Big Shock to Novak Djokovic in Australian Open 2024 Semi Finals: ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024లో మరో సంచలనం నమోదైంది. ఇప్పటికే వరల్డ్ నెంబర్ 2 ర్యాంకర్ అల్కరాస్ క్వార్టర్ ఫైనల్ లో ఓటమిపాలు కాగా.. వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకర్ నొవాక్ జకోవిచ్ కు సెమీస్ లో బిగ్ షాక్ తగిలింది. రికార్డు స్థాయిలో పదకొండోసారి ఆస్ట్రేలియా ఓపెన్ గెలవాలన్న జకోవిచ్ ఆశలపై.. నాలుగో సీడ్ ఇటలీకి చెందిన యానిక్ సినెర్ నీళ్లు చల్లాడు. సెమీఫైనల్ లో 22 ఏళ్ల సినర్ ముందు.. జకోవిచ్ తలవంచక తప్పలేదు. జకోవిచ్ సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసి మరీ సినర్ తన కెరీర్‌లోనే భారీ విజయం సాధించాడు. 6-1, 6-2, 6-7, 6-3తో జకోవిచ్‌పై గెలుపొందాడు.
వరుసగా 33 విజయాలు
2018 తర్వాత మెల్ బోర్న్ పార్క్‌లో జకోవిచ్ ఏ మ్యాచ్‌ను ఓడిపోలేదు. వరుసగా 33 విజయాలతో చరిత్ర సృష్టించిన జకోకు, యువ ఆటగాడు సినర్ షాక్ ఇచ్చాడు. గతంలో ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్ చేరిన ప్రతీసారి జొకోవిచ్ టైటిల్ గెలుచుకోగా... తొలిసారి సెమీస్‌లో వెనుదిరిగాడు. సెమీస్ లో జకోవిచ్ వరుసగా తొలి రెండు సెట్లను 1-6, 2-6 తేడాతో సినర్ కు కోల్పోయాడు. అప్పటివరకూ ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయిన జకో, మూడో సెట్ లో మాత్రం తీవ్రంగా పోరాడి 7-6 (8/6)తో రేసులో నిలిచాడు. అయితే, నాలుగో సెట్ లో విజృంభించిన సినర్.. 6-3తో సత్తా చాటి ఫైనల్ కు చేరుకున్నాడు. ఈ మ్యాచ్ లో జకోవిచ్ నాలుగు డబుల్ ఫాల్ట్స్ చేయగా, సినర్ ఒక్కసారి మాత్రమే చేశాడు. జకోవిచ్‌పై గెలిచి తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ ఫైనల్ చేరిన సినర్... మూడో సీడ్ మెద్వెదేవ్, ఆరో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ మధ్య జరిగే మ్యాచ్‌లో గెలిచిన ఆటగాడితో ఫైనల్ లో తలపడతాడు. కాగా, ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్ ఆదివారం జరగనుంది.
ఇప్పటికే వెనుదిరిగి మహిళా నెంబర్ వన్
ఆస్ట్రేలియా ఓపెన్(Australian Open 2024) లో పెను సంచలనం నమోదైంది. టైటిల్ ఫేవరెట్, ప్రపంచ నంబర్ వన్ ఇగా స్వైటెక్(Iga Swiatek)కు మూడో రౌండ్‌లోనే పరాజయం ఎదురైంది. మహిళల సింగిల్స్ మూడో రౌండ్‌లో స్వైటెక్‌పై.. అన్‌సీడెడ్ నొకోవా(Linda Noskova) విజయం సాధించింది. మహిళల సింగిల్స్ మూడో రౌండ్‌లో టాప్ సీడ్ స్వైటెక్ 6-3, 3-6, 4-6తో ప్రపంచ 50వ ర్యాంకర్ లిండా నొకోవా చేతిలో ఓడింది. తొలి సెట్‌ను సునాయసంగానే గెలిచిన స్వైటెక్.. ఆ తర్వాత అనవసర తప్పిదాలు, పేలవ సర్వీసులతో ఓడిపోయింది. రెండున్నర గంటల పాటు సాగిన పోరులో స్వైటెక్ 4 ఏస్‌లు కొట్టి ఒక డబుల్ ఫాల్ట్ చేస్తే.. నొకొవా 10 ఏస్‌లు బాదింది. స్వైటెక్ 34 విన్నర్లు సంధిస్తే.. నొకొవా 35 విన్నర్లు కొట్టి.. 37 అనవసర తప్పిదాలు చేసింది. బలమైన ఫోర్‌హ్యాండ్ షాట్లు ఆడిన నోస్కోవా.. రెండో సెట్ ఎనిమిదో గేమ్‌లో స్వైటెక్ సర్వీస్ బ్రేక్ చేసి 5-3తో ఆధిక్యంలోకి వెళ్లింది. అదే జోరుతో సెట్ గెలిచి మ్యాచ్‌లో నిలిచింది. మూడో సెట్లో స్వైటెక్ కాస్త మెరుగ్గా ఆడినా.. నోస్కోవా తగ్గలేదు. ఏ దశలోనూ స్వైటెక్‌కు అవకాశం ఇవ్వలేదు. అంతేకాక ఏడో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్ బ్రేక్ చేసి 4-3తో ఆధిక్యంలోకి వెళ్లిన ఈ రష్యా అమ్మాయి..అదే దూకుడు కొనసాగించి సెట్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న స్వైటెక్.... ఆస్ట్రేలియా ఓపెన్‌లో మాత్రం అదే జోరు కనబర్చలేకపోతోంది. మెల్‌బోర్న్‌లో స్వైటెక్ ఒక్కసారి కూడా సెమీఫైనల్ దాటలేదు. మిగిలిన మ్యాచుల్లో పన్నెండో సీడ్ కిన్వెన్ జెంగ్ (చైనా), 18వ సీడ్ విక్టోరియా అజరెంకా (బెలారస్), స్వితోలినా (ఉక్రెయిన్) ప్రిక్వార్టర్స్‌లోకి అడుగుపెట్టారు. ఆస్ట్రేలియన్ ఓపెన్లో ఇప్పటిదాకా రెండో రౌండ్ దాటని జెంగ్ 6-4, 2-6, 7-6 (10-8)తో చైనాకే చెందిన వాంగ్‌ను ఓడించి తుది 16లో చోటు దక్కించుకుంది.