Ishan Kishan becomes highest rated India batter in icc t20 rankings: టీమ్‌ఇండియా పాకెట్‌ డైనమైట్‌ ఇషాన్‌ కిషన్‌ (Ishan Kishan) దుమ్మురేపుతున్నాడు. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో తొలిసారి టాప్‌-7కు చేరుకున్నాడు. ప్రస్తుతం టాప్‌-10లో ఉన్న ఏకైక భారతీయుడు అతనొక్కడే కావడం గమనార్హం. అతడి తర్వాత మరో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (KL Rahul) 14వ స్థానంలో కొనసాగుతున్నాడు.


దక్షిణాఫ్రికాతో ఐదు టీ20ల సిరీసులో ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ దూకుడుగా ఆడుతున్నాడు. భారీ షాట్లతో విరుచుకుపడుతున్నాడు. టీమ్‌ఇండియాకు మెరుపు ఆరంభాలు ఇస్తున్నాడు. వరుసగా మూడు మ్యాచుల్లో 76, 34, 54తో 164 పరుగులు చేశాడు. ఫలితంగా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో (ICC Rankings) ఒక్కసారిగా పుంజుకున్నాడు. 75వ ర్యాంకులో ఉన్న అతడు 68 స్థానాలు ఎగబాకి టాప్‌ 10కు చేరుకున్నాడు. 689 రేటింగ్‌ పాయింట్లతో ఏడో ర్యాంకులో నిలిచాడు. టీ20ల్లో భారత తరఫున టాప్‌-10లో నిలిచిన క్రికెటర్‌గా అవతరించాడు. ఇక కేఎల్‌ రాహుల్‌ 14, శ్రేయస్‌ అయ్యర్‌ 16, రోహిత్‌ శర్మ 17, విరాట్‌ కోహ్లీ 21వ ర్యాంకుల్లో ఉన్నారు.


టీ20 బౌలింగ్‌ జాబితాలో టాప్‌-10లో భారతీయులు లేరు. 635 రేటింగ్‌తో భువనేశ్వర్‌ కుమార్‌ 11వ స్థానంలో నిలిచాడు. దక్షిణాఫ్రికా సిరీసులో 6 వికెట్లు తీసి మూడు స్థానాలు మెరుగుపర్చుకున్నాడు. అతడి తర్వాత యుజ్వేంద్ర చాహల్‌ 26వ ర్యాంకులో ఉన్నాడు. ఇక టెస్టు ర్యాంకింగ్స్‌లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 8, మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ 10వ స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ జో రూట్‌ 897 రేటింగ్‌లో అగ్రస్థానం అందుకున్నాడు. 


టెస్టు బౌలర్లలో రవిచంద్రన్‌ అశ్విన్‌ (850), జస్ప్రీత్‌ బుమ్రా (830) వరుసగా 2, 3 ర్యాంకుల్లో ఉన్నారు. ఆల్‌రౌండర్ల జాబితాలో జడ్డూ అగ్రస్థానంలో ఉండగా అశ్విన్‌ రెండో స్థానం కైవసం చేసుకున్నాడు. వన్డేల్లో విరాట్‌ కోహ్లీ (811) మూడు, రోహిత్‌ శర్మ (791) నాలుగో స్థానాల్లో కొనసాగుతున్నారు. జస్ప్రీత్‌ బుమ్రా టాప్‌-5లో ఉన్నాడు.