిగా గెలిచారు. ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులుగా 14 మంది ఎంపికయ్యారు.